రేవంత్, సండ్ర స్వర నివేదికలివ్వండి | ACB asks report for cash for vote case | Sakshi
Sakshi News home page

రేవంత్, సండ్ర స్వర నివేదికలివ్వండి

Published Sat, Nov 28 2015 2:41 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

రేవంత్, సండ్ర స్వర నివేదికలివ్వండి - Sakshi

రేవంత్, సండ్ర స్వర నివేదికలివ్వండి

న్యాయస్థానం నుంచి ఫోరెన్సిక్ రిపోర్టు కోరిన ఏసీబీ
కోర్టులో మెమో దాఖలు
నేడు నిర్ణయం తీసుకునే అవకాశం
‘ఓటుకు కోట్లు’కేసులో మళ్లీ కదలిక
చంద్రబాబు పాత్రను నిర్ధారిస్తూ చార్జిషీట్ వేయాలని ఏసీబీ యోచన


సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఈ కేసు దర్యాప్తులో కదలిక కనిపిస్తోంది. కేసులో నిందితులుగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య స్వరనమూనాలకు సంబంధించి ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) అందజేసిన నివేదిక తమకు ఇవ్వాలని కోరుతూ ఏసీబీ అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు శుక్రవారం ప్రత్యేక కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ కేసులో ఏసీబీ త్వరలో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేయనున్న నేపథ్యంలో ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక కీలకంగా మారనుంది. ఈ మెమోపై కోర్టు శనివారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందేందుకు రూ.150 కోట్లతో ఎమ్మెల్యేల కొనుగోలుకు టీడీపీ కుట్ర చేయడం తెలిసిందే. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ఓటు కోసం ప్రలోభపెట్టడంతోపాటు రూ.50 లక్షలు ఇస్తూ రేవంత్‌రెడ్డి, ఇతరులు ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు.
 
వారి అరెస్టు సమయంలో ఏసీబీ అధికారులు నిందితుల ఫోన్లు, ఆడియో, వీడియో టేపులను స్వాధీనం చేసుకున్నారు. స్వర నమూనాల పరిశీలన కోసం వాటిని ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపారు. అలాగే వారి ఒరిజినల్ వాయిస్ కోసం అసెంబ్లీ రికార్డులతో పాటు మీడియాతో సంభాషించిన టేపులను కూడా ఎఫ్‌ఎస్‌ఎల్ పరీక్షల కోసం పంపించారు. వాయిస్ స్పెట్రోగ్రాఫ్ వేవ్స్ ఆధారంగా సంభాషణలను పరిశీలించిన ఎఫ్‌ఎస్‌ఎల్... ఆడియో, వీడియో టేపులు నిజమైనవేనని, అందులో కత్తిరింతలు, అతికింపులు ఏమీ లేవని నిర్ధారించింది.
 
చంద్రబాబు వాయిసే కీలకం!
‘ఓటుకు కోట్లు’ కేసులో దర్యాప్తు పూర్తి చేసి, తుది చార్జిషీట్ వేయాలంటే ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాత్ర నిగ్గు తేలాల్సి ఉంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ఇస్తూ రేవంత్‌రెడ్డి పదేపదే తమ ‘బాస్’ చంద్రబాబు అదేశాల మేరకే చేస్తున్నట్లు చెప్పారు. అలాగే స్టీఫెన్‌సన్‌తో ఫోన్‌లో చంద్రబాబు మాట్లాడిన  టేపు కూడా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో, ఆడియో టేపులు నిజమైనవే అంటూ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇప్పటికే ధ్రువీకరించింది. ఈ విషయాలను కోర్టులో దాఖలు చేసిన మొదటి చార్జిషీటులో ఏసీబీ స్పష్టం చేసింది.
 
కేసు దర్యాప్తులో భాగంగా సప్లిమెంటరీ చార్జిషీట్లు వేస్తామని అప్పట్లో పేర్కొంది. అయితే సప్లిమెంటరీ చార్జిషీట్ లేదా తుది చార్జిషీట్ వేయాలంటే రేవంత్ మాదిరిగా చంద్రబాబు స్వర నమూనాలను నిర్ధారించుకోవాల్సి ఉంది. ఇందుకు రికార్డులు, ఒరిజినల్ వాయిస్‌లను కోర్టు ద్వారా ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపాలని ఏసీబీ నిర్ణయించింది. దాని ఆధారంగా చంద్రబాబు పాత్రను నిర్ధారిస్తూ చార్జిషీట్ వేయాలని ఏసీబీ యోచిస్తున్నట్లు సమాచారం. కానీ తాజా పరిణామాలు, పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు పాత్రను తేల్చడం తమకు కత్తిమీద సాము లాంటిదేనని ఏసీబీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement