కార్మికుల సమస్యలపై పోరాడుతా
ఓడీ చెరువు: అంగన్‌వాడీలు, అసంఘటిత రంగ కార్మికుల సమస్యలను చట్టసభలో వినిపిస్తానని, అందరికీ న్యాయం జరిగేలా పోరాడుతానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ఆయన బుధవారం కడప జిల్లా ఇడుపులపాయ నుంచి బెంగళూరు వెళుతూ అనంతపురం జిల్లా ఓడీచెరువులో ఆగారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఆందోళన నిర్వహిస్తున్న అసంఘటిత రంగ కార్మికులు, అంగన్‌వాడీలు, వామపక్ష నేతలకు సంఘీభావం తెలిపారు. కార్మికులు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను జగన్ దృష్టికి తీసుకొచ్చారు.
ప్రభుత్వం అంగన్‌వాడీలతో వెట్టిచాకిరీ చేయిస్తోందని, 60 ఏళ్ల వయసున్న వారిని విధుల నుంచి తొలగిస్తోందని అంగన్‌వాడీ వర్కర్ల సంఘం నేత ఆశీర్వాదమ్మ, కార్యకర్తలు నరసమ్మ, లక్ష్మీదేవి,పాపమ్మ, వెంకటమ్మ తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి నామమాత్రపు వేతనంతో పని చేస్తున్న తమకు పెన్షన్ ఇవ్వకుండా తొలగిస్తుండడంతో కుటుంబ పోషణ భారమవుతోందన్నారు.
ప్రభుత్వం వేతనాలు పెంచింది కదా! అని జగన్ ప్రస్తావించగా.. జీవో ఇచ్చారు కానీ వేతనాలు పెరగలేదని వారు బదులిచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. మీ సమస్యలపై చట్టసభలో మాట్లాడతానని హామీ ఇచ్చారు. జగన్ వెంట కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ఉన్నారు.