నంద్యాలలో టీడీపీకి షాక్
సాక్షి, నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాలలో ఉప ఎన్నిక మరో నాలుగు రోజుల్లో జరగనుందనగా.. అధికార తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఫిర్యాదు మేరకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం డీఎస్పీ గోపాలకృష్ణపై బదిలీ వేటు వేసింది. ఈ మేరకు శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈసీ ఆదేశాలు జారీ చేసింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చిన్నాచితకా నాయకుల ఇళ్లపై అర్థరాత్రి సోదాలు అంటూ తలుపు తడుతున్నారని వైఎస్ఆర్‌సీపీ నేతల నుంచి ఈసీకి ఫిర్యాదు వెళ్లింది.
డీఎస్పీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ వైఎస్‌ఆర్‌సీపీ నేతలు చేసిన ఫిర్యాదును కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) దృష్టికి కూడా వెళ్లినట్లు తెలిసింది. గోపాలకృష్ణ స్ధానంలో ఓఎస్‌డీ రవిప్రకాశ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈసీ నిర్ణయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ముగ్గురు పరిశీకులను ఈసీ నియమించింది. ఒక ఉప ఎన్నికకు ఇంతమంది పరిశీలకును నియమించడం ప్రత్యేక సమయాల్లో మాత్రమే జరగుతుంటుంది.