మారేడుమిల్లి : మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సివిల్ ఇంజనీర్ మరణించగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మారేడుమిల్లి నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న టైగర్ క్యాంపు వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం మంచిలి గ్రామానికి చెందిన అల్లం వరప్రసాద్ (38) ప్రైవేట్ సివిల్ ఇంజనీరుగా పని చేస్తున్నాడు. విశాఖ జిల్లాలోని సీలేరుకు చెందిన సివిల్ వర్కులను ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సీలేరులో జరుగుతున్న పనులను చూసేందుకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన తాపీ మేస్త్రీ చిన్ని, డ్రైవర్ దాకమర్రి శ్రీనివాసరావుతో కలిసి సోమవారం రాత్రి జీపులో అక్కడికి బయలుదేరారు.
మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తుండగా.. టైగర్ క్యాంపు మలుపులో జీపు అదుపుతప్పి ఘాట్‌లో బోల్తా పడింది. అక్కడి నుంచి కింద రోడ్డు వరకూ దొర్లుకుంటూ వెళ్లింది. వాహనం ధ్వంసమై అందులో ఉన్న వరప్రసాద్ అక్కడికక్కడే మరణించాడు. మేస్త్రీ చిన్నికి చేయి విరగ్గా, డ్రైవర్ శ్రీనివాసరావు స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. సమాచారం అందుకున్న మారేడుమిల్లి పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం రంపచోడవరం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన చిన్నిని చికిత్స కోసం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి పంపించారు. ఎస్సై వి.కోటేశ్వరరావు దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా రక్షణ గోడలు లేకపోవడం వల్లే ఈ సంఘటన జరిగిందని డ్రైవర్ శ్రీనివాసరావు చెప్పాడు. కనీసం మలుపుల వద్ద హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేయలేదని తెలిపాడు.
జీపు అదుపుతప్పి ఇంజనీర్ మృతి
Published Wed, Nov 26 2014 12:13 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement