* రెండో రోజూ తెలంగాణ జలవిద్యుదుత్పత్తి
* ఉత్తర్వుల ఉల్లంఘనపై కృష్ణా బోర్డే చర్యలు చేపట్టాలంటున్న ఏపీ
సాక్షి, హైదరాబాద్/శ్రీశైలం ప్రాజెక్టు: తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీజలాల బోర్డు ఉత్తర్వులను ఉల్లంఘించి ఆదివారం కూడా శ్రీశైలం ఎడమ గట్టున విద్యుత్ ఉత్పత్తి కొనసాగించింది. బోర్డు ఉత్తర్వులను ధిక్కరించి రెండురోజులుగా విద్యుదుత్పత్తి చేస్తున్నా తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయకుండా ఏపీ ప్రభుత్వం మౌనంగా వ్యహరిస్తోంది.
ఉత్తర్వులపై 15న సమీక్షించనున్న బోర్డు
శ్రీశైలం నీటిపై తమ ఉత్తర్వుల అమలు స్థితిగతులను ఈనెల 15వతేదీన సమీక్షించాలని బోర్డు నిర్ణయించిన విషయం విదితమే. ఉత్తర్వుల ఉల్లంఘనలపై చర్యలు చేపట్టకుంటే బోర్డును నిలదీయాలనే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. మరోవైపు బోర్డు ఉత్తర్వుల్ని ధిక్కరించి తెలంగాణ శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో శనివారం నుంచి విద్యుత్ ఉత్పాదన కొనసాగిస్తోంది. నవంబర్ 2వతేదీ తర్వాత విద్యుత్ ఉత్పత్తి చేయరాదని, అక్టోబర్ 31 నుంచి 2వ తేదీ వరకు మూడు టీఎంసీలకు మించి నీటిని విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించడానికి వీల్లేదంటూ కృష్ణా బోర్డు 31వతేదీన ఉత్తర్వులు జారీచేసిన విషయం విదితమే.
అయితే శనివారం నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు 1.12 టీఎంసీల నీటిని వినియోగించుకుని 3.767 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు 420 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. తిరిగి సాయంత్రం 6 గంటలకు 240 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ 13,480 క్యూసెక్కుల నీటిని కిందకు విడిచిపెడుతున్నారు. జలాశయం నుంచి హంద్రీనీవా సుజల స్రవంతికి 1,350 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 700 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. జలాశయంలో 857.60 అడుగుల మట్టంలో 98.9024 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
వాస్తవ పరిస్థితులపైనే ఏపీ సర్కారు లేఖ
‘ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం మేరకు ఏర్పాటైన కృష్ణా బోర్డుకు తన ఉత్తర్వులు అమలు చేయించడానికి అవసరమైన అన్ని అధికారాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవాలి. ఉత్తర్వులు అమలు చేయించలేని పరిస్థితి ఉంటే బోర్డు ఎందుకు? అన్ని విషయాలూ బోర్డుకు తెలుసు. ప్రత్యేకంగా ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు. వాస్తవ పరిస్థితులను వివరిస్తూ బోర్డుకు ప్రభుత్వం శుక్రవారం లేఖరాసింది. అందులో కూడా ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొనలేదు’ అని నీటి పారుదలశాఖ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి.
బోర్డు పైనే భారం!
Published Mon, Nov 10 2014 2:52 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
Advertisement
Advertisement