ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతిచెందాడు. ఈ సంఘటన జాతీయ రహదారిపై వల్లూరు సమీపంలో శుక్రవారం ఉదయం జరిగింది. పోలీసులు, మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... జరుగుమల్లి మండలం దావగూడూరు గ్రామానికి చెందిన డి.రామానాయుడు (19) టంగుటూరు మండలం వల్లూరు వద్ద ఉన్న రైజ్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు.
అతని తండ్రి కందుకూరు ఆర్టీసీ డిపోలో డ్రైవర్ పనిచేస్తుండటంతో కుటుంబం మొత్తం కందుకూరులోనే నివాసం ఉంటోంది. దీంతో రామానాయుడు ప్రతిరోజూ కందుకూరు నుంచి కాలేజీకి వచ్చి వెళ్తున్నాడు. ఎప్పటిలాగే శుక్రవారం కూడా కాలేజీకి వచ్చాడు. ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం జరగాల్సిన పరీక్ష వాయిదా పడిందని తెలుసుకుని కాలేజీ బయటకు వచ్చాడు. అక్కడ స్నేహితునితో మాట్లాడేందుకు డివైడర్ దాటి రోడ్డుకు రెండోవైపునకు వచ్చాడు. అనంతరం తిరిగి కందుకూరు వెళ్లే బస్సు ఎక్కేందుకు రోడ్డు దాటి కళాశాల ఉన్న వైపునకు వస్తుండగా ఒంగోలు వైపు నుంచి టంగుటూరు వైపు వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. దీంతో దాదాపు 10 అడుగుల ఎత్తు ఎగిరిపడ్డ రామానాయుడు తీవ్రగాయాలపాలయ్యాడు. తోటి విద్యార్థులు ఆటోలో వేసుకుని ఒంగోలులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. కానీ, అప్పటికే రామానాయుడు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
తల్లడిల్లిన తల్లిదండ్రులు...
కందుకూరు ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న రామారావుకి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమార్తెలకు పెళ్లిళ్లు అయిపోగా, కుమారుడు రామానాయుడుని ఇంజినీరింగ్ చదివిస్తున్నాడు. ఈ క్రమంలో రోజూలాగే శుక్రవారం కాలేజీకి వెళ్లిన కుమారుడు అక్కడే మృతి చెందడంతో సంఘటన స్థలానికి చేరుకున్న రామారావు దంపతులను భోరున విలపించారు. చేతికందివచ్చిన ఒక్కగానొక్క కొడుకును కోల్పోవడాన్ని తట్టుకోలేక తల్లడిల్లారు.
బంధువుల ఆందోళన...
కళాశాల ఎదుటే రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ తమ కుమారుడిని వెంటనే హాస్పిటల్‌కు చేర్చడంలో కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు కాలేజీ ఎదుట జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. విద్యార్థి మృతదేహం ఉన్న అంబులెన్స్‌ను రోడ్డుపై అడ్డంగా ఉంచి రెండువైపులా వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ప్రమాద సంఘటనను మిగిలిన విద్యార్థులు కాలేజీ ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని, నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని ఆరోపించారు.
ప్రమాదం జరిగిన తర్వాత అరగంటకుపైగా గాయాలతో రోడ్డుపైనే రామానాయుడు పడి ఉన్నాడని, యాజమాన్యం స్పందించి హాస్పిటల్‌కు చేర్చి ఉంటే బతికేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకూ కదిలేది లేదని స్పష్టం చేశారు. సమాచారం అందుకున్న టంగుటూరు పోలీసులు కాలే జీ వద్దకు చేరుకుని ఆందోళన చేస్తున్నవారికి సర్దిచెప్పారు. యాజమాన్యంతో మాట్లాడి న్యాయం చేస్తామని, ఫిర్యాదు మేరకు కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఇంజినీరింగ్ విద్యార్థిని బలిగొన్న కారు
Published Sat, Oct 26 2013 5:33 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement