పట్టిసీమ ఎత్తిపోతల పథకం టెండర్ ప్రక్రియలో ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కింది. గడువులోగా పూర్తి చేస్తే కాంట్రాక్టర్‌కు అదనంగా 16.9 శాతం చెల్లించడానికి అనుకూలంగా టెండర్ పిలిచిన తర్వాత.. నిబంధనలు మారుస్తూ నిర్ణయం తీసుకోవడంలో భారీగా ముడుపులు చేతులు మారాయనే ఆరోపణులున్నాయి. ఈపీసీ విధానంలో టెండర్ విలువలో 5 శాతం కంటే ఎక్కువ కోట్ చేయడానికి అవకాశం లేదు. తొలుత సాధారణ నిబంధనలతో టెండర్ పిలిచినా, సర్కారు పెద్దలు ఆశించిన విధంగా కాంట్రాక్టర్ నుంచి కాసులు కురిసే అవకాశం లేకపోవడంతో, 5 శాతం నిబంధనను తుంగలో తొక్కేశారు. ఆ నిబంధనను తొలగిస్తూ ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకొని.. మళ్లీ టెండర్ పిలిచారు. అదనంగా కాంట్రాక్టర్‌కు కట్టబెట్టడానికి వీలుగా నిబంధనలను మార్చడం పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన విషయం విదితమే.
గోదావరి ట్రిబ్యునల్ అవార్డులోని పోలవరం ప్రాజెక్టు పేరిట ఉన్న రెండో చాప్టర్‌లో 7(ఇ) క్లాజ్‌లో.. ‘పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) అనుమతి వచ్చిన వెంటనే, కుడికాల్వకు వాస్తవంగా నీటిని ఎప్పుడు మళ్లిస్తారనే అంశంతో నిమిత్తం లేకుండా, కృష్ణా జలాల్లో ఏపీకి ఉన్న కేటాయింపుల్లో 35 టీఎంసీల నీటిని వాడుకొనే స్వేచ్ఛ కర్ణాటక, మహారాష్ట్రకు ఉంటుంది’ అని ఉంది. 7(ఎఫ్)లో.. ‘80 టీఎంసీల కంటే ఎక్కువ కుడికాల్వకు మళ్లిస్తే.. ఆ నీటిలోనూ ఎగువ రాష్ట్రాలకు వాటా ఇవ్వాలి’ అని కూడా ఉంది. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా మళ్లిస్తామని చెబుతున్న 80 టీఎంసీల్లో ఎగువ రాష్ట్రాలు వాటా అడిగితే.. కృష్ణా జలాల్లో వాటా ఇవ్వకతప్పదని ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎక్కడా నీటిని నిల్వ చేయడానికి అవకాశం లేకపోవడంతో, లిఫ్ట్ ద్వారా కృష్ణాకు మళ్లించే నీటి విషయంలో ఎలాంటి గ్యారంటీ లేదంటున్నారు. ఇలా గ్యారంటీ లేకుండా, కృష్ణా నికర జలాల్లో మన వాటాలో కోత పడితే రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుందని నీటిపారుదలరంగ నిపుణులు చేసిన హెచ్చరికలనూ ప్రభుత్వం పెడచెవిన పెట్టడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. తమకు న్యాయంగా దక్కాల్సిన నీటిని లిఫ్ట్ ద్వారా తీసుకెళితే గోదావరి డెల్టాకు తీరని నష్టం జరగుతుందని ఆ ప్రాంత రైతులు మొత్తుకుంటున్నా.. ప్రభుత్వం లక్ష్యపెట్టకుండా మొండిగా వ్యవహరిస్తోందని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి.
ఎత్తిపోతల ‘ప్రక్రియ’ అంతా అవినీతిమయం
Published Mon, Mar 30 2015 1:14 AM | Last Updated on Mon, Aug 20 2018 6:35 PM
Advertisement
Advertisement