సేప ఎటుపోనాదో..!
విశాఖపట్నం: విశాఖ తీరంలో చేపలకు కరువొచ్చిపడింది. గతంలో ఎన్నడూ లేనంతంగా అత్యంత దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి. సముద్రం పూర్తిగా వట్టిపోయింది. గులివిందలు, కవ్వళ్లు, కానాఖడతలు వంటి గుండ (చిన్నచిన్న) చేపలు తప్ప ఏమీ దొరకడంలేదు. అదీ కూడా చాలా తక్కువ మోతాదులో చిక్కుతున్నాయి.
రెండున్నర లక్షల రూపాయల ఖర్చు చేసి నెల రోజుల పాటు వేట సాగిస్తే కనీసం రూ. 50 వేల విలువైన చేపలు కూడా దొరకడంలేదు. దీంతో విశాఖ ఫిషింగ్ హార్బర్లో అర్ధంతరంగా చేపల వేటను నిలిపేశారు. ఫిషింగ్ హార్బర్లో 750 మరబోట్లు, 1500 మోటారు బోట్లు ఉంటే అందులో ఈ ఆదివారం మూడు మరబోట్లు మాత్రమే చేపలవేట వెళ్లాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సముద్రంలో ఇంత దారుణంగా మత్స్యసంపద ఎప్పుడూ పడిపోలేదని మత్స్యకారులు చెబుతున్నారు.
2011లో ఇటువంటి పరిస్థితులు ఎదురైనా మరీ ఇంత దారుణంగా లేదంటున్నారు. చేపలు గుడ్లు పెట్టే సమయమైన ఏప్రిల్ 15 నుంచి 47 రోజుల పాటూ చేపలవేటకు విరామం ప్రకటించినా ఎందుకు మత్స్యసంపద వృద్ధి చెందలేదో? అర్థంగాక మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. మర పడవల సంఘాలకు చెందిన ప్రతినిధులతో పాటూ మేధావులకు కూడా ఈ పరిస్థితి అంతుబట్టడం లేదు. మత్స్యశాఖ అధికారులకు కూడా పరిస్థితిని వివరించారు. నష్టాలు తట్టుకోలేక 30 బోట్లను అమ్మేశారు. మరో 50 బోట్ల వరకు అమ్మకానికి సిద్ధంగా ఉండడం బోటు యజమానుల దయనీయ స్థితికి అద్దం పడుతోంది.
గుడిబండగా మారిన డీజీల్ ధర : ఫిషింగ్ హార్బర్లో చేపలవేట సాగించే మర, మోటారు బోట్లన్నీ లాంగ్‌లైన్ తరహాలో వేట సాగించేవే. అంటే బోటు ప్రయాణంలో ఉండగానే వేట సాగిస్తారు. దీంతో వీరికి డీజిల్ ఎక్కువ అవసరం పడుతోంది. 15 నుంచి 20 రోజుల పాటు వేట సాగించాలంటే 3 వేల నుంచి 4 వేల లీటర్ల డీజిల్ ఉండాలి. ప్రస్తుతం లీటరు డీజిల్ రూ. 63 ఉంది.
ఈ లెక్కన 3 వేల లీటర్లకు రూ. లక్షా 89 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. గోరుచుట్టుపై రోకలిపోటులా ఐసు ధరలు కూడా శరాఘాతంగా తయారయ్యాయి. బోటు వేటకెళ్లాలంటే 20 నుంచి 30 టన్నుల ఐసు పడుతుంది. టన్ను ఐసు రూ.1200 నుంచి రూ.1250 వరకు ఉంది. 36 వేలు ఐస్‌కే ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇక బియ్యం, నిత్యావసర వస్తువులు, తాగునీరు, మరమ్మతులు, వలలు ఇవన్నీ కలుపుకుంటే రూ. రెండున్నర లక్షలకు పైబడి ఉంటే గాని వేటకు వెళ్లలేని పరిస్థితి.
టూనా, కోనెం, టైగర్ రొయ్యల జాడే లేదు
టూనా, కోనెం, వంజరాలు, వైట్, బ్రౌన్ పాంప్లేంట్, టైగర్ రొయ్యలకు విదేశీ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. సింగపూర్, జపాన్, మలేషియా దేశాల్లో ఇవి మంచి ధర పలుకుతాయి. ఇవి వలకు చిక్కాయంటే మత్స్యకారుడుకి సిరులు పండినట్లే. కానీ ఈ సీజన్‌లో వీటి జాడ మచ్చుకైనా కానరావడంలేదు.