‘ఏకీకృతం’పై రెండు ఫైళ్లు!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్‌పై కసరత్తు ఓ కొలిక్కి వస్తోంది. దీనిపై రెండు రకాల ఫైళ్లను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించాలని విద్యాశాఖ అధికారులు యోచిస్తున్నారు. పంచాయతీరాజ్ టీచర్లు(జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు స్కూళ్ల ఉపాధ్యాయులు), ఎంఈవో పోస్టులను లోకల్ కేడర్(రాష్ట్రపతి ఉత్తర్వుల్లో)గా గుర్తింపునకు వీలుగా రాష్ట్రపతి ఆమోదం పొందేందుకు ఒక ఫైలును రూపొందిస్తుండగా.. ఉపాధ్యాయుల కేడర్, పదోన్నతుల నిబంధనలు, మార్గదర్శకాలకు సంబంధించి మరో ఫైలును సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.
త్వరలోనే వీటిని ప్రభుత్వానికి పంపించాలని భావిస్తున్నారు. ఈ తరువాత ప్రభుత్వ స్థాయిలో అడ్వొకేట్ జనరల్ అభిప్రాయం తీసుకోనున్నారు. రాష్ట్రపతి ఆమోదానికి వీటిని పంపించాలా? వద్దా? కొత్త రాష్ట్రం అయినందున కొత్తగా సర్వీసు రూల్స్ రూపొందించుకుంటున్నందున ఆ అవసరముంటుందా? లేదా? అనే అంశాలపై అభిప్రాయం తీసుకొని ముందుకు సాగనున్నారు. అయితే, పంచాయతీరాజ్ టీచర్లు, ఎంఈవో పోస్టులను రాష్ట్రపతి ఉత్తర్వుల్లో(371డీ) లోకల్ కేడర్‌గా గుర్తింపు తీసుకు వస్తేనే భవిష్యత్తులో న్యాయ పరమైన సమస్యలు తలెత్తబోవనే వాదనలున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రకాల ఫైళ్లను రూపొందించే పనిలో పడ్డారు.
గొడవంతా వాటి కోసమే..
ప్రస్తుతం ప్రభుత్వ టీచర్లు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్, డిప్యూటీ డీఈవో పోస్టులను లోకల్ కేడర్‌గా గుర్తిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పొందుపరిచారు. అందులో పంచాయతీరాజ్ టీచర్లు, ఎంఈవోను లోకల్ కేడర్‌గా పేర్కొనలేదు. అయితే డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్‌గా ఉన్న పోస్టులను మండల విద్యాధికారి(ఎంఈవో) పోస్టుగా మార్పు చే సినందున.. ఎంఈవో పోస్టులతోపాటు లోకల్ కేడర్‌గా గుర్తింపు ఉన్న డిప్యూటీ డీఈవో పోస్టులు తమవేనని ప్రభుత్వ ఉపాధ్యాయులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆ కేసు ఇప్పటికీ కొనసాగుతోంది.
అటు అత్యధిక సంఖ్యలో ఉన్న పంచాయతీరాజ్ టీచర్లు తమకూ లోకల్ కేడర్‌గా గుర్తింపు వచ్చేలా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. తద్వారా ఎంఈవో, డిప్యూటీ డీఈవో పోస్టుల్లో పదోన్నతులకు తమకు అర్హత లభిస్తుందని అంటున్నారు. దీనిపై సుప్రీంలో ఉన్న కేసు తేలకపోవడంతో తొమ్మిదేళ్లుగా ఈ పోస్టుల భర్తీ ఆగిపోయింది. క్షేత్ర స్థాయిలో పాఠశాలల పర్యవేక్షణ దెబ్బతింది.
అందుకే ప్రస్తుతం కొత్త రాష్ట్రం ఏర్పడటంతోపాటు రూల్స్‌లో మార్పులు చేసుకునే అవకాశం వచ్చినందున.. పైగా సుప్రీంకోర్టులోని కేసు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినదే అవుతుందనే భావనతో ఏకీకృత సర్వీసు రూల్స్ తెచ్చేందుకు సర్కారు సిద్ధమైంది. ఈ మేరకు రూపొందించే రూల్స్‌తో ఓవైపు రేషనలైజేషన్ త రువాత బదిలీలకు చర్యలు చేపట్టాలని.. మరోవైపు లోకల్ గుర్తింపు ఫైలును రాష్ట్రపతికి పంపించి సాధ్యమైనంత త్వరగా ఆమోదం పొందాలని విద్యాశాఖ యోచిస్తోంది.