- జూలై మూడో వారంలో ఐసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్
- ప్రవేశాల కమిటీల్లో రెండు రాష్ట్రాలకు సమ ప్రాధాన్యం
29 నుంచి ఎంసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్
Published Fri, Jun 6 2014 2:18 AM | Last Updated on Sat, Sep 2 2017 8:21 AM
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం ఈనెల 29 నుంచి ఎంసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ప్రారంభించాలని ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయించారు. గురువారం ఉన్నత విద్యా మండలిలో చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఎంసెట్, ఐసెట్, ఈసెట్‌కు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సాంకేతిక విద్యా కమిషనర్లు శైలజా రామయ్యర్, అజయ్‌జైన్, మండలి కార్యదర్శి ప్రొఫెసర్ సతీష్‌రెడ్డి, ప్రవేశాల క్యాంపు ప్రధాన అధికారి రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.
ఎంసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ఈనెల 22నుంచే ప్రారంభించాలని ముందుగా భావించినా.. ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకు సంబంధించిన పలు ఉత్తర్వులు (జీఓలు) వెలువడాల్సి ఉంది. మరోవైపు ఏఐసీటీఈ కొత్త కాలేజీలకు అనుమతులు ఇస్తోంది. వాటికి యూనివర్సిటీల నుంచి అఫిలియేషన్ రావాల్సి ఉంది. మేనేజ్‌మెంట్స్ కన్సార్షియంగా ఏర్పడి నిర్వహించుకునే సొంత పరీక్షపైనా ఉత్తర్వులు రావాల్సి ఉంది. ఈ పరిస్థితుల నేపథ ్యంలో 29వ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను చేపట్టాలని, ఈలోగా ప్రభుత్వాలను సంప్రదించి అన్నింటికి ఉత్తర్వులు జారీ చేసేలా చ ర్యలు చేపట్టాలని నిర్ణయించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తరువాత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నారు.
ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాల కోసం (లేటరల్ ఎంట్రీ) నిర్వహించిన ఈసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను జూన్ 23 నుంచి; ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను జూలై మూడో వారంలో చేపట్టాలని నిర్ణయించారు. ప్రవేశాల కమిటీల్లో రెండు రాష్ట్రాలకు సమ ప్రాధాన్యం కల్పించనున్నారు. ప్రతి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రవేశాల కమిటీలోనూ రెండు రాష్ట్రాల అధికారుల్లో ఒకరు కన్వీనర్‌గా, మరొకరు కో కన్వీనర్‌గా ఉంటారు. ఈ మేరకు అవసరమైన చర్యలు చేపట్టేలా మండలి చైర్మన్‌కు అధికారాలు కల్పించారు.
Advertisement
Advertisement