ఎస్సై వేమనకు ఫిర్యాదు చేస్తున్న బాలిక, చైల్డ్‌లైన్ ప్రతినిధి సాగర్
ప్రకాశం, కందుకూరు: నిండా పదిమూడేళ్లు కూడా నిండని ఆ బాలిక చూపిన దైర్యం పలువురికి ఆదర్శంగా నిలిచింది. పెద్దలను ఎదిరించి నాకు పెళ్లి వద్దు నేను చదుకుంటానంటూ అధికారులను ఆశ్రయించింది. అధికారుల చొరవతో మేనమామతో నిశ్చయమైన పెళ్లి నిలిచిపోయింది. బాల్య వివాహం చేసుకోనంటూ పెద్దలను ఎదిరించి ముందుకు వచ్చిన ఆ బాలికను ప్రభుత్వ వసతి గృహంలో చేర్పించి చదివించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ సంఘటన గురువారం కందుకూరు పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..కందుకూరు పట్టణానికి చెందిన ఓ మైనార్టీ ముస్లిం బాలిక స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఆ కుటుంబం నిరుపేద కుటుంబం. తండ్రి అనారోగ్యంతో బాధపడుతుండగా, తల్లితో కలిసి ఆ బాలిక నాయనమ్మ దగ్గర ఉంటున్నారు. అయితే ఆ బాలికను తన మేనమామకు ఇచ్చి పెళ్లి చేసేందుకు నాయనమ్మ నిశ్చయింది. ఈ మేరకు గత డిసెంబర్‌లోనే నిశ్చితార్థం చేశారు.
కానీ నాకు పెళ్లి వద్దంటూ అప్పటి నుంచే ఆ చిన్నారి ఎదిరిస్తూనే ఉంది. తల్లి కూడా కుమార్తెకు అప్పుడే పెళ్లి చేయడం ఇష్టం లేదు. కానీ నాయనమ్మ ఒత్తిడి వల్ల పెళ్లికి అంగీకరించాల్సిన పరిస్థితి. పెళ్లి చేసుకుంటేనే ఇంట్లో ఉండండి లేదంటే బయటకు వెళ్లండి అంటూ ఒత్తిడి చేయసాగింది. ఈ మేరకు ఈ నెలలో ఆ బాలికకు పెళ్లి జరగాల్సి ఉంది. అయితే పెళ్లి అసలు ఇష్టం లేని ఆ బాలిక ఒంగోలు చైల్డ్‌లైన్ 1098కు సమాచారం ఇచ్చారు. దీంతో హెల్ప్ ప్రోగ్రాం ఆఫీసర్, పారాలీగల్ వాలంటీర్ బీవీ సాగర్ బాలిక కుటుంబానికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పెళ్లి చేసుకోకపోతే నిశ్చితార్ధం కోసం రూ. 40వేలు ఖర్చు చేశాం, వాటిలో రూ. 20 వేలు తిరిగి ఇవ్వాలంటూ పెళ్లికొడుకు తరుఫు వారు డిమాండ్ చేశారు.
దీంతో సాగర్ బాలికను తీసుకుని పోలీస్ స్టేషన్‌కు చేరిన పట్టణ ఎస్సై ఉన్నం వేమనకు ఫిర్యాదు చేశారు. దీంతో పెళ్లికొడుకు తరుపు వారిని పిలిపించిన ఎస్సై వారిని మందలించారు. చట్ట ప్రకారం బాల్య వివాహం చేయడం నేరమని, మైనార్టీ తీరని బాలికను పెళ్లి చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే పెళ్లి చేసుకోవాలని గానీ, నిశ్చితార్ధం డబ్బులు తిరిగి ఇవ్వాలని గానీ బాలిక కుటుంబంపై ఒత్తిడి చేస్తే కేసు నమోదు చేస్తామన్నారు. దీంతో బాల్య వివాహం నిలిచిపోయింది. నిరుపేదరాలైన ఆ బాలిక పరిస్థితిని జిల్లా బాలల సంక్షేమ కమిటీ దృష్టికి తీసుకెళ్లగా బాలికను ప్రభుత్వ వసతి గృహంలో చేర్పించేందుకు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. తన బాల్య వివాహాన్ని నిలుపుదల చేసుకునేందుకు తనే ముందుకు వచ్చి అధికారులకు ఫిర్యాదు చేసిన బాలికను ఆదర్శ రూరల్ డెవలప్‌మెంట్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్, పారా లీగల్ వాలంటీర్ చీకటి రోశయ్య, అధికారులు బాలికను అభినంధించారు.
Comments
Please login to add a commentAdd a comment