
నంద్యాలలో 44 కేసులు నమోదు: సీఈవో
హైదరాబాద్ : ఈ నెల 23న జరిగే నంద్యాల ఉప ఎన్నిక కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. ఆయన గురువారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. నంద్యాలలో ఇప్పటివరకూ 44 కేసులు నమోదు చేశామని, అలాగే రూ.11లక్షల నగదు సీజ్ చేసినట్లు తెలిపారు. మంత్రులు...పార్టీ నేతలుగా వెళితే అభ్యంతరం లేదని, అయితే ఎవరు అధికార దుర్వినియోగానికి పాల్పడినా చట్టప్రకారం వ్యవహరిస్తామని భన్వర్ లాల్ స్పష్టం చేశారు. కొందరు మంత్రులపైనా ఫిర్యాదులు వచ్చాయని, ఫిర్యాదులన్నింటినీ పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు.
అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి లైవ్ వెబ్‌కాస్టింగ్ ఉంటుందని, ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ వీడియోగ్రఫీ చేస్తామని ఆయన వివరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు కేంద్ర, రాష్ట్ర బలగాల భద్రత ఉంటుందన్నారు. బందోబస్తు కోసం 8 కంపెనీల కేంద్ర బలగాలను అడిగామన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట నిఘా పెడతామని భన్వర్‌లాల్ పేర్కొన్నారు.