గుట్టుగా మట్కా..మత్తుగా గుట్కా! | Ends life to Cigarettes | Sakshi
Sakshi News home page

గుట్టుగా మట్కా..మత్తుగా గుట్కా!

Published Sun, Oct 14 2018 12:03 PM | Last Updated on Sun, Oct 14 2018 12:03 PM

Ends life to Cigarettes - Sakshi

గిద్దలూరు రూరల్‌: జిల్లా వ్యాప్తంగా యువత దురలవాట్లకు లోనై తమ బంగరు భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకుంటున్నారు. సిగిరెట్, మట్కా, గుట్కా, ఖైనీ వంటి వ్యసనాల వలలో చిక్కుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వ్యసనాలకు బానిసవుతున్న యువకుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. రాజకీయ నేతలతో పాటు అధికారులు, కళాశాలలు నిర్వహించే కొందరు చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారు. చెడు వ్యసనాల నుంచి బయట పడేందుకు వీలు పడక అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. గుడి, బడి, ఇళ్లు, వైద్యశాల అనే తేడా లేకుండా బహిరంగ ప్రదేశంలో సిగిరెట్లు విచ్చలవిడిగా తాగుతూ ఆరోగ్యం నాశనం చేసుకోవడమే కాకుండా బహిరంగ ప్రదేశాల్లో నిల్చొని ఉండే వారి ఆరోగ్యాన్ని సైతం నాశనం చేసేందుకు కారకులవుతున్నారు. సిగిరెట్, మద్యానికి బానిసలవుతున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా మద్యం దుకాణాల వద్ద క్యూకడుతున్నారు. 

సిగరెట్‌ కాలుతూ ఆరోగ్యాన్ని కాల్చేస్తూ..
సిగరెట్టే కదా..అని సిగిరెట్‌ కాల్చడం మొదలు పెట్టిన వ్యక్తితో పాటు సిగిరెట్‌ కాల్చగా వచ్చిన పొగతో అందరి ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారు. నెలంతా శ్రమించి సంపాదించిన సొమ్ములో సగభాగం సిగిరెట్, మద్యం, మట్కా, గుట్కా, ఖైనీ వంటి చెడు వ్యసనాలకు ఖర్చు చేస్తూ సొమ్ముతో పాటు వారి ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారు.

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు ఎక్కువ 
గిద్దలూరు నియోజకవర్గంలోని గిద్దలూరు, రాచర్ల, కొమరోలు, బేస్తవారిపేట, అర్ధవీడు, కంభం ఆరు మండలాలల్లో జనవరి 2018 నుంచి అక్టోబర్‌ వరకు సుమారు 689 డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌ కేసులే నమోదయ్యాయి. మద్యం తాగి వాహనాలు నడుపుతూ ఎక్కువ మంది పట్టుబడుతూ జరిమానాలు చెల్లిస్తున్నారు. 

జరిమానాతో పాటు జైలుశిక్షలకైనా సిద్ధపడుతున్నారు. గిద్దలూరు, సంజీవరాయుడుపేట, కేఎస్‌ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో జనవరి 2018 నుంచి సుమారు 60కిపైగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న కేసులు నమోదైనట్లు వైద్యులు చెబుతున్నారు. వీరిలో ఎక్కువ మంది మద్యం, సిగిరెట్‌తో ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న వారు ఎక్కువుగా ఉన్నారని తెలుస్తోంది. ఎక్కువ మంది ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయిస్తున్నారు. 

చిరుద్యోగి చెడు అలవాట్లకు లోనైతే? 
ప్రైవేటు రంగంలో పనిచేసే ఓ వ్యక్తి నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వేతనం తీసుకుంటాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉంటారు. రోజుకు ఒక్కో సిగిరెట్‌ రూ.10 చొప్పున రెండు ప్యాకెట్లు కాలుస్తాడు. ఇందుకు రోజుకు రూ.200 ఖర్చు చేస్తుంటాడు. వారంలో రెండు రోజులు లిక్కర్‌కు రూ.2 వేలకు పైగా ఖర్చు చేస్తుంటాడు. ఈ లెక్కన సిగరెట్లు, మద్యానికి తన సంపాదనలో సగ భాగంపైనే చెడు వ్యసనాలకే ఖర్చు చేస్తున్నాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో బయట అధిక వడ్డీలకు అప్పులు చేసి కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేసుకుంటున్నాడు.

 ముచ్చటైన కాపురం పతనం:
నా భర్త అంజి జీపు డ్రైవర్‌గా పనిచేస్తూ మద్యం, సిగిరెట్‌ వంటి చెడు వ్యసనాలకు బానిసై సంవత్సరం ఆరు నెలల క్రితం అనారోగ్యానికి గురై చనిపోయాడు. కుటుంబ పోషణ భారం నాపై పడింది. నాలుగు ఇళ్లల్లో పొద్దున్నే పాచి పని చేసుకుంటూ మిగిలిన సమయంలో హోటల్లో పనిచేసుకుంటున్నాను. రెక్కల కష్టం మీద కుటుంబాన్ని పోషించుకుంటూ ఇద్దరు పిల్లలను చదివించుకుంటున్నా. నాది కొమరోలు మండలం అయ్యావారిపల్లి. 14 ఏళ్ల క్రితం పట్టణానికి చెందిన అద్దంకి అంజితో వివాహమైంది. భర్త వృత్తిరీత్యా కారు, జీపులకు డ్రైవర్‌గా పనిచేసేవాడు. భర్త బతికి ఉన్నప్పడు చెడు వ్యసనాలకు దూరం కావాలని నెత్తీ నోరు కొట్టుకుని ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోలేదు. తీరా టైఫాయిడ్‌ జ్వరంతో నెల రోజులు మంచాన పడ్డాడు. వైద్యుల సూచనల మేరకు ప్రాణ భయంతో ఏడాది పాటు మద్యం, సిగిరెట్లకు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత మళ్లీ మద్యం తాగడం మొదలు పెట్టడంతో కామెర్లు వచ్చి లివర్‌ చెడిపోయి మృతి చెందాడు. చెడు వ్యసనాలతో చనిపోవడమే కాకుండా ఉన్న కొద్దిపాటి స్థలాన్ని అమ్మేశాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో నాలుగు ఇళ్లల్లో పాచి పనిచేసుకోవాల్సి వచ్చింది. వచ్చిన డబ్బుతో ఇద్దరు ఆడ పిల్లలను చదివించుకుంటున్నా.
– అద్దంకి లక్ష్మీదేవి

 యువత ఆరోగ్యం నిర్వీర్యం:
గిద్దలూరు ప్రాంతంలో యువత సిగిరెట్, మద్యం, ఖైనీ పొగాకు వంటి చెడు వ్యసనాలను బానిసవుతున్నారు. ఆరోగ్యాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్నారు. చాలా వరకు యువత చెడు వ్యసనాలకు బానిసలై అనారోగ్యానికి గురవుతున్నారు. మా వద్దకు వైద్యం కోసం వచ్చినప్పుడు కౌన్సిలింగ్‌ ఇచ్చి ప్రాణభయం కల్పిస్తున్నా వారిలో ఎటువంటి మార్పు రావడం లేదు. నోటి క్యాన్సర్, కిడ్నీలు పాడవడం, ఊపిరితిత్తులు పాడవుతున్నాయి. రోగాల బారినపడి చిన్న వయసులోనే మృత్యువాత పడుతున్న సంఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి.
– డి.హరినాథరెడ్డి, డాక్టర్‌ 

 ఇప్పటికే భర్తను కోల్పోయా:
చెడు వ్యసనాలకు లోనై గతేడాది భర్తను కోల్పోయా. ఇక నా కన్న కొడుకు వంతు వచ్చింది. ప్రస్తుతం పట్టణంలోని అర్బన్‌ కాలనీలో ఉంటున్నా. మాస్వగ్రామం మండలంలోని తాళ్లపల్లి. కొన్నేళ్ల నుంచి పట్టణంలో కాపురం ఉంటున్నాం. భర్త గుండమయ్య చెడు వ్యసనాలతో రెండు కిడ్నీలూ చెడిపోవడంతో మృత్యువాతపడ్డాడు. భర్త ఆరోగ్యం కోసం తాళ్లపల్లిలో ఉన్న ఇంటి స్థలం రూ.లక్షకు అమ్మి వచ్చిన డబ్బుతో భర్త ఆరోగ్యానికి ఖర్చు చేశా. అయినా ప్రయోజనం లేకుండా పోయింది.

 భర్త చనిపోయినా చేతికి అంది వచ్చిన కుమారుడు ఉన్నాడనే ఆశ కూడా మిగల్లేదు. కుమారుడు రంగస్వామి సైతం మద్యంకు బానిసై ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు. సిగిరెట్, గుట్కా, ఖైనీ, మందు.. ఇలా అన్ని వ్యసనాలూ ఉన్నాయి. ఎంత బానిసయ్యాడంటే మంచంలో ఉన్నా సరే నాకు మందు తీసుకురా..అంటూ సతాయిస్తున్నాడు. నా బాధ ఏ తల్లికీ రాకుడదు. కన్న కొడుకు రంగస్వామి రెండు కిడ్నీలూ పాడవడంతో పాటు లివర్‌ దెబ్బతింది. వణుకుడు జబ్బుతో బాధ పడుతున్నాడు. రంగస్వామి బాధ  చూడ లేక ఇటీవల ఊరి వద్ద ఉన్న ఎకరా పొలం అమ్మగా మా భాగం కింద వచ్చిన రూ.25 వేల డబ్బులు కాస్తా నంద్యాలలోని శాంతిరామ్‌ వైద్యశాలలో వైద్యం కోసం ఖర్చు చేశా. మందు తాగితే చనిపోతావని వైద్యులు చెప్పినా బతకాలనే ఆశ కన్నా మందు తాగాలనే ఆశ వాడికి ఎక్కువైంది.

 నిత్యం మందు, సిగరెట్‌ తాగడంతో కిడ్నీలు పాడై లివర్‌ సైతం నాశనమైందని వైద్యులు చెప్పారు. నరాల బలహీనతతో సక్రమంగా నిలబడలేకపోతున్నాడు. మందుకు బానిసై నా భర్త, కన్న కొడుకు జీవితం నాశనం చేసుకోవడమే కాకుండా నా జీవితాన్ని కూడా నాశనం చేశారు. భర్త చనిపోయి కన్న కొడుకు మంచాన పడి ఇన్ని కష్టాల మధ్య ఉన్న నాకు ప్రభుత్వం నుంచి వచ్చే వితంతు పెన్షన్‌ రానివ్వకుండా మా వార్డు కౌన్సిలర్‌ వెంకటస్వామి అడ్డుపడుతున్నాడు. పెన్షన్‌ రావాలంటే రూ.2 వేలు డిమాండ్‌ చేస్తున్నాడు. నాకు తెలియకుండా ఎమ్మెల్యే, అ«ధికారులు ఎలా ఇస్తారంటూ చెప్పడం చాలా అన్యాయంగా ఉంది. 
– గుజ్జా రమణమ్మ
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement