panchayati raj teachers
-
ఆశలు అడియాసలే?
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ టీచర్లు 26 ఏళ్లుగా ఏకీకృత సర్వీసు రూల్స్ కోసం చేస్తున్న పోరాటానికి ఫలితం లేకుండా పోయింది. టీచర్ల సంఘాలు, ప్రభుత్వాలు ఏకమైనా తమ వాదనను నెగ్గించుకోలేకపోయాయి. పంచాయతీరాజ్ టీచర్లను లోకల్ కేడర్‌గా ఆర్గనైజ్ చేస్తూ రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను కూడా కోర్టు కొట్టేయడంతో సుమారు 1.20 లక్షల మంది టీచర్ల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. దీంతో ఏం చేయాలో పాలుపోక ప్రభుత్వం, టీచర్ల సంఘాలు సందిగ్ధంలో పడిపోయాయి. ప్రభుత్వ, పంచాయతీరాజ్ టీచర్లకు కలిపి ఏకీకృత సర్వీసు రూల్స్ కోసం అనేకమార్లు ప్రభుత్వాలు జీవోలు జారీ చేసినా కోర్టుల్లో నిలువలేకపోయాయి. 1992 నుంచి అనేకసార్లు ప్రభుత్వాలు చర్యలు చేపట్టినా న్యాయ వివాదాలుగా మారిపోయాయి. అసలేం జరిగిందంటే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ శాఖల్లోని పోస్టులను 1971లో రాష్ట్ర, జోనల్, జిల్లా స్థాయిగా విభజించారు. ఉద్యోగుల నియామకాలు, పదోన్నతులకు సంబంధించి రాష్ట్రపతి ఆమోద ముద్రతో ప్రభుత్వం జీవో నంబర్ 529ని జారీ చేసింది. విద్యా శాఖకు వచ్చేసరికి ప్రభుత్వ పాఠశాలల టీచర్లనే చేర్చింది. అప్పటికి పంచాయతీరాజ్ టీచర్ల వ్యవస్థ పూర్తిస్థాయిలో ఏర్పాటు కాలేదు. తర్వాత కాలంలో పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని జిల్లా పరిషత్‌లు ఎక్కడికక్కడ పాఠశాలలు ఏర్పాటు చేసి టీచర్లను నియమించుకున్నాయి. దీంతో 1990 నాటికి ఆ స్కూళ్లు, టీచర్ల సంఖ్య భారీగా పెరిగింది. తమను కూడా ప్రభుత్వ టీచర్లతో సమానంగా పరిగణించాలని.. డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్, డిప్యూటీ డీఈవో, డైట్ లెక్చరర్ పోస్టుల్లో పదోన్నతులు కల్పించాలని పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంఘాలు పోరాటం చేశాయి. దీంతో ప్రభుత్వం 1992లో జీవో నంబర్ 40ను జారీ చేసింది. న్యాయపరమైన ఆటంకాలతో ఆ జీవోను ప్రభుత్వమే విరమించుకుంది. దీంతో అది అమలుకు నోచుకోలేదు. 1998లో ఒకసారి, 2005లో మరోసారి.. ప్రభుత్వం 1998లో ఉమ్మడి సర్వీసు రూల్సు రూపొందించి జీవో 505ను, 538లను జారీ చేసింది. పంచాయతీరాజ్ టీచర్లు రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని లోక ల్ కేడర్ పరిధిలో లేనందున ఉమ్మడి సర్వీసు నిబంధనలకు వీల్లేదని ప్రభుత్వ టీచర్లు ట్రిబ్యునల్‌ను ఆశ్ర యించారు. ఉమ్మడి సర్వీసు రూల్స్‌ను ట్రిబ్యునల్ సమర్థించగా ప్రభుత్వ టీచర్లు హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించాకే ప్రభుత్వ, పంచాయతీరాజ్ టీచర్లను కలపాలని హైకోర్టు ఉమ్మడి సర్వీసు నిబంధనలను 2003లో కొట్టేసింది. అప్పటి నుంచి డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్, డిప్యూటీ డీఈవో, డైట్ లెక్చరర్ వంటి పోస్టుల్లో పదోన్నతులు నిలిచిపోయాయి. తరువాత వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం 2005 మేలో మళ్లీ ఏకీకృత సర్వీసు కోసం జీవో 95, 96లను జారీ చేసి పదోన్నతులు కల్పించింది. వాటి పై మళ్లీ ప్రభుత్వ టీచర్లు ట్రిబ్యునల్‌లో సవాల్ చేసి గెలిచారు. ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించగా 2007లో ‘రూల్స్’కు వ్యతిరేకంగా కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ప్రభుత్వం 2007లోనే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అనేక వాదనలు, వాయిదాల తరు వాత 2015 సెప్టెంబర్ 30న తీర్పు ఇచ్చింది. సుప్రీం ఏం చెప్పిందంటే.. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్గనైజ్ అయి ఉన్న ప్రభుత్వ టీచర్లకు, ఆర్గనైజ్ కాని పంచాయతీరాజ్ టీచర్లకు కలిపి ఏకీకృత సర్వీసు రూల్స్ చేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు చెప్పింది. ‘ఉమ్మడి సర్వీసు రూల్స్ తీసుకురావాలంటే రాష్ట్ర పతి ఉత్తర్వులకు కేంద్రం ద్వారా సవరణ చేయించాలి. ఆ సవరణ ద్వారా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పంచాయతీరాజ్ టీచర్లను లోకల్ కేడర్‌గా పొందుపరచడం ద్వారానే ఒకే సర్వీసు రూల్స్ తీసుకురావడం సా«ధ్యం అవుతుంది. అప్పటి వరకు ఉమ్మడి రూల్స్ కుదరదు’అని పేర్కొంది. 2017లో రాష్ట్రపతి ఉత్తర్వులు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అధిక సంఖ్యలో ఉన్న పంచాయతీరాజ్ టీచర్లను లోకల్ కేడర్‌గా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఆర్గనైజ్ చేసేలా చర్యలు చేపట్టాలని కోరు తూ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఫైలుపై 2016 ఏప్రిల్ 5న సీఎం కేసీఆర్ సంతకం చేశారు. ఆ తరు వాత దాన్ని కేంద్ర హోంశాఖకు పంపారు. ఈ సమస్య ఏపీతోనూ ముడిపడి ఉన్నందున ఆ రాష్ట్రం కూడా ప్రతిపాదనలు పంపింది. తరువాత పలుమా ర్లు సంప్రదింపులు, చర్చల అనంతరం 2017 జూన్ 23న రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. దాన్ని సవాలు చేస్తూ ప్రభుత్వ టీచర్లు 2017 జూలై 12న హైకోర్టులో కేసు వేశారు. తాజాగా మంగళవా రం రాష్ట్రపతి ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. అందువల్లే ఈ పరిస్థితి! రాష్ట్రపతి ఉత్తర్వుల జారీకి ముందే.. రాష్ట్రంలో ఏకీకృత సర్వీసు రూల్స్ కోసం అభ్యంతరాలు ఉన్నాయా? అని రాష్ట్రపతి అడిగినపుడు అభ్యంతరాలు లేవని చెప్పడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ప్రభుత్వ టీచర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మామిడోజు వీరాచారి అన్నారు. ఏ దశలోనూ తమ వాదనను, అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వ అధికారులు పొరపాటు చేశారని చెప్పారు. న్యాయం తమవైపే ఉందని కోర్టు తీర్పుతో వెల్లడైందన్నారు. -
‘ఏకీకృత’ ఫైలును రాష్ట్రపతికి పంపండి
కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆదేశించిన రాజ్‌నాథ్ సింగ్ సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీసు నిబంధనల అమలుకు సంబంధించిన ఫైలును వెంటనే రాష్ట్రపతి ఆమోదానికి పంపా లని కేంద్ర హోంశాఖ కార్యదర్శిని.. హోంమం త్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆదేశించారు. గతంలో ఇదే విషయమై ఏపీ, తెలంగాణ విద్యా శాఖ మంత్రులు కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు. బుధవారం తెలంగాణ పీఆర్టీయూ వ్యవస్థాపకుడు బి.మోహన్‌రెడ్డి, అధ్యక్షుడు సరోత్తంరెడ్డి, ఎమ్మెల్సీలు కాటే పల్లి జనార్దన్‌రెడ్డి. పూల రవీందర్, ప్రధాన కార్యదర్శి చెన్న కేశవరెడ్డి తదితరులు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని ఢిల్లీలో కలసి సర్వీస్ రూల్స్‌పై చర్చించారు. దీంతో వెంకయ్యనాయుడు రాజ్‌నాథ్‌తో సమావే శమై సర్వీస్ రూల్స్ ఫైలును రాష్ట్రపతి ఆమోదా నికి పంపే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. దీంతో రాజ్‌నాథ్ కేంద్ర హోంశాఖ కార్యదర్శిని పిలిపించి ఫైలును వెంటనే రాష్ట్రపతి ఆమోదానికి పంపాలని ఆదేశించారు. ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల ఎస్టీయూ నేతలు సోమవారం హోంశాఖ కార్యదర్శి దిలీప్‌కుమార్‌తో సమావేశమై సర్వీసు రూల్స్ అమలుపై చర్చించారు. ఏకీకృత సర్వీసు నిబంధనల ఫైలును త్వరలోనే రాష్ట్రపతి ఆమోదానికి పంపుతామని ఆయన హామీ ఇచ్చారు. -
‘సర్వీసు రూల్స్’పై రెండు రాష్ట్రాల ఏకాభిప్రాయం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, పంచాయతీరాజ్ టీచర్లకు ఏకీకృత సర్వీసు రూల్స్ కోసం కేంద్రానికి పంపనున్న ప్రతిపాదనలపై ఏకాభిప్రాయం కుదిరింది. సర్వీస్ రూల్స్ విషయమై తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు పంపిన ప్రతిపాదనల్లో తేడాలుండటంతో మరోసారి చర్చించి ఒకే ప్రతిపాదనతో రావాలని గత నెలలో కేంద్రం సూచిం చింది. దీంతో మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఏపీ విద్యాశాఖ కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ సమావేశమై చర్చించగా రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. టీచర్, గెజిటెడ్ పోస్టులు రెండింటికి 1998 నుంచే ఏకీకృత సర్వీసు రూల్స్ ఉండేలా చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు 3 రోజుల్లో కేంద్రానికి రెండు రాష్ట్రాలు లేఖలు పంపేందుకు సిద్ధమయ్యాయని పీఆర్టీయూ-టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సరోత్తంరెడ్డి, లక్ష్మారెడ్డి తెలిపారు. -
‘ఏకీకృతం’పై రెండు ఫైళ్లు!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్‌పై కసరత్తు ఓ కొలిక్కి వస్తోంది. దీనిపై రెండు రకాల ఫైళ్లను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించాలని విద్యాశాఖ అధికారులు యోచిస్తున్నారు. పంచాయతీరాజ్ టీచర్లు(జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు స్కూళ్ల ఉపాధ్యాయులు), ఎంఈవో పోస్టులను లోకల్ కేడర్(రాష్ట్రపతి ఉత్తర్వుల్లో)గా గుర్తింపునకు వీలుగా రాష్ట్రపతి ఆమోదం పొందేందుకు ఒక ఫైలును రూపొందిస్తుండగా.. ఉపాధ్యాయుల కేడర్, పదోన్నతుల నిబంధనలు, మార్గదర్శకాలకు సంబంధించి మరో ఫైలును సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. త్వరలోనే వీటిని ప్రభుత్వానికి పంపించాలని భావిస్తున్నారు. ఈ తరువాత ప్రభుత్వ స్థాయిలో అడ్వొకేట్ జనరల్ అభిప్రాయం తీసుకోనున్నారు. రాష్ట్రపతి ఆమోదానికి వీటిని పంపించాలా? వద్దా? కొత్త రాష్ట్రం అయినందున కొత్తగా సర్వీసు రూల్స్ రూపొందించుకుంటున్నందున ఆ అవసరముంటుందా? లేదా? అనే అంశాలపై అభిప్రాయం తీసుకొని ముందుకు సాగనున్నారు. అయితే, పంచాయతీరాజ్ టీచర్లు, ఎంఈవో పోస్టులను రాష్ట్రపతి ఉత్తర్వుల్లో(371డీ) లోకల్ కేడర్‌గా గుర్తింపు తీసుకు వస్తేనే భవిష్యత్తులో న్యాయ పరమైన సమస్యలు తలెత్తబోవనే వాదనలున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రకాల ఫైళ్లను రూపొందించే పనిలో పడ్డారు. గొడవంతా వాటి కోసమే.. ప్రస్తుతం ప్రభుత్వ టీచర్లు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్, డిప్యూటీ డీఈవో పోస్టులను లోకల్ కేడర్‌గా గుర్తిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పొందుపరిచారు. అందులో పంచాయతీరాజ్ టీచర్లు, ఎంఈవోను లోకల్ కేడర్‌గా పేర్కొనలేదు. అయితే డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్‌గా ఉన్న పోస్టులను మండల విద్యాధికారి(ఎంఈవో) పోస్టుగా మార్పు చే సినందున.. ఎంఈవో పోస్టులతోపాటు లోకల్ కేడర్‌గా గుర్తింపు ఉన్న డిప్యూటీ డీఈవో పోస్టులు తమవేనని ప్రభుత్వ ఉపాధ్యాయులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆ కేసు ఇప్పటికీ కొనసాగుతోంది. అటు అత్యధిక సంఖ్యలో ఉన్న పంచాయతీరాజ్ టీచర్లు తమకూ లోకల్ కేడర్‌గా గుర్తింపు వచ్చేలా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. తద్వారా ఎంఈవో, డిప్యూటీ డీఈవో పోస్టుల్లో పదోన్నతులకు తమకు అర్హత లభిస్తుందని అంటున్నారు. దీనిపై సుప్రీంలో ఉన్న కేసు తేలకపోవడంతో తొమ్మిదేళ్లుగా ఈ పోస్టుల భర్తీ ఆగిపోయింది. క్షేత్ర స్థాయిలో పాఠశాలల పర్యవేక్షణ దెబ్బతింది. అందుకే ప్రస్తుతం కొత్త రాష్ట్రం ఏర్పడటంతోపాటు రూల్స్‌లో మార్పులు చేసుకునే అవకాశం వచ్చినందున.. పైగా సుప్రీంకోర్టులోని కేసు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినదే అవుతుందనే భావనతో ఏకీకృత సర్వీసు రూల్స్ తెచ్చేందుకు సర్కారు సిద్ధమైంది. ఈ మేరకు రూపొందించే రూల్స్‌తో ఓవైపు రేషనలైజేషన్ త రువాత బదిలీలకు చర్యలు చేపట్టాలని.. మరోవైపు లోకల్ గుర్తింపు ఫైలును రాష్ట్రపతికి పంపించి సాధ్యమైనంత త్వరగా ఆమోదం పొందాలని విద్యాశాఖ యోచిస్తోంది.