
గవర్నర్‌కూ ఎన్నికల కోడ్
రాష్ట్ర గవర్నర్‌కు ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) వర్తిస్తుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ స్పష్టం చేశారు.
కలెక్టర్లు, ఎస్పీలతో పథకాల సమీక్ష కుదరదు: భన్వర్‌లాల్ స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్‌కు ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) వర్తిస్తుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. రాష్ర్టపతి పాలన నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ సోమవారం సాధారణ ఎన్నికల ఏర్పాట్లతో పాటు కీలకమైన ఏడు అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పలు శాఖల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించనున్న విషయాన్ని ‘సాక్షి’ పాఠకులకు తెలియజేసిన సంగతి తెలిసిందే.
- గవర్నర్ ప్రధానంగా సాధారణ ఎన్నికల ఏర్పాట్లతోపాటు శాంతిభద్రతలు, గ్రామీణ త్రాగునీటి సరఫరా, వాతావరణ పరిస్థితులు, విద్యుత్ సరఫరా, పాఠశాల విద్య, వైద్య ఆరోగ్యం రంగాలపై కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించాలని నిర్ణయించారు.
- ఎన్నికల ప్రవర్తనా నియావళి అమల్లో ఉన్నందున సీఎస్ మహంతి ఈ సమీక్ష విషయాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి దృష్టికి తీసుకువెళ్లారు. సంబంధిత ఫైలును పరిశీలించిన భన్వర్‌లాల్... కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌తో సంప్రదించారు. తర్వాత రాష్ట్రప్రభుత్వ అధిపతిగా ఉన్న గవర్నర్ సమీక్ష చేయకూడదని నేరుగా చెప్పకుండా, ఎన్నికలకోడ్ అమల్లో ఉన్నందువల్ల ప్రభుత్వ పథకాల సమీక్షలు కుదరవని పరోక్షంగా స్పష్టంచేశారు.
- ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే సీఎం, మంత్రు లు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం, సమీక్షలు నిర్వహించడంపై నిషేధం ఉందని... ఇప్పుడు రాష్ట్ర అధిపతిగా ఉన్న గవర్నర్ కలెక్టర్లు, ఎస్పీలతో ప్రభుత్వ పథకాలపై సమీక్షలు చేయడం ఎన్నికల నియామవళిని అతిక్రమించడమే అవుతుందనేది కమిషన్ అభిప్రాయంగా ఉంది. ఎన్నికల ఏర్పాట్లతోపాటు విద్యుత్ సరఫరా వంటి అంశాలపై సమీక్షించడం ఓటర్లను ప్రభావితం చేయడమే అవుతుందని కమిషన్ వర్గాలు పేర్కొన్నాయి.
- ఎన్నికల ఏర్పాట్లను కేవలం సీఎస్, డీజీపీ, సీఈఓ మాత్రమే అధికార యంత్రాంగంతో సమీక్షిస్తారని, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక మొత్తం అధికార యంత్రాంగమంతా కేంద్ర ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్లిపోతుందని, ఏదైనా సరే కమిషన్ అనుమతితో చేయాల్సి ఉంటుందన్నాయి.
రాజకీయ నేతలు లేకుండా ఉగాది ఉత్సవాలు
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినందున ఈనెల 17న హోలీతో పాటు 30వ తేదీ ఉగాది ఉత్సవాలను రాజకీయ నేతలు లేకుండా పూర్తిగా అధికారులతో నిర్వహించనున్నట్లు గవర్నర్ కార్యాలయం శనివారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌కు తెలిపింది. రాజకీయ నేతల భాగస్వామ్యం లేకుండా కేవలం అధికారులతో ఉగాది ఉత్సవాలను నిర్వహించడానికి ఎటువంటి ఆంక్షలు ఉం డబోవని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.