CFV
-
‘ఓటుకు కోట్లు’పై పిల్ కొట్టివేత
న్యాయవాది పీవీ కృష్ణయ్య తీరుపై హైకోర్టు మండిపాటు కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారన్న ధర్మాసనం సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు దర్యాప్తును ఏసీబీ నుంచి సీబీఐకి బదలాయించాలం టూ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యా న్ని హైకోర్టు కొట్టేసింది. పార్టీ ఇన్ పర్సన్‌గా (పిటిషనర్ కమ్ న్యాయవాది) ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసిన న్యాయవాది పి.వి.కృష్ణయ్య తీరుపై మండిపడింది. కృష్ణయ్య తన చర్యల ద్వారా కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో మొదటి నుంచి కృష్ణయ్య వ్యవహరించిన తీరును తమ ఉత్తర్వుల్లో ప్రస్తావిస్తూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. అలాగే తాను రూ.లక్ష డిపాజిట్ చేయాలంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పునఃసమీక్షించాలంటూ కృష్ణయ్య దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను సైతం కొట్టేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడి న ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. ఓటుకు కోట్లు కేసులో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సీబీఐతో దర్యాప్తు చేయించాలని, అందువల్ల కేసును సీబీఐకి బదలాయించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ కృష్ణయ్య పిల్ దాఖలు చేసిన విష యం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. పిల్ దాఖలు వెనుక సదుద్దేశాలు ఉన్నాయని నిరూపించుకోవాలని, ఇందు కు గాను రూ. లక్షను కోర్టులో డిపాజిట్ చేయాలని, ఆ తర్వాతే కేసు తదుపరి విచారణను చేపడతామంటూ విచారణను వాయిదా వేసింది. కేసు తదుపరి విచారణ సమయంలో లక్ష రూపాయల డిపాజిట్ ఉత్తర్వులపై తాను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నానని కృష్ణయ్య తెలిపారు. దీంతో ధర్మాసనం కేసును వాయిదా వేసింది. అయితే కృష్ణయ్య సుప్రీంకోర్టులో కేసు వేశానని ఒకసారి, కేసు వేయలేదని మరోసారి చెప్పి వాయిదాలు కోరారు. ఈ నేపథ్యంలో తన కేసును న్యాయవాది రాజుకు అప్పగించారు. చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించలేదని తెలుసుకున్న ధర్మాసనం.. కృష్ణయ్య వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిచ్చింది. తాజాగా వ్యాజ్యం విచారణకు రాగా.. వ్యక్తిగత సమస్యల వల్ల కృష్ణయ్య కోర్టు ముందు హాజరు కాలేకపోతున్నారని ఆయన తరఫు న్యాయవాది రాజు కోర్టుకు తెలిపారు. దీనిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. మొదట్నుంచీ ఈ కేసులో కృష్ణయ్య ఇలాగే వ్యవహరిస్తున్నారని, కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని మండిపడింది. ఆయన తీరును ఉత్తర్వుల్లో పొందుపరిచింది. పిల్‌ను, దానితోపాటు అనుబంధ పిటిషన్‌ను కొట్టేసింది. -
రేవంత్, సండ్ర స్వర నివేదికలివ్వండి
న్యాయస్థానం నుంచి ఫోరెన్సిక్ రిపోర్టు కోరిన ఏసీబీ కోర్టులో మెమో దాఖలు నేడు నిర్ణయం తీసుకునే అవకాశం ‘ఓటుకు కోట్లు’కేసులో మళ్లీ కదలిక చంద్రబాబు పాత్రను నిర్ధారిస్తూ చార్జిషీట్ వేయాలని ఏసీబీ యోచన సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఈ కేసు దర్యాప్తులో కదలిక కనిపిస్తోంది. కేసులో నిందితులుగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య స్వరనమూనాలకు సంబంధించి ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) అందజేసిన నివేదిక తమకు ఇవ్వాలని కోరుతూ ఏసీబీ అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు శుక్రవారం ప్రత్యేక కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ కేసులో ఏసీబీ త్వరలో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేయనున్న నేపథ్యంలో ఎఫ్ఎస్ఎల్ నివేదిక కీలకంగా మారనుంది. ఈ మెమోపై కోర్టు శనివారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందేందుకు రూ.150 కోట్లతో ఎమ్మెల్యేల కొనుగోలుకు టీడీపీ కుట్ర చేయడం తెలిసిందే. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ఓటు కోసం ప్రలోభపెట్టడంతోపాటు రూ.50 లక్షలు ఇస్తూ రేవంత్‌రెడ్డి, ఇతరులు ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. వారి అరెస్టు సమయంలో ఏసీబీ అధికారులు నిందితుల ఫోన్లు, ఆడియో, వీడియో టేపులను స్వాధీనం చేసుకున్నారు. స్వర నమూనాల పరిశీలన కోసం వాటిని ఎఫ్ఎస్ఎల్కు పంపారు. అలాగే వారి ఒరిజినల్ వాయిస్ కోసం అసెంబ్లీ రికార్డులతో పాటు మీడియాతో సంభాషించిన టేపులను కూడా ఎఫ్ఎస్ఎల్ పరీక్షల కోసం పంపించారు. వాయిస్ స్పెట్రోగ్రాఫ్ వేవ్స్ ఆధారంగా సంభాషణలను పరిశీలించిన ఎఫ్ఎస్ఎల్... ఆడియో, వీడియో టేపులు నిజమైనవేనని, అందులో కత్తిరింతలు, అతికింపులు ఏమీ లేవని నిర్ధారించింది. చంద్రబాబు వాయిసే కీలకం! ‘ఓటుకు కోట్లు’ కేసులో దర్యాప్తు పూర్తి చేసి, తుది చార్జిషీట్ వేయాలంటే ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాత్ర నిగ్గు తేలాల్సి ఉంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు ఇస్తూ రేవంత్‌రెడ్డి పదేపదే తమ ‘బాస్’ చంద్రబాబు అదేశాల మేరకే చేస్తున్నట్లు చెప్పారు. అలాగే స్టీఫెన్‌సన్‌తో ఫోన్లో చంద్రబాబు మాట్లాడిన టేపు కూడా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో, ఆడియో టేపులు నిజమైనవే అంటూ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇప్పటికే ధ్రువీకరించింది. ఈ విషయాలను కోర్టులో దాఖలు చేసిన మొదటి చార్జిషీటులో ఏసీబీ స్పష్టం చేసింది. కేసు దర్యాప్తులో భాగంగా సప్లిమెంటరీ చార్జిషీట్లు వేస్తామని అప్పట్లో పేర్కొంది. అయితే సప్లిమెంటరీ చార్జిషీట్ లేదా తుది చార్జిషీట్ వేయాలంటే రేవంత్ మాదిరిగా చంద్రబాబు స్వర నమూనాలను నిర్ధారించుకోవాల్సి ఉంది. ఇందుకు రికార్డులు, ఒరిజినల్ వాయిస్‌లను కోర్టు ద్వారా ఎఫ్ఎస్ఎల్కు పంపాలని ఏసీబీ నిర్ణయించింది. దాని ఆధారంగా చంద్రబాబు పాత్రను నిర్ధారిస్తూ చార్జిషీట్ వేయాలని ఏసీబీ యోచిస్తున్నట్లు సమాచారం. కానీ తాజా పరిణామాలు, పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు పాత్రను తేల్చడం తమకు కత్తిమీద సాము లాంటిదేనని ఏసీబీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
'ఓటుకు కోట్లు కేసులో నన్ను కావాలనే ఇరికించారు'
ఆల్కాట్‌తోట (రాజమండ్రి) : ఓటుకు కోట్లు కేసులో తనను కావాలనే ఇరికించారని ఆ కేసులో నిందితుడు, ఆలిండియా ఇండిపెండెంట్ చర్చెస్ డయూసిస్ అండ్ యూనియన్ చైర్మన్ డాక్టర్ హ్యారీ సెబాస్టియన్ ఆరోపించారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సెన్ డబ్బులకు కక్కుర్తిపడి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కలిసి తనను ఈ కేసులో ఇరికించారని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో మంగళవారం జరిగిన అభిషేక మహోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఓటుకు కోట్లు కేసులో తామంతా నిర్దోషులమని, ఈ విషయం త్వరలోనే తేలుతుందన్నారు. క్రైస్తవులు జెరూసలేం వెళ్లేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ విమానం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డిసెంబర్ నెలలో గుంటూరులో క్రైస్తవ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారన్నారు. మైనార్టీ వర్గంలో ఉన్న క్రైస్తవులకు కో ఆప్షన్ పదవులు ఇవ్వకుండా, ముస్లింలకే ఇస్తున్నారని ఆరోపించారు. క్రైస్తవులను మైనార్టీ వర్గాలుగా గుర్తించకుండా కేవలం దళితులుగానే చూస్తున్నారన్నారు. క్రైస్తవ మత సంస్థలు మతమార్పిడి చేస్తున్నారంటూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ తదితర సంస్థలు చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. -
'డ్రైవర్ల ఎంపికలోనూ జాగ్రత్త పడ్డారు'
హైదరాబాద్ : మోతీనగర్, సికింద్రాబాద్ ప్రాంతాల చుట్టే ఈ వ్యవహారం జరిగిందని, డ్రైవర్ల ఎంపికలోనూ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య టీమ్ జాగ్రత్త పడిందని తెలుస్తోంది. ఓటుకు కోట్లు కేసుకు సంబంధించి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లోనే కీలక భేటీలు జరిగాయని, పార్టీ ఆఫీసు ముందు, క్యాంటీన్లలోనూ ఎమ్మెల్యేల కొనుగోలు కోసం భేటీలు జరిగాయని రిపోర్టులో తేలింది. మొదటి మూడు రోజులు పక్కా ప్లాన్ చేసుకుని, మే 30 న రేవంత్ రెడ్డిని ఈ ఆపరేషన్ లోకి సండ్ర దించినట్లు రిపోర్టు కథనంలో తేలింది. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఏం చేసినా జనార్ధన్ అనే వ్యక్తికి సండ్ర, సెబాస్టియన్ అప్డేట్ చేసేవారు. కొందరు వ్యక్తులను కలవడానికి టీడీపీ నేతలు క్రిస్టియన్ ప్రెసిడెంట్ బిషప్ సాయం తీసుకున్నారు. రెండు పార్టీలు కలుసుకునే విషయంలో సండ్ర టీమ్ చాలా జాగ్రత్తులు తీసుకుంది. సులభంగా గుర్తుపట్టే అడ్రస్‌లు చెప్పాలంటూ సండ్ర సూచనలిచ్చేవారు. ఈ వ్యవహారంపై ఎప్పటికప్పుడు స్టేటస్ రిపోర్టుపై సెబాస్టియన్ ఎస్ఎమ్ఎస్లు పంపేవాడని ఏసీబీ రిపోర్టులో పేర్కొంది. -
'టీఆర్ఎస్ లో అదిరేలా ఆహ్వానం... ఆ తర్వాతే..'
న్యూఢిల్లీ: నిందితుల బెయిల్ షరతులలో ర్యాలీలు, ప్రసంగాలు చేయవద్దని నిబంధనలు పెట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ వీ హనుమంతరావు పేర్కొన్నారు. ఓటుకు కోట్లు కేసులో నిందితుడుగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విషయమై న్యూఢిల్లీలోని మీడియాతో ఆయన మాట్లాడుతూ... కేసు నుంచి నిర్దోషిగా బయట పడినప్పుడే ర్యాలీలు, ప్రసంగాలు చేయాలని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ టీఆర్ఎస్ లో చేరిన వ్యవహారంపై ఆయన స్పందిస్తూ... డీఎస్ కాంగ్రెస్ ను వీడితే పార్టీకి నష్టమేమీ లేదన్నారు. టీఆర్ఎస్లో ఆహ్వానం అదిరేలా ఉంటుందని... ఆ తర్వాత ఎవరూ పట్టించుకోరని వీహెచ్ అభిప్రాయపడ్డారు. -
'దొంగలకు నీతులు చెప్పే హక్కులేదు'
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టపగలు దొరికిన దొంగ అని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. 'సెక్షన్ - 8' అంశంపై శనివారం మాట్లాడుతూ... దొరికిన దొంగలకు నీతులు చెప్పే హక్కులేదని ఆయన వ్యాఖ్యానించారు. సెక్షన్ 8 పై ఏపీ మంత్రులు అవగాహనతో మాట్లాడితే మంచిదని ఆయన హితవు పలికారు. చంద్రబాబు, ఆయన మంత్రుల్లాంటి వారు దొరకడం ఏపీ ప్రజలు చేసుకున్న కర్మ అని మంత్రి కడియం శ్రీహరి అభిప్రాయపడ్డారు. -
'ఓటుకు నోటు' కేసులో కీలక మలుపు
-
'రేవంత్ తరచూ ఓ ఫైనాన్షియర్ తో మాట్లాడేవారు'
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో నిందితుడుగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి సంబంధించిన మరికొన్ని వాస్తవాలు వెల్లడవుతున్నాయి. రేవంత్ తరచుగా అమీర్‌పేటకు చెందిన ఓ ఫైనాన్షియర్ తో ఫోన్లో మాట్లాడేవారని ఏసీబీ వెల్లడించింది. తమ వద్ద ఉన్న కాల్ లిస్టు సమాచారంతో తెలంగాణ ఏసీబీ ఈ విషయాన్ని ధృవీకరించింది. కాగా, ఆ ఫైనాన్షియర్ కృష్ణా జిల్లాకు చెందిన వారని పోలీసులు భావిస్తున్నారు. ఓటుకు కోట్లు కేసు విచారణలో భాగంగా రేవంత్ కు సన్నిహితుడైన ఆ ఫైనాన్షియర్ ను ప్రశ్నించాలని ఏసీబీ అధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలను కొనేందుకు రేవంత్ కు నగదు ఏమైనా ఇచ్చాడా అనే కోణంలోనూ దర్యాప్తు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
'ఓటుకు నోటు' కేసులో కీలక మలుపు
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విషయంలో కేంద్రం ఎన్నికల సంఘం సీరియస్ అవుతోంది. ఈ వ్యవహారంలో స్వయంగా జోక్యం చేసుకొని ప్రత్యేకంగా కేసు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. క్రిమినల్ కేసు పెట్టడంతోపాటు అనర్హత వేటు వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉన్నదని సమాచారం. ఇప్పటికే ఈ కేసు విషయంలో ఎన్నికల సంఘం రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాలుగా ఏసీబీ సమర్పించిన 14 ఆడియో, వీడియో టేపుల కాపీలను తమకు ఇవ్వాల్సిందిగా కోరుతూ సీఈసీ తరఫు న్యాయవాది ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు కూడా. ఈ టేపులు అసలువా.. కాదా అన్న విషయాన్ని నిర్ధారించేందుకు వీటిని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపిన విషయం తెలిసిందే. ల్యాబ్ నుంచి వీటిపై ప్రాథమిక నివేదిక కూడా ఇప్పటికే వచ్చింది. అయితే, ఎఫ్ఎస్ఎల్ నుంచి వచ్చిన టేపులను ఏసీబీ కోర్టు పరిశీలిస్తోంది. ఈ లోపే కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి కూడా తమకు ఈ టేపులు కావాలన్న మెమో దాఖలైంది. తమ వద్ద ఒక కాపీ మాత్రమే ఉందని, ఎఫ్ఎస్ఎల్ వారు మరో కాపీ పంపితే, అప్పుడు ఇవ్వాలా వద్దా అన్న విషయమై నిర్ణయం తీసుకుంటామని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తెలిపారు. తమకు అందిన టేపుల కాపీలను ప్రస్తుతం కోర్టు పరిశీలిస్తోంది. మరో కాపీ వస్తే అప్పుడు దాన్ని సీఈసీకి ఇవ్వాలా లేదా అనే విషయమై నిర్ణయం తీసుకుంటారు. ఆడియో టేపులు, వీడియో టేపులు తమకు అందిన వెంటనే వాటిని పరిశీలించి శరవేగంగా ఈ కేసు విషయంలో చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు సమాచారం. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 123 ప్రకారమే కేసు నమోదు చేయాలని చూస్తోంది. ఓటుకు నోటు ఇచ్చినట్లు ఆరోపణలు నిరూపితమైతే సంబంధిత వ్యక్తులపై అనర్హత వేటు తప్పకపోవచ్చు. -
'ఆ హార్డ్ డిస్క్ లు, ఆడియో టేపులు ఇవ్వండి'
హైదరాబాద్ : ఫోరెన్సిక్ కోర్టుకు సమర్పించిన నాలుగు హార్డ్ డిస్క్‌లు, 3 ఆడియో టేపులను తమకు ఇవ్వాలని ఏసీబీ అధికారులు గురువారం కోర్టులో మెమో దాఖలు చేశారు. తదుపరి విచారణ జరిపేందుకు అవి చాలా అవసరమని ఏసీబీ అధికారులు తమ పిటిషన్లో పేర్కొన్నారు. మరోవైపు ఫోరెన్సిక్ నివేదికను కూడా ఏసీబీ తన అదనపు కౌంటర్‌తో జోడించింది. స్టీఫెన్‌సన్‌తో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సాగించిన సంభాషణలకు సంబంధించిన ఈ నివేదికలో అంశాల ఆధారంగా తాము చేపట్టదలచిన దర్యాప్తు వివరాలను ఏసీబీ హైకోర్టుకు నివేదించింది. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రూ.5 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని, రూ.50 లక్షలు అడ్వాన్సుగా ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి రహస్యంగా చిత్రీకరించిన వీడియోలు, స్టీఫెన్‌సన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు నేరుగా సాగించిన బేరసారాల ఆడియో రికార్డులు బహిర్గతమయ్యాయి కూడా. రేవంత్ ఏసీబీకి పట్టుబడి దాదాపు 26 రోజులు కావస్తోంది. -
బాబు సిబ్బందిలో తెలంగాణ పోలీసుల బదిలీ
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు వ్యవహారం కీలక దశకు చేరుకుంటున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అంతర్గత సిబ్బందిని మారుస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐఎస్‌డబ్ల్యూ డిపార్ట్మెంట్కి చెందిన మొత్తం 40 మంది తెలంగాణ పోలీసు సిబ్బందిని రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎఫ్ఎస్ఎల్ ప్రాథమిక నివేదిక ఏసీబీ కోర్టుకు అందిన కొన్ని గంటల్లోపే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అంతకుముందు ఓటుకు కోట్లు వ్యవహారంలో ఆడియో టేపులు వెలువడిన వెంటనే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం విదితమే. ఆడియో టేపులు అసలైనవేనని, వాటిలో ఎలాంటి ఎడిటింగ్ చేయలేదని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ తన ప్రాథమిక నివేదికను ఏసీబీ కోర్టుకు సమర్పించింది. దీంతో వెంటనే ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముందుగా సీఎం నివాసం వద్ద భద్రతా ఇబ్బంది మొత్తాన్ని మార్చి వేశారు. ఇంటి వద్ద భద్రతను పర్యవేక్షణను అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారికి అప్పగించారు. అలాగే గ్రేహౌండ్స్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో కూడా సమూల మార్పులు చేసుకుంటూ వచ్చారు. తెలంగాణలో పోలీస్ స్టేషన్లు ఏర్పాటుచేస్తామని ఇటీవలే బాబు వ్యాఖ్యలు చేశారు. అందుకు అనుగుణంగానే ఈ మార్పులు జరిగాయా అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. -
'అప్రజాస్వామిక విధానాలలో చంద్రబాబు దిట్ట'
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పదవిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మానవ హక్కుల నేత, సామాజిక శాస్త్రవేత్త, ప్రొఫెసర్ హరగోపాల్ విమర్శించారు. నగరంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అప్రజాస్వామిక విధానాలు అవలంభించడంలో చంద్రబాబు దిట్ట అని హరగోపాల్ మండిపడ్డారు. ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకు సెక్షన్ 8 అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ లో ప్రజలు ప్రస్తుతం సంతోషంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. -
రేవంత్ కు బెయిల్ ఇవ్వొద్దు: ఏసీబీ
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో తెలంగాణ ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. కేసు కీలకదశలో ఉన్నందున రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయొద్దని ఏసీబీ హైకోర్టును కోరింది. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు నోటీసులు జారీచేసినా విచారణాధికారి ముందు హాజరు కాలేదని ఏసీబీ తన పిటిషన్ లో పేర్కొంది. మరో నిందితుడు ముత్తయ్య ప్రస్తుతం పరారీలో ఉన్నాడని హైకోర్టుకు విన్నవించింది. ఇటువంటి కీలక సమయంలో రేవంత్ రెడ్డికి బెయిల్ ఇస్తే.. విచారణకు ఆటంకం ఏర్పడుతుందని ఏసీబీ అధికారులు తమ కౌంటర్ పిటిషన్లో హైకోర్టుకు వివరించారు.