మృతిచెందిన హర్షిత
ఒంగోలు: విధి వక్రీకరించి రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం పాలైన సంఘటన జరుగుమల్లి మండలం కె.బిట్రగుంట గ్రామ సమీపంలోని కుమ్మరికుంట వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకెళ్తే.. చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన రాజేష్‌రెడ్డి అనే యువకుడు అదృశ్యమైనట్లు అతని తండ్రి రమణారెడ్డి పుంగనూరు పోలీసులకు ఈ నెల 14వ తేదీ ఫిర్యాదు చేశారు.
అతని ఆచూకీ కోసం పోలీసులు విచారించగా ఖమ్మం జిల్లాలో ఉన్నట్లు తెలిసింది. దీంతో పుంగనూరు పోలీసుస్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ జ్ఞానప్రకాష్, కానిస్టేబుల్ ఎల్లప్ప, రమణారెడ్డి, బంధువులు కలిసి పవన్‌కుమార్ అనే కారు డ్రైవర్‌ను తీసుకుని కారులో ఖమ్మం చేరుకున్నారు. అక్కడ రాజేష్‌రెడ్డిని గుర్తించి తీసుకుని తిరిగి పుంగనూరు పోలీసుస్టేషన్‌కు వెళ్తుండగా డ్రైవర్ పవన్‌కుమార్ నిద్రమత్తు కారణంగా కారు డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డుకు రెండోవైపు నెల్లూరు నుంచి ఒంగోలు వస్తున్న లారీని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారులో ఉన్న హర్షిత (35) అక్కడికక్కడే మృతిచెందింది. కారులో ప్రయాణిస్తున్న మిగిలిన ఆరుగురైన రాజేష్‌రెడ్డి, రమణారెడ్డి, మోహన్‌రెడ్డి, ఎల్లప్ప, జ్ఞానప్రకాష్, డ్రైవర్ పవన్‌కుమార్ గాయపడటంతో ఒంగోలులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. జరుగుమల్లి ఎస్సై సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతిచెందిన హర్షితకు మార్చిలో వివాహం జరగ్గా, మూడు నెలలకే ప్రాణాలు కోల్పోవడంతో విషాదం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment