ఎన్నికల వేళ సీన్ రివర్స్
Published Sun, Mar 9 2014 4:15 AM | Last Updated on Sat, Sep 2 2017 4:29 AM
ఆ ఇద్దరూ...ఇద్దరే... ఒకరు ఫైర్‌బ్రాండ్ అయితే, మరొకరు మిస్టర్ కూల్. ఒకరు తన మాటలతో ప్రత్యర్థులపై నిప్పులు చెరుగుతారు. మరొకరేమో అన్నింటికీ చిరునవ్వుతోనే సమాధానం చెబుతుంటారు. కానీ ఎన్నికల వేళ సీన్ రివర్స్ అయ్యింది. ఎప్పుడూ చిరునవ్వుతో సమాధానమిచ్చే నేత ఇప్పుడు అగ్గిమీద గుగ్గిలమై పోతున్నారు. ఇంత అన్యాయమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాటలతోనే ప్రత్యర్థులకు దడ పుట్టించే నేత ఇపుడు మౌనవ్రతం పట్టారు. తన ఇలాఖాలో పరులు పాదం మోపినా సహించని ఆయన ఎన్నికల వేళ సీటుకే ఎసరొస్తున్నా చలించడం లేదు. ఇంతకీ ఎవరా ఇద్దరు.. ఏమా కథ మీరూ చదవండి.
- సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి
‘మిస్టర్‌కూల్’ శివతాండవం
‘మిస్టర్ కూల్’’.. శివుని ముందు ‘నంది’ అంతటి నిర్మలత్వం. చిరునవ్వుకు చిరునామా. కానీ ‘సీన్ రివర్స్’ అయింది. నిర్మలమైన మనిషి నిండు సభలో కన్నెర్ర జేశారు. ఉగ్ర నర్సింహావతారం ఎత్తారు. కడుపులోనే అణిచి పెట్టుకున్న ఆవేదనను వెళ్లగక్కారు. ‘ఒకే ఒక్క బీసీ నాయకుడు ఎదిగితే తొక్కాలని కుట్రలు చేస్తారా’..! అంటూ శివతాండవం చేశారు. కుట్రలు, కుతంత్రాలు సహించేది లేదని శపథం చేశారు. ఆయన పేరే నందీశ్వర్‌గౌడ్. పటాన్‌చెరు సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈసారి పటాన్‌చెరు పీఠం మీద డీసీసీ ప్రెసిడెంట్ భూపాల్‌రెడ్డి కన్నేశారు. ఇటీవల ఏఐసీసీ దూతగా జిల్లాకు వచ్చిన బస్వరాజ్ పాటిల్ వద్ద తన మనుసులో మాట చెప్పిన ఆయన, దామోదర రాజనర్సింహ సాయంతో రాహుల్‌గాంధీని కూడా కలిశారు. పటాన్‌చెరు టికెట్ తనకే ఇవ్వాలని రాహుల్‌కు లేఖ కూడా ఇచ్చారు. దీంతో నందీశ్వర్‌గౌడ్ ఫైర్ అయ్యారు. నియోజకవర్గంలో భూపాల్‌రెడ్డి గ్రూపు రాజకీయాలు నడిపిస్తున్నారని, ఆయనవర్గాన్ని బలోపేతం చేసుకొనే ప్రయత్నం చేస్తూ టికెట్టు తనకే వస్తుందనే అసత్య ప్రచారంతో కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. జిల్లాలో బీసీ జనాభా నిష్పత్తి ప్రకారం కనీసం నలుగురికి అసెంబ్లీ సీట్లు ఇవ్వాల్సి ఉండగా... ఉన్న ఒక్క సీటునే ఊడదీసేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ నేత రౌద్రరూపం చూసి నియోజకవర్గం ప్రజలు నమ్మ లేకున్నారు.
‘ఫైర్‌బ్రాండ్’ మౌనవ్రతం
‘ఫైర్‌బ్రాండ్’.. ఎప్పుడూ ముండుతూనే ఉండాలి. కానీ రొటీన్‌కు భిన్నంగా మౌనవ్రతం పట్టారు. తన ఇలాఖాలోకి పరులు పాదం మోపినా ఈ మౌనం వీడలేదు. సంగారెడ్డి ఈ సారి నాదే అంటున్నా... నవ్వేస్తున్నారు. ప్రత్యర్థి పరపతిని ప్రయోగించి టికెట్టే లక్ష్యంగా పాచికలు విసురుతున్నా... తనకు లక్ష ఓట్ల మెజార్టీ వచ్చితీరుతుందంటున్నారు. మరి మౌనం ఎందుకన్నా? అని అడిగితే ‘మోకా రాలేదు తమ్ముడూ’ అని మునీశ్వరుని తరహాలో సమాధానం చెప్తున్నారు. ఇంతకు ఎవరా? మౌనముని అంటే సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి. వచ్చే ఎన్నికల్లో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సతీమణి పద్మిని సంగారెడ్డి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని బహిరంగంగా ప్రకటించారు. అవకాశం దొరికినప్పుడల్లా నియోజకవర్గంలో పర్యటి స్తూ సొంత పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తూ పత్రికలకు ఎక్కారు.
తాజాగా దామోదర వర్గంగా బలమైనముద్ర పడిన కొందరు నాయకులు పటాన్‌చెరు శివారులోని లహరీ రిసార్టులో సమావేశమయ్యారు. ఈసారి ఎన్నికల్లో జగ్గారెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్టు రాకుండా చేయాలని తీర్మాణించారు. ఈ సమావేశం దామోదర కనుసన్నల్లో జరిగిందని ప్రచారంలో ఉంది. జిల్లాలో రాజకీయంగా బలమైన వర్గాన్ని తయారు చేసుకోవాలనే ప్రయత్నంలో భాగంగానే దామోదర తొలుత తన భార్యను తెరమీదకు తీసుక వచ్చారని, తన భార్య రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహిళ కాబట్టి ఆమెను సంగారెడ్డి నుంచి ఎన్నికల బరిలో నిలిపి జగ్గారెడ్డి ప్రస్థానానికి చెక్ పెట్టేం దుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లోనూ జగ్గారెడ్డి మాత్రం తనకేమీ పట్టనట్లుగానే ఉంటున్నారు. ఎన్ని విమర్శలు చేసినా ఆయన ఇప్పటివరకు నోరు విప్పి ఒక్క విమర్శ కూడా చేయక పోవడంతో నియోజకవర్గం ప్రజలు ఇది నిజమా.. లేక భ్రమ అనే మీ మాంసలో ఉన్నారు.
Advertisement
Advertisement