విద్య, వైద్యం ఇవే నా లక్ష్యం: కలెక్టర్ స్మిత సబర్వాల్ | Education, Medical areas are given high priority says Smita sabharwal | Sakshi
Sakshi News home page

విద్య, వైద్యం ఇవే నా లక్ష్యం: కలెక్టర్ స్మిత సబర్వాల్

Published Thu, Oct 24 2013 5:00 AM | Last Updated on Fri, Sep 1 2017 11:54 PM

విద్య, వైద్యం ఇవే నా లక్ష్యం: కలెక్టర్ స్మిత సబర్వాల్

విద్య, వైద్యం ఇవే నా లక్ష్యం: కలెక్టర్ స్మిత సబర్వాల్

విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తూనే జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషిచేస్తానని కలెక్టర్ స్మిత సబర్వాల్ స్పష్టం చేశారు.

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తూనే జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషిచేస్తానని కలెక్టర్ స్మిత సబర్వాల్ స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్‌గా ఈ నెల 16న బాధ్యతలు స్వీకరించిన స్మిత తొలిసారిగా బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో విలేకరులతో మాట్లాడారు. రాజకీయ, ఇతర ఒత్తిళ్లను సాకుగా చూపుతూ పనిచేయని అధికారులపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. వివిధ ప్రభుత్వ శాఖల  కార్యకలాపాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పారదర్శకతకు పెద్ద పీట వేస్తానని కలెక్టర్ స్మిత సభర్వాల్ తెలిపారు. సమావేశంలో కలెక్టర్ తెలిపిన విషయాలు ఆమె మాటల్లోనే...
 
 గత ఏడాది పదో తరగతి ఫలితాలు నిరాశజనకంగా ఉన్నాయి. ‘పర్‌ఫార్మెన్స్ ట్రాకింగ్ సిస్టమ్’ ద్వారా విద్యారంగం మెరుగుదలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తా. యూనిట్ పరీక్ష మొదలుకుని అన్ని పరీక్షల మార్కులను సేకరించి, పాఠశాలల వారీగా పరిస్థితిని సమీక్షిస్తాం. ‘డాష్ బోర్డు’ ద్వారా పాఠశాలల పనితీరును ప్రదర్శిస్తాం. మూడు నెలల్లో ట్రాకింగ్ సిస్టంను కొలిక్కి తెస్తాం. వీలైనంత తక్కువ ఖర్చుతో ఈ పద్ధతిని అమల్లోకి తెస్తాం. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, సంక్షేమ హాస్టళ్లలో ‘స్కైప్’ సాంకేతికతను ప్రవేశ పెట్టాల్సిందిగా ఇప్పటికే ఆదేశించాను. బాలికల హాస్టళ్లకు తొలి ప్రాధాన్యత ఇస్తాం. విద్యా బోధన, మౌళిక సౌకర్యాలు తదితరాలను ‘స్కైప్’ ద్వారా పర్యవేక్షించేందుకు వీలవుతుంది. నవంబర్ 15లోగా ఈ విధానాన్ని ఆచరణలోకి తెచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నాం.
 
 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు అన్ని స్థాయిల్లోనూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచుతాం. ప్రసవాలు ఎక్కువగా జరిగే ఆస్పత్రుల్లో ప్రసూతి వైద్యుడు, అనస్థీయషినిస్టు, చిన్న పిల్లల వైద్యుడు ఉండేలా  చర్యలు తీసుకుంటాం. అవసరమైన చోట వైద్య సిబ్బందిని సర్దుబాటు చేసే యోచనలో ఉన్నాం. ప్రస్తుతం 40 శాతంగాఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను 60 నుంచి 80 శాతం వరకు తీసుకెళ్తాం. మాతా, శిశు మరణాల రేటు తగ్గించేందుకు పీహెచ్‌సీలు, ఉప కేంద్రాలను బలోపేతం చేస్తాం. ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టులను భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తాం.
 
 స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, ఐకేపీ విభాగాలను ‘మార్పు’ అనే ఒకే గొడుగు కిందకు తెస్తాం. మాతా శిశు మరణాలు, ఇమ్యూనైజేషన్, పోషకాహారం వంటి అంశాలపై మహిళా సమాఖ్య నుంచి సమాచారాన్ని తీసుకుని లోపాలను సరిదిద్దుతాం.
 
 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సంక్షేమ హాస్టళ్లలో ‘స్కైప్’ను ఏర్పాటు చేస్తాం. దీంతో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, సంబంధిత విభాగాల అధికారులు తక్షణ పర్యవేక్షణకు వీలుంటుంది.
 
 జిల్లాలో 26 మోడల్ స్కూళ్లకు గాను 8 మాత్రమే పాక్షికంగా పూర్తయ్యాయి. మిగతావి ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిని పూర్తి చేసేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాం.
 
 మున్సిపాలిటీల్లో నెలలో ఒక శనివారం ‘అర్బన్ డే’ నిర్వహించి, పారిశుధ్యం నిర్వహణపై దృష్టి పెడతాం. ప్రతీ మూడో వారం పారిశుధ్య వారంగా పరిగణిస్తాం. మురుగు కాల్వలు శుభ్రం చేయడం, పొదల తొలగింపు, నీటి ట్యాంకుల పరిశుభ్రత, బ్లీచింగ్ పనులకు ప్రాధాన్యత ఇస్తాం.
 
 ప్రజా పంపిణీ వ్యవస్థ, మధ్యాహ్న భోజనం, అమృత హస్తం, ఐడీసీఎస్, సంక్షేమ హాస్టళ్ల అవసరాలకు అవసరమైన బియ్యం సేకరణకు డిసెంబర్ నుంచి ‘మన బియ్యం’ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సహకారంతో 167 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ధాన్యం అమ్మిన 72 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ అయ్యేలా ప్రణాళిక సిద్ధం చేశాం.
 
 ఎరువులు, విత్తనాల సరఫరా, పంట రుణాల లక్ష్యం, ఇంజనీరింగ్ శాఖల పనితీరుతో పాటు ఇతర అంశాలపై క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహిస్తాం. అధికారులు, సిబ్బందిని సమన్వయం చేస్తూ మెరుగైన ఫలితాల కోసం కృషి చేస్తా.
 
 డుమ్మాల మాస్టర్లకు ఇక చెక్!
జిల్లాలో విద్యారంగం ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది.  డీఈఓ రమేష్‌తో పాటు ఇటీవల బదిలీపై జిల్లాకు వచ్చిన కలెక్టర్ స్మితా సబర్వాల్ పాఠశాల విద్యపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా బుధవారం కలెక్టర్ డీఈఓతో సుమారు రెండు గంటల పాటు సమావేశమై విద్యావ్యవస్థ తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. ప్రభుత్వ పాఠశాలలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సమయానికి పాఠశాలలకు రావడం లేదని, సోమవారం నిర్వహించిన డయల్‌యువర్ కలెక్టర్ కార్యక్రమంలో 28 ఫిర్యాదులు రాగా అందులో 11 ఫిర్యాదులు ఉపాధ్యాయులు హాజరు కావడం లేదనే వచ్చాయి. దీంతో కలెక్టర్ ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయుల వివరాలతో పాటు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ఫోన్ నంబర్లను డీఈఓ ద్వారా తీసుకున్నారు. ఇకమీదట ప్రతిరోజు రెండు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేయాలని డీఈఓను ఆదేశించినట్లు తెలిసింది. తాను సైతం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లిన ప్రతి సందర్భంలోను కచ్చితంగా ఆ ప్రాంతంలో ఉన్న పాఠశాలలను తనిఖీ చేస్తానని, ప్రతిరోజు ఉదయం ఏదో ఒక పాఠశాలకు ఫోన్‌చేసి ప్రధానోపాధ్యాయుడితోపాటు విద్యార్థులతో మాట్లాడతానని అన్నట్లు తెలిసింది. రాజకీయ వత్తిడిలు ఎన్ని వచ్చినా చదువు విషయంలో రాజీపడవద్దని ఎక్కడైనా చిన్నపాటి పొరపాట్లు దొర్లితే మొదటి తప్పుగా క్షమించాలని, అదే తప్పు తరుచుగా జరుగుతుంటే ఉపేక్షించేది లేదని, డీఈఓ స్థాయిలో చర్యలు తీసుకుంటూ తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిసింది. ఇప్పటికే డీఈఓ రమేశ్ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేయడంతోపాటు పాఠశాల సమయానికి హెచ్‌ఎంలకు ఫోన్, విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తూ పిల్లల చదువుపై ఆరా తీస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కలెక్టర్ కూడా ఉపాధ్యాయుల పనితీరుపై దృష్టి సారించడంతో ఉపాధ్యాయులలో ఆందోళన మొదలైంది. ఓవైపు డీఈఓ నిర్ణయాలతో మింగుడుపడని ఉపాధ్యాయ సంఘాలు ఆయన బదిలీకి ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో కలెక్టర్ కూడా డీఈఓను సమర్థిస్తూ మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతుండడంతో ఉపాధ్యాయ సంఘాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.
 
 నిర్లక్ష్యం వహిస్తే వేటే
వచ్చే మార్చిలోగా ఆదర్శ, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల భవన నిర్మాణాలను పూర్తి చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఈఈ అనిల్‌కుమార్‌ను కలెక్టర్ స్మితా సబర్వాల్ ఆదేశించారు. ఇందులో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా వేటు తప్పదని హెచ్చరించారు. బుధవారం తన కార్యాలయంలో ఆర్‌ఎంఎస్‌ఏ, ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీ భవన నిర్మాణాలపై కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలోని 43 మోడల్ పాఠశాలల భవన నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా ఏ ఒక్క భవనాన్ని కూడా పూర్తి చేయకపోవడంపై ఆమె ఆ శాఖ అధికారులపై మండిపడ్డారు. నిర్మాణానికి అవసరమైన నిధులను వెంటనే చెల్లిస్తున్నా ఎందుకు జాప్యం జరుగుతుందని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తన దృష్టికి తేవాలన్నారు. ప్రభుత్వ అనుమతితో వారి స్థానంలో కొత్తవారిని నిర్వహిస్తామని తెలిపారు.  రాజీవ్ విద్యామిషన్ విభాగంలో పని చేస్తోన్న ఇంజనీరింగ్ అధికారులు రోజూ ఏదోఒక పాఠశాల పనులను పరిశీలించి ఎప్పటికప్పుడు ఆర్వీఎం పీఓకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి బుధవారం భవన నిర్మాణాలపై సమీక్షింశాలని కలెక్టర్ పీఓకు సూచించారు. ఇంజనీరింగ్ అధికారులు సహకరించకపోతే నోటీసులు జారీ చేయాలని, అయినా తీరు మార్చుకోని వారి సంగతి తాను చూస్తానన్నారు.  రామాయంపేట, మిరుదొడ్డిలో నవంబర్ ఒకటిలోగా, ఝరాసంగం, మునిపల్లిలో 15వ తేదీలోగా, పుల్‌కల్, బొల్లారం, జక్కపల్లిలో నవంబర్ 30లోగా, రాయికోడ్ ఆదర్శ పాఠశాలల భవన నిర్మాణ పనులను డిసెంబర్ 15లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నూతనంగా మంజూరైన కేజీబీవీ భవనాలను కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కేజీబీవీల్లో స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సులను ఏర్పాటు చేయాలన్నారు.


 జూలై నాటికే పూర్తి చేస్తామన్నారు
 మోడల్ పాఠశాల భవన నిర్మాణాలను జూలై 30 నాటికి పూర్తి చేసి అప్పగిస్తామని ఆ శాఖ ఈఈ అనిల్‌కుమార్ హామీ ఇచ్చారని రాజీవ్ విద్యామిషన్ పీఓ రమేశ్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. గతంలో ఇచ్చిన మాట మేరకు ఎక్కడ కూడా భవన నిర్మాణ పనుల్లో పురోగతి లేదన్నారు. సమావేశంలో ఆర్వీఎం సీఎంఓ సత్యనారాయణ, డీఈఈ అంజిరెడ్డి, కోఆర్డినేటర్ రమాదేవి, సాంఘిక సంక్షే మ శాఖ అధికారి సత్యనారాయణతో ఆర్వీఎం, సోషల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement