మచిలీపట్నంలోని శ్రీ చైతన్య పాఠశాల
సాక్షి, మచిలీపట్నం(కృష్ణా) : శ్రీ చైతన్య విద్యాసంస్థలపై కొరడా ఝుళిపించేందుకు విద్యా శాఖాధికారులు సిద్ధమయ్యారు. నిబంధనలను బేఖాతర్ చేస్తూ టాలెంట్ టెస్టులను నిర్వహించడాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. జిల్లాలో ఉన్న శ్రీ చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పాఠశాలలకు నోటీసులు జారీ చేసి, నిర్వాహకుల నుంచి వచ్చిన వివరణ అనంతరం క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం చేశారు. దసరా సెలవుల్లో ఎటువంటి తరగతులు నిర్వహించకూడదని డీఈఓ ఎంవీ రాజ్యలక్ష్మి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రత్యేక తరగతుల పేరుతో పదో తరగతి విద్యార్థులను సైతం పాఠశాలలకు పిలిపించివద్దని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాల విద్యా శాఖ క్యాలెండర్‌కు అనుగుణంగా దసరా సెలవులు ముగిసేంత వరకు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ప్రత్యేక తరగతులు వద్దని ఆదేశాలు ఇచ్చారు. కానీ శ్రీ చైతన్య విద్యా సంస్థల నిర్వాహకులు దీనిని పెడచెవిన పెట్టారు. డీఈఓ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ ఆదివారం టాలెంట్ టెస్టులను నిర్వహించారు. నందిగామ, మైలవరం, విజయవాడలోని మొగల్రాజపురం వంటి చోట్ల అప్పటికప్పుడు విద్యా శాఖాధికారులు వెళ్లి టాలెంట్ టెస్టులను అడ్డుకొని విద్యార్థులను ఇళ్లకు పంపించారు.
శ్రీ చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియెట్ కళాశాలల వైపు ఆకర్షితులయ్యేలా పదో తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్టులను నిర్వహించారని విద్యా శాఖాధికారుల పరిశీలన తేలింది. జిల్లాలోని దాదాపు అన్ని శ్రీ చైతన్య పాఠశాలల్లో టాలెంట్ టెస్టులను నిర్వహించినట్లుగా ఫిర్యాదులు వచ్చాయి. దీంతో జిల్లాలో ఉన్న అన్ని శ్రీ చైతన్య పాఠశాలలకు నోటీసులు జారీ చేసి, దీనిపై వివరణ కోరేందుకు సిద్ధమయ్యారు. వారు ఇచ్చిన సంజాయిషీ అనంతరం సదరు పాఠశాలల నిర్వాహకులపై క్రిమినల్ కేసులు పెట్టాలనే ఆలోచన చేస్తున్నారు. సెలవుల్లో కూడా తరగతులను నిర్వహిస్తున్నట్లుగా గతంలో కూడా అనేకసార్లు శ్రీ చైతన్య విద్యా సంస్థలపై ఫిర్యాదులు వచ్చాయి. మచిలీపట్నంలోని భాస్కరపురంలో గల పాఠశాలలో ఇదే రీతిన నిర్వహించగా గతంలో డెప్యూటీ డీఈఓ బత్తుల సత్యనారాయణమూర్తి వెళ్లి నిర్వాహకులను హెచ్చరించి విద్యార్థులను అప్పటికప్పుడు ఇళ్లకు పంపించారు. ఇలా ఎన్నిసార్లు హెచ్చరించినా శ్రీ చైతన్య విద్యా సంస్థల నిర్వాహకుల్లో మార్పు రాకపోవటమే కాకుండా, తాము ఇస్తున్న ఆదేశాలను సైతం బేఖాతర్ చేస్తుండటాన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నారు.
క్రిమినల్ కేసులు నమోదు..
శ్రీ చైతన్య పాఠశాలలన్నింటికీ ఆయా డెప్యూటీ డీఈఓల ద్వారా నోటీసులు జారీ చేస్తున్నాం. వారి నుంచి వచ్చిన సంజాయిషీ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటాం. ఆ సంస్థల ప్రధాన బాధ్యులకు కూడా డీఈఓ కార్యాలయం నుంచి నోటీసులు పంపిస్తాం. ఆదేశాలను ధిక్కరిస్తున్నందున దీనిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి శ్రీ చైతన్య విద్యా సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం.
– ఎంవీ రాజ్యలక్ష్మి, డీఈఓ
Comments
Please login to add a commentAdd a comment