మేడారం జాతర
వరంగల్: గిరిజన సంప్రదాయం ప్రకారం అత్యంత వైభవంగా మేడారం జాతర ముగిసింది. ప్రధాన పూజారుల సమక్షంలో సమ్మక్క-సారలమ్మలు వనప్రవేశం చేశారు. మూడు రోజులుగా మొక్కులు అందుకున్న వనదేవతలు ఈ రోజు వనప్రవేశం చేయడంతో జాతరలో చివరి ఘట్టం ముగిసింది. నలుగురు దేవతల పూజారులు గద్దెల వద్ద పూజలు చేశారు. అనంతరం సారలమ్మను కన్నెపల్లికి, పగిడిద్దరాజును కొత్తగూడ మండలం పూనుగొండ్లకు, గోవిందరాజును ఏటూరునాగారం మండలం కొండాయికి, సమ్మక్కను మేడారం సమీపంలోని చిలకలగుట్టపైకి తీసుకువెళ్లారు. మేడారం జాతరకు కోటిన్నర మందికి పైగా భక్తులు హాజరైనట్లు కలెక్టర్ జి.కిషన్ చెప్పారు.
19న తిరుగువారం
సమ్మక్క-సారలమ్మ తిరుగువారం పండగను ఈ నెల 19న గిరిజన పూజారులు ఘనంగా నిర్వహిస్తారు. జాతర సందర్భంగా దేవతలను దుమ్ముకాళ్లతో తీసుకువచ్చినందుకు, పూజల్లో తప్పిదాలు జరిగితే మన్నించాలని వేడుకుంటూ ఈ ప్రక్రియను నిర్వహిస్తారు. తిరుగువారం రోజున సమ్మక్క-సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గుళ్లను, గద్దెలను శుభ్రం చేస్తారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి మేకలను దేవతలకు నైవేద్యంగా సమర్పిస్తారు. దీంతో మేడారం మహా వన జాతర ముగిసినట్లువుతుంది.