సైదాపురం: మైకా కార్మికుల సమస్యలు పరిష్కారానికి కృషిచేస్తానని తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌రావు చెప్పారు. మండలంలోని కలిచేడు గ్రామంలో ఆదివారం నిర్వహించిన మైకా కార్మిక సంక్షేమ సంస్థల పునరుద్ధరణ సభకు ఆయన విచ్చేశారు. సమావేశానికి రెండు గంటల ముందుగానే ఆయన ప్రజలు, అధికారులతో మాట్లాడారు.
వరప్రసాదరావు మాట్లాడుతూ రాయల్టీ రూపేణా ఒక్క పైసా కూడా రాకపోవడంతో పదేళ్ల కిందటే స్కూల్స్ మూసివేసేందుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర కార్మిక శాఖ కమిషనర్ తన దృష్టికి తెచ్చారని చెప్పారు. ప్రస్తుతం కోర్టు ఆదేశాలతో పాఠశాలలు నడుపుతున్నామని చెప్పినట్లు వివరించారు.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దేశంలో ఎక్కడా ఇలాంటి పాఠశాలలు నడపటం లేదనే విషయాన్ని కూడా ఆయన వెల్లడించారని పేర్కొన్నారు. ఎలాగైనా పాఠశాల మూత పడకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామన్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయకపోవడంతో పాఠశాలల్లో కూడా విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిందని ఉపాధ్యాయులు ఎంపీకి తెలిపారు.
కేంద్రీయ విద్యాలయం, ఆస్పత్రి ఏర్పాటుకు చర్యలు.. మూతపడి ఉన్న 30 పడకల ఆస్పత్రిని కూడా ఎంపీ పరిశీలించారు. పది పంచాయతీలు ఉన్న ఈ గ్రామంలో త్వరలోనే ఆస్పత్రి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రప్రభుత్వంతో చర్చించి కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటానని తెలిపారు.
సమస్యలపై ఎంపీకి వినతులు...
కలిచేడు గ్రామానికి చేరుకున్న తిరుపతి ఎంపీకి మండల ప్రజలు పలు సమస్యలతో వినతిపత్రాలను అందజేశారు. జెడ్పీ వైఎస్‌చైర్‌పర్సన్ పోట్టేళ్ళ శిరీషా, జిల్లా ట్రేడింగ్ యూనియన్ కార్యదర్శి నోటిరమణారెడ్డి ఎంపీకీ స్వాగతం పలికారు. కార్యక్రమంలో నాయకులు బండిసుబ్బారెడ్డి, బాబు, మునిరత్నం, శాఖారపు వెంకయ్య, వీరాస్వామి, ప్రసన్నకుమార్‌రెడ్డి, కెఎస్‌చౌదరి, వెంకటరెడ్డి, శివారెడ్డి, వెంకటప్పనాయుడు, తలుపూరు , కలిచేడు ఎంపీటీసీ నక్కా ప్రమీలా, వెంకటసుబ్బరత్నమ్మ తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల సమస్యలు పరిష్కారానికి కృషి
Published Mon, Jan 12 2015 1:50 AM | Last Updated on Sat, Sep 2 2017 7:34 PM
Advertisement