లైట్లు మాత్రమే ఆర్పండి..  | Electricity Authorities Appeal to the Public | Sakshi
Sakshi News home page

లైట్లు మాత్రమే ఆర్పండి.. 

Apr 5 2020 3:51 AM | Updated on Apr 5 2020 11:07 AM

Electricity Authorities Appeal to the Public - Sakshi

సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు ఇళ్లలో లైట్లు ఆపేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు నేపథ్యంలో విద్యుత్‌ సరఫరాకు ఇబ్బందిలేకుండా చూడటానికి రాష్ట్ర విద్యుత్‌ అధికారులు కసరత్తు చేస్తున్నారు. విద్యుత్‌ ఉత్పత్తి, డిమాండ్‌ను అదుపు చేయడానికి రాష్ట్ర లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఎస్‌ఎల్‌డీసీ) నిరంతరం పనిచేస్తుంది. విద్యుత్‌ను చేరవేసే వ్యవస్థ (పవర్‌ గ్రిడ్‌)పై డిమాండ్‌ పెరిగినప్పుడు విద్యుత్‌ లభ్యత పెంచుతారు. డిమాండ్‌ తగ్గినప్పుడు ఉత్పత్తి తగ్గిస్తారు. ఎస్‌ఎల్‌డీసీ శుక్రవారం రాత్రి నుంచే ఈ కసరత్తు మొదలు పెట్టింది. ఆదివారం రాత్రి వరకూ అప్రమత్తంగానే ఉంటుంది.

► రాష్ట్రంలో సాధారణంగా 9 గంటల సమయంలో విద్యుత్‌ డిమాండ్‌ 6,800 మెగావాట్లు ఉంటుంది. 
► 9 నిమిషాలు ఇళ్లల్లో లైట్లు ఆపేస్తే ఒక్కసారిగా డిమాండ్‌ 500 మెగావాట్ల మేర పడిపోతుంది. ఆతర్వాత ఒక్కసారే డిమాండ్‌ యథాతథ స్థితికి వస్తుంది. 
► ఈ సమయంలో గ్రిడ్‌కు అనుసంధానమైన విద్యుత్‌ ఉత్పత్తి తగ్గించడం, పెంచడం చేయకపోతే ఉత్పత్తి స్టేషన్లు సాంకేతికంగా దెబ్బతింటాయి. ట్రాన్స్‌ఫార్మర్లు ట్రిప్‌ అవుతాయి. 
► ఏపీ జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తిని ఆదివారం ఉదయం నుంచే తగ్గిస్తారు. థర్మల్‌ను వెనువెంటనే ఉత్పత్తిలోకి తేవడం కొంత కష్టం. జల విద్యుత్‌ ఉత్పత్తిని అప్పటికప్పుడే ప్రారంభించవచ్చు. అందుకే సీలేరులోని 450 మెగావాట్లు, శ్రీశైలంలో 550 మెగావాట్ల జల విద్యుత్‌ కేంద్రాల్ని అందుబాటులోకి తెస్తున్నారు. 
► లైట్లు ఆపేసిన సమయంలో లోడ్‌ తగ్గి గ్రిడ్‌ ఫ్రీక్వెన్సీ అదుపులో ఉండటం కష్టం. దీన్ని బ్యాలెన్స్‌ చేయడానికి అనంతపురం, కర్నూల్‌ జిల్లాల్లో వ్యవసాయ విద్యుత్‌ పంపుసెట్లు నడిపించే ఏర్పాట్లు చేస్తున్నారు. 

కేంద్రం మార్గదర్శకాలివీ..
► ఇళ్లల్లో లైట్లు తప్ప అన్ని విద్యుత్‌ ఉపకరణాలు నడుస్తాయి. 
► వీధి దీపాలు ఆన్‌లోనే ఉంటాయి. 
► ఆసుపత్రులు, మున్సిపల్‌ సర్వీసులు, పోలీసు కార్యాలయాలు, ఇతర అత్యవసర విభాగాల్లో లైట్లు యథావిధిగా వెలుగుతాయి.  

వినియోగదారులు గమనించాలి
ఆ తొమ్మిది నిమిషాలు ఇళ్లల్లో కేవలం లైట్లు మాత్రమే ఆపండి. ఏసీలు, ఫ్రిజ్‌లు, ఫ్యాన్లు ఇతర ఉపకరణాలు ఆన్‌లోనే ఉంచండి. గ్రిడ్‌ బ్యాలెన్స్‌ కోసం వినియోగదారులు దీన్ని గమనించాలి. అన్నీ ఆపేస్తే డిమాండ్‌ ఒక్కసారే పడిపోయి గ్రిడ్‌పై ప్రభావం పడుతుంది. ఇది జరిగితే పునరుద్ధరణకు చాలా సమయం పడుతుంది.      
    – హెచ్‌.హరినాథరావు, ఎస్పీడీసీఎల్‌ సీఎండీ

కేంద్రంతో సమన్వయం
తొమ్మిది నిమిషాలు లైట్లు ఆపాలన్న నిర్ణయం నేపథ్యంలో కేంద్ర ఇంధనశాఖతోనూ సమన్వయం చేసుకుంటున్నాం. దక్షిణ, జాతీయ గ్రిడ్‌ అధికారులతో ఇప్పటికే మాట్లాడాం. రాష్ట్ర లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్, జెన్‌కో స్టేషన్స్, ఇతర ఉత్పత్తిదారుల మధ్య సమన్వయం కోసం ప్రయత్నిస్తున్నాం. అన్ని విభాగాల నుంచి నివేదికలు తీసుకుంటున్నాం. డిస్కమ్‌లకు అవసరమైన ఆదేశాలిచ్చాం.     
    – శ్రీకాంత్‌ నాగులాపల్లి ఇంధనశాఖ కార్యదర్శి

ఆ 9 నిమిషాలు ఓ సవాల్‌
మాకు ఆ తొమ్మిది నిమిషాలు ఓ సవాల్‌. దీనికోసం శుక్రవారం నుంచే కసరత్తు ముమ్మరం చేశాం. మనం కేంద్ర విద్యుత్‌ సంస్థల నుంచీ విద్యుత్‌ తీసుకుంటున్నాం. కాబట్టి ముందే దీనిపై సంప్రదింపులు చేయాల్సి ఉంటుంది. అవసరమైతే పవన, సౌర విద్యుత్‌ను ఆపేయడానికి ఏర్పాట్లు చేశాం. తీసుకున్న చర్యల కారణంగా గ్రిడ్‌పై ప్రభావం ఉండదనే భావిస్తున్నాం.     – భాస్కర్, లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ ఇంజనీర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement