
అయినా అక్క చనిపోయింది...
రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద జరిగిన ఘటనలో ఓ చిన్నారి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. స్వల్పంగా గాయపడిన ఈగల కిరణ్ ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదాన్ని కళ్లారా చూసిన అతడు... ' రాత్రి 8 గంటలకు ప్రమాదం జరిగిం. ప్రమాదం జరిగే సమయంలో నేను మా డాడీ ఒళ్లో ఉన్నాను. అప్పుడు మా డాడీ నన్ను, అక్కను గట్టిగా పట్టుకుని దాచాడు. డాడీకి బాగా దెబ్బలు తగిలాయి. మమ్మీకీ కూడా. నాకు తలమీద పెద్ద దెబ్బ తగిలింది. అక్కను బయటకు తీసుకు వద్దామని ప్రయత్నించాను.
అయితే నాకు కుర్చీలు అడ్డు వచ్చాయి. నేను కిటికీలోంచి బయటకు వచ్చాను. ఆ తర్వాత వేరేవాళ్లకు చెప్పి అక్కను బయటకు తెచ్చాం. అయినా అక్క చనిపోయింది. నేనొక్కడినే బతికాను' చెప్పాడు. కాగా ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో కిరణ్ సోదరి ఈగల సంధ్య కూడా ప్రాణాలు కోల్పోయింది. తుఫాన్ వాహనం గోదావరి నదిలో బోల్తాపడిన దుర్ఘటనలో 22మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.