అనంతపురం అర్బన్: ప్రభుత్వ మెడలు వంచేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో ఈ నెల 22 నుంచి 26 వరకు చేపడుతున్న రైతు భరోసా యాత్రను విజయవంతం చేయాలని ఆ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు కె.వెంకటచౌదరి, యూవజన విభాగం జిల్లా అధ్యక్షుడు డి.ధనుంజయయాదవ్, తదితరులు మాట్లాడారు.
జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో ఈ యాత్ర సాగుతుందన్నారు. రైతులకు తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు అపద్ధపు హామీలు ఇచ్చిన చంద్రబాబు సీఎం పీఠాన్ని దక్కించుకున్నారన్నారు. జిల్లాలో కరువు పరిస్థితుల కారణంగా అప్పులపాలైన రైతుల ఆత్మహత్యలు చేసుకోగా.. అవి ఆత్మహత్యలు కావని సీఎం చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సభ్యులు చెప్పడం రైతు సంక్షేమంపై వారి చిత్తశుద్ధిని తెలియచేస్తోందన్నారు.
జిల్లాలో రూ.6 వేల కోట్ల వ్యవసాయ రుణాలు వుంటే రూ. 700 కోట్లు మాఫీ చేసి.. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామని మరోసారి రైతులను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. రైతుల ఆత్మహత్యలపై జగన్‌మోహన్‌రెడ్డి శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయడంతో మెట్టుదిగిన ప్రభుత్వం 29 మంది బాధిత రైతు కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం అందజేస్తామని ప్రకటించిదన్నారు. అయితే ఇంత వరకు ఒక పైసా కూడా ఏ ఒక్క కుటుంబానికి అందించిన పాపాన పోలేదన్నారు.
ఈ నిర్లక్ష్య ప్రభుత్వాన్ని నిలదీయడానికే జగన్ రైతు భరోసా యాత్ర చెపడుతున్నారని ఆయన తెలిపారు. ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలే జయరాంనాయక్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పామిడి వీరాంజినేయులు, సేవాదల్ విభాగం జిల్లా అధ్యక్షుడు మిద్దె భాస్కర్‌రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబిలేసు, విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షుడు బండిపరుశురాం మాట్లాడుతూ చంద్రబాబు జిల్లా రైతాంగాన్ని చేసిన మోసంపై నిలదీసేందుకు రైతన్నలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు వేలాదిగా తరలివచ్చి ఈ యాత్రను విజయవంతం చేయాలని కోరారు.
ప్రభుత్వం మెడలు వంచేందుకే రైతు భరోసా యాత్ర
Published Sat, Feb 21 2015 2:00 AM | Last Updated on Fri, Aug 17 2018 8:19 PM
Advertisement
Advertisement