అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తా
వెంకటాచలం: గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలను పరిష్కరించి అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని పూడిపర్తిలో వైఎస్సార్‌సీపీ నాయకుడు కోడూరు కమలాకర్‌రెడ్డి తల్లి శ్రీదేవమ్మ శనివారం మృతిచెందింది. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం కాకాణికి స్థానిక ప్రజలు రహదారులు, తాగునీరు, విద్యుత్ కోతలు తదితర సమస్యలను ఆయనకు వివరించారు.
ఆయన మాట్లాడుతూ శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశాక ప్రతి గ్రామాన్నీ సందర్శిస్తానన్నారు. తనను ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు తెలిపి, లోగడ ఉన్న సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. నియోజకవర్గ ప్రజలకు తమ కుటుంబంలో ఒకడిగా ఉంటూ సేవ చేస్తానని తెలిపారు. శాసన సభ్యుడిగా తాను, ఎంపీ వరప్రసాద్‌రావు, జిల్లా పరిషత్, మండల పరిషత్ అధ్యక్షులను సమన్వయంతో పని చేయించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. ఎవరైనా స్వతంత్రంగా తమ సమస్యలను స్వయంగా గానీ, ఫోన్‌ద్వారాగానీ తెలియజేస్తే వెంటనే పరిష్కరిస్తానన్నారు. కార్యక్రమంలో కోడూరు కమలాకర్‌రెడ్డి, కోడూరు రఘునంధన్‌రెడ్డి,బుడంగుంట రామకృష్ణారెడ్డి, మారంరెడ్డి మధురెడ్డి, పోచారెడ్డి సుమంత్‌రెడ్డి, పోచారెడ్డి శ్రీనివాసులురెడ్డి, కోడూరు మనోహర్‌రెడ్డి, ఆములూరు సుధాకర్ నాయుడు, డక్కిలి రమణయ్య, నాశిన సుధీర్, నాశిన సుధాకర్, వెంపులూరు హరి, జానా శ్రీనివాసులు పాల్గొన్నారు.