ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం చేపట్టిన ఎంసెట్ కౌన్సెలింగ్ జిల్లాలో ఏర్పాటు చేసిన నాలుగు హెల్ప్‌లైన్ కేంద్రాల్లో గురువారం ప్రారంభమైంది.
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం చేపట్టిన ఎంసెట్ కౌన్సెలింగ్ జిల్లాలో ఏర్పాటు చేసిన నాలుగు హెల్ప్‌లైన్ కేంద్రాల్లో గురువారం ప్రారంభమైంది. కౌన్సెలింగ్‌లో భాగంగా తొలిరోజు 1 నుంచి 5000 ర్యాంకు వరకు విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించగా జిల్లాలోని నాలుగు కేంద్రాలకు 127 మంది విద్యార్థులు హాజరయ్యూరు. గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలోని కేంద్రానికి 10 మంది, నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కేంద్రానికి 29 మంది, సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కేంద్రానికి 38 మంది, ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలోని కేంద్రానికి 50 మంది హాజరయ్యారు.
ఎంసెట్ కౌన్సెలింగ్ కోసం దాదాపు రెండు నెలలుగా ఎదురుచూస్తున్న విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం రోజున మాత్రం హెల్ప్‌లైన్ కేంద్రాలకు ఒక్కొక్కరుగా తరలివచ్చారు. గురువారం నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభమవుతుందని ముందుగానే తెలిసినప్పటికీ ర్యాంకులవారీగా సర్టిఫికెట్ల పరిశీలనకు ఎక్కడ హాజరు కావాలనే విషయమై బుధవారం రాత్రి వరకూ స్పష్టత లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందారు.
ర్యాంకులవారీగా హాజరు కావాల్సిన హెల్ప్‌లైన్ కేంద్రాల జాబితాను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి బుధవారం రాత్రి ఎంసెట్ వెబ్‌సైట్‌లో పొందుపర్చినప్పటికీ గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు షెడ్యూల్‌ను తెలుసుకోలేకపోయారు. గురువారం ఉదయం దినపత్రికల్లో చూశాక ఆయా హెల్ప్‌లైన్ కేంద్రాలకు వెళ్లారు. ఉదయం 9 గంటలకు సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభం కాగా మూరుమూల ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు 10.30 తర్వాతే హాజరవగలిగారు. తల్లిదండ్రులను వెంట పెట్టుకుని వచ్చిన విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలనను నిర్ణీత సమయానికి పూర్తి చేసుకుని వెళ్లారు.
నేటి షెడ్యూల్
శుక్రవారం 5001 నుంచి 10వేల ర్యాంకుల వరకు అభ్యర్థులను సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. గుజ్జనగుండ్లలోని కళాశాలలో 5,001 నుంచి 6,250 ర్యాంకు వరకు, నల్లపాడులోని కళాశాలలో 6,251 నుంచి 7,500 ర్యాంకు వరకు, సాంబశివపేటలోని మహిళా కళాశాలలో 7,501 నుంచి 8,750 ర్యాంకు వరకు, ఏఎన్‌యూలో 8,751 నుంచి 10 వేల ర్యాంకు వరకు విద్యార్థులు హాజరుకావాలి.