'ఓటుకు నోటు' కేసులో కీలక మలుపు
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విషయంలో కేంద్రం ఎన్నికల సంఘం సీరియస్ అవుతోంది. ఈ వ్యవహారంలో స్వయంగా జోక్యం చేసుకొని ప్రత్యేకంగా కేసు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. క్రిమినల్ కేసు పెట్టడంతోపాటు అనర్హత వేటు వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉన్నదని సమాచారం. ఇప్పటికే ఈ కేసు విషయంలో ఎన్నికల సంఘం రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాలుగా ఏసీబీ సమర్పించిన 14 ఆడియో, వీడియో టేపుల కాపీలను తమకు ఇవ్వాల్సిందిగా కోరుతూ సీఈసీ తరఫు న్యాయవాది ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు కూడా.
ఈ టేపులు అసలువా.. కాదా అన్న విషయాన్ని నిర్ధారించేందుకు వీటిని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపిన విషయం తెలిసిందే. ల్యాబ్ నుంచి వీటిపై ప్రాథమిక నివేదిక కూడా ఇప్పటికే వచ్చింది. అయితే, ఎఫ్ఎస్ఎల్ నుంచి వచ్చిన టేపులను ఏసీబీ కోర్టు పరిశీలిస్తోంది. ఈ లోపే కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి కూడా తమకు ఈ టేపులు కావాలన్న మెమో దాఖలైంది.
తమ వద్ద ఒక కాపీ మాత్రమే ఉందని, ఎఫ్ఎస్ఎల్ వారు మరో కాపీ పంపితే, అప్పుడు ఇవ్వాలా వద్దా అన్న విషయమై నిర్ణయం తీసుకుంటామని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తెలిపారు. తమకు అందిన టేపుల కాపీలను ప్రస్తుతం కోర్టు పరిశీలిస్తోంది. మరో కాపీ వస్తే అప్పుడు దాన్ని సీఈసీకి ఇవ్వాలా లేదా అనే విషయమై నిర్ణయం తీసుకుంటారు. ఆడియో టేపులు, వీడియో టేపులు తమకు అందిన వెంటనే వాటిని పరిశీలించి శరవేగంగా ఈ కేసు విషయంలో చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు సమాచారం. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 123 ప్రకారమే కేసు నమోదు చేయాలని చూస్తోంది. ఓటుకు నోటు ఇచ్చినట్లు ఆరోపణలు నిరూపితమైతే సంబంధిత వ్యక్తులపై అనర్హత వేటు తప్పకపోవచ్చు.