పూసపాటిరేగ = మండలంలోని కుమిలి పంచాయతీ పరిధిలో గల పౌల్ట్రీఫారంలో పనిచేస్తున్న ఓ మహిళ విద్యుదాఘాతంతో గురువారం మృతి చెందింది.
పూసపాటిరేగ : మండలంలోని కుమిలి పంచాయతీ పరిధిలో గల పౌల్ట్రీఫారంలో పనిచేస్తున్న ఓ మహిళ విద్యుదాఘాతంతో గురువారం మృతి చెందింది. మూడు నెలల క్రితమే పెళ్లయిన ఆమె ఆషాఢ మాసం కావటంతో స్వగ్రామానికి వచ్చి బతుకుదెరువు కోసం పనికెళ్లి మృత్యువాత పడటం అందరినీ కలచివేసింది. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఆమె మృతి చెందిందని, మృతురాలి కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ పౌల్ట్రీ ఫారం గేటు ఎదుట బంధువులు ,గ్రామస్తులు ఆందోళనకు చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి. రెల్లివలస గ్రామానికి చెందిన కొవ్వాడ బంగారమ్మ పౌల్ట్రీ ఫారంలో పనిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురైంది. దీంతో గాయపడిన ఆమెను అంబులెన్స్‌లో విజయనగరం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. తోటి కార్మికులు మృతదేహాన్ని పౌల్ట్రీ ఫారం గేటు వద్దకు తీసుకు వచ్చి పరిహారం చెల్లించాలంటూ ఆందోళన చేపట్టారు.
రాత్రి 9 గంటల వరకు ఆందోళన కొనసాగినా యాజమాన్యం నుంచి సరైన సమాధానం రాలేదు. యాజమాన్యం సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే బంగారమ్మ మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు పతివాడ అప్పలనాయుడు, గ్రామ మాజీ సర్పంచ్ ఎం.వి.జి.శంకర్రావు, వైఎస్‌ఆర్‌సీపీ నేత ఇజ్జరోతు ఈశ్వర్రావులు యాజమాన్యంతో చర్చలు జరిపారు. మృతరాలు బంగారమ్మకు గంట్యాడ మండలం మరడాం చెందిన వ్యక్తితో మూడునెలల క్రితమే వివాహమైంది. ఆషాఢ మాసం కావటంతో స్వగ్రామానికి వచ్చింది. ఇంతలోనే ఊహించని విధంగా మృత్యువు పాలైంది.