కన్న కొడుకుల కాఠిన్యానికి ఓ అమాయకపు తల్లి తల్లడిల్లుతోంది. నవమాసాలు మోసి కనిపెంచిన బిడ్డలు ఆస్తులు పంచుకున్నారే గానీ, పట్టెడన్నం మాత్రం పెట్టడం లేదని ఆవేదన చెందుతోంది. ఇద్దరు కుమారులు ఉండి కూడా ఆదరించకపోవటంతో కూతురు పంచన చేరాల్సి వచ్చిందని కన్నీరుమున్నీరవుతోంది. తనకు ఆస్తులు, అంతస్తులు వద్దని, గుప్పెడు మెతుకులు పెడితే చాలని అంటోంది.
తోట్లవల్లూరు : మండల కేంద్రానికి చెందిన మాకినేని మోహన్‌రావుకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. ఏడాదిన్నర కిందట మోహన్‌రావు మృతి చెందాడు. అప్పటి నుంచి భార్య సరోజినికి (86) కష్టాలు మొదలయ్యాయి. ఇద్దరు కుమారులకు తండ్రి మోహన్‌రావు బతికి ఉండగానే చెరో మూడు ఎకరాల భూమి ఇచ్చారు. చిన్న కుమార్తె విజయలక్ష్మికి కూడా పసుపు, కుంకుమల కింద మరో మూడు ఎకరాలు ఇచ్చారు. వీరందరికీ ఇవ్వగా ఇంకా 2 ఎకరాల 15 సెంట్లు భూమి ఉంది. మోహన్‌రావు మరణానంతరం కుమారులు తల్లి సరోజిని సంక్షేమాన్ని గాలికొదిలేశారు. మొక్కుబడిగా పనిమనిషిని ఏర్పాటు చేసి ఏదో చూస్తున్నామంటూ మమ అనిపిస్తున్నారు. పనిమనిషి వేధింపులు, ఛీత్కారాలు తట్టుకోలేక సరోజిని గ్రామంలోనే నివాసం ఉంటున్న పెద్దకుమార్తె లక్ష్మీదుర్గ వద్దకు గత ఐదు నెలల కిందట చేరింది.
కౌలు రైతుపై కేసులు...
తన భర్త మోహన్‌రావు మృతి చెందగానే కొడుకులు సుమారు రూ. 4 లక్షల నగదు, తాము బయటి వ్యక్తులకు అప్పుగా ఇచ్చిన ప్రామిసరీ నోట్లు సైతం లాక్కున్నారని సరోజిని ఆవేదన వ్యక్తం చేసింది. చాలాకాలంపాటు పింఛన్ సైతం తనకు ఇవ్వలేదని చెప్పింది. ప్రస్తుతం పంచాయతీ ద్వారా పింఛన్ ఇస్తుండటంతో తనకు అందుతోందని అంటోంది. తాజాగా తనకున్న పొలం కౌలుకి ఇచ్చే ప్రయత్నం చేస్తే, కౌలు చేసే రైతుపై కూడా తన కొడుకులు పోలీసు కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. పట్టెడన్నెం పెట్టని కొడుకులు ఉన్న భూమి ద్వారా కౌలు పొందే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారని విలపించింది. కనీసం తనను సంప్రదించకుండా తమ భూమి కౌలుకు తీసుకున్న కౌలు రైతును పోలీసులు స్టేషన్‌కు పిలిపించి బెదిరించటం సరికాదన్నారు.
సీపీ న్యాయం చేయాలి..
తన కొడుకులు చేస్తున్న అన్యాయంపై విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతంసవాంగ్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు సరోజిని పేర్కొన్నారు. తాను ఆస్తులు, అంతస్తులు కోరుకోవటం లేదని, ఎనిమిది పదుల వయసులో పట్టెడన్నం మాత్రమే పెట్టమంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వయసులో ఇలాంటి ఖర్మ ఏ తల్లిదండ్రులకు రాకూడదని బావురమంటోంది.
Comments
Please login to add a commentAdd a comment