ఎంసెట్ విద్యార్థులకు ప్రత్యేక బస్సులు | Special buses for EAMCET Students | Sakshi
Sakshi News home page

ఎంసెట్ విద్యార్థులకు ప్రత్యేక బస్సులు

Published Fri, May 8 2015 4:17 AM | Last Updated on Sun, Sep 3 2017 1:36 AM

Special buses for EAMCET Students

గుంటూరు ఎడ్యుకేషన్ : ఆర్టీసీ సమ్మె ప్రభావంతో ఎంసెట్‌కు హాజరయ్యే విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాయి. గుంటూరు  పాటు, శివారు ప్రాంతాల్లోని ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ఏర్పాటు చేసిన  కేంద్రాలకు విద్యార్థులను ఉచితంగా తరలించేందుకు పలు కళాశాలలు మందుకొచ్చాయి. బస్సులను ఏర్పాటు చేసిన కళాశాలల వివరాలు...

 గుంటూరు రూరల్ మండలం చోడవరంలోని ఆర్వీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఎంసెట్‌కు పరీక్ష రాసేందుకు హాజరుకానున్న మూడు వేల మంది విద్యార్థులను తరలిచేందుకు 20 బస్సులను ఏర్పాటు చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి సుధాకర్ తెలిపారు. ఉచిత రవాణాతో పాటు విద్యార్థులు, వారి వెంట వచ్చే తల్లిదండ్రులకు ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నామన్నారు.

ఎన్టీఆర్ ఆర్టీసీ బస్టాండ్ నుంచి 4, బీఆర్ స్టేడియం, మణిపురం ఆర్వోబీ, నాజ్ సెంటర్ నుంచి ఒక్కొక్క బస్సు చొప్పున, లక్ష్మీపురం నుంచి మూడు, రాజేంద్ర నగర్ నుంచి ఒకటి, విజయపురి నుంచి, విద్యానగర్ నుంచి రెండు, అమరావతిరోడ్డు నుంచి రెండు, రైల్వే స్టేషన్ నుంచి ఒకటి, బ్రాడీపేట 4/14 నుంచి ఒకటి, ఎస్వీఎన్ కాలనీ నుంచి రెండు, శంకర్‌విలాస్ సెంటర్ నుంచి ఒకటి చొప్పున ఏర్పాటు చేసిన బస్సులు ఉదయం 7.10 గంటలకు బయలు దేరుతాయని తెలిపారు.

  పెదకాకాని మండలం నంబూరులోని వీవీఐటీ కళాశాలలో పరీక్ష రాసేందుకు వచ్చే విద్యార్థులను తరలించేందుకు అమరావతి, చిలకలూరిపేట, మంగళగిరి, పేరేచర్ల, పొన్నూరు, తెనాలి, విజయవాడలోని ఆర్టీసీ బస్టాండ్ల నుంచి ఉదయం 7 గంటలకు ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయని వీవీఐటీ చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ తెలిపారు. గుంటూరులోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు కళాశాల బస్సులను అందుబాటులో ఉంచుతున్నామని ప్రకటించారు.

  గుంటూరు రూరల్ మండలం చోడవరంలోని కళ్ళం ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్ష రాసేందుకు హాజరుకానున్న విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు కళాశాల డెరైక్టర్ డాక్టర్ ఎం.ఉమా శంకర్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్, మార్కెట్ సెంటర్ నుంచి ఉదయం 8 గంటలకు బస్సులు బయలు దేరుతాయని తెలిపారు. కళాశాల క్యాంటీన్‌లో అల్పాహారం అందుబాటులో ఉంచుతామన్నారు.

  విద్యార్థులను శుక్రవారం ఉదయం 8.30 గంటలకు ఎన్టీఆర్ ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఏసీ కళాశాల మీదుగా అమరావతి రోడ్డులోని హిందూ ఫార్మశీ కళాశాల వరకూ ఉన్న పరీక్షా కేంద్రాలకు మ్యాగ్నజీల్ కళాశాల బస్సులో ఉచితంగా చేరవేస్తామని  మ్యాగ్నజీల్ సీఏ విద్యాసంస్థ చైర్మన్ రేపాల రవికుమార్ తెలిపారు. వివరాలకు 96522 33336 ఫోన్ నంబర్లో సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement