ప్రశాంతంగా ఎంసెట్
ఇంజినీరింగ్‌కు 6812, మెడిసిన్‌కు 2925 మంది హాజరు
మొత్తం హాజరు శాతం 95.6
ఆర్టీసీ సమ్మెతో పరీక్ష కేంద్రాలకు ముందే చేరుకున్న అభ్యర్థులు
కడప ఎడ్యుకేషన్ : వైద్య, ఇంజినీరింగ్ విద్యలో ప్రవేశానికి శుక్రవారం నిర్వహించిన ఎంసెట్-2015 జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు ఇంజినీరింగ్ పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు మెడిసిన్ పరీక్ష నిర్వహించారు. ఇంజినీరింగ్ విభాగంలో 7,070 మంది విద్యార్థులకు గాను 6812 మంది (96 శాతం) పరీక్ష రాశారు.
మెడిసిన్ విభాగంలో 3080 మందికి గాను 2925 మంది (95 శాతం) పరీక్ష రాశారు. కడప నగరంలో 10 పరీక్ష కేంద్రాల్లో, ప్రొద్దుటూరులో నాలుగు పరీక్ష కేంద్రాల్లో ఇంజినీరింగ్ పరీక్ష నిర్వహించారు. కడప నగరంలోని ఆరు కేంద్రాల్లో మెడిసిన్ పరీక్ష నిర్వహించారు. ఇంజినీరింగ్ విభాగంలో కడపలో 95.96 శాతం, ప్రొద్దుటూరులో 97 శాతం మంది పరీక్ష రాశారు.
ముందే చేరుకున్న విద్యార్థులు
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో అభ్యర్థులు ముందు జాగ్రత్తగా తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకున్నారు. ప్రయివేట్ వాహనాలు, ఆటోలు, ద్విచక్ర వాహనాలతో పాటు పలు ప్రయివేట్ కళాశాలలు, పాఠశాలలకు చెందిన వాహనాల్లో విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్ష కేంద్రంలోకి వచ్చే ప్రతి విద్యార్థిని గేటు వద్దే నిర్వాహకులు, పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లకుండా నిరోధించారు. ప్యాడ్‌లను కూడా అనుమతించలేదు.
రీజనల్ కోఆర్డినేటర్ పరిశీలన
నగరంలోని పరీక్ష కేంద్రాలను ఎంసెట్ రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్. రఘునాథరెడ్డి, స్పెషల్ అబ్జర్వర్ డాక్టర్ ఎం. రామకృష్ణారెడ్డి, అబ్జర్వర్లు మాధవరెడ్డి, సుబ్రమణ్యం శర్మ పరిశీలించారు. విద్యార్థులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. పరీక్ష కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు వారు తెలిపారు.