ప్రతి రైతుకూ పరిహారమివ్వాలి
కదిరి : ‘సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్న ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా భూములు సాగు చేసుకుంటున్న రైతులను గుర్తించడంలోనే ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. టీడీపీకి చెందిన దళారులు చెప్పినట్లు కొందరు అధికారులు వ్యవహరిస్తూ అర్హులైన రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారు. సాగులో ఉన్న ప్రతి రైతుకు ఎకరాకు రూ.3 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాల్సిందే. అప్పటిదాకా రైతుల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంద’ని కదిరి, రాయచోటి ఎమ్మెల్యేలు అత్తార్ చాంద్‌బాషా, గడికోట శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఎన్‌పీ కుంట మండలంలో ఏర్పాటు చేస్తున్న సోలార్ పవర్ ప్రాజెక్టు కారణంగా భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం చెల్లింపులో జాప్యం, అవకతవకలను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ మండల నేత జగదీశ్వర్‌రెడ్డి అధ్యక్షతన గురువారం ఆ మండల కేంద్రంలో కదిరి-రాయచోటి రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు హాజరై.. రైతులనుద్దేశించి మాట్లాడారు. ‘రైతులు కంటతడి పెడితే రాష్ట్రం బాగుపడదు. రైతులను ఏడ్పించే వారు సర్వ నాశనమైపోతార’ ని అన్నారు.
రైతులకు జరుగుతున్న అన్యాయంపై తామిద్దరం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. అవసరమైతే పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కూడా ఎన్‌పీ కుంటకు తీసుకొచ్చి ఉద్యమిస్తామన్నారు. ‘ప్రభుత్వానికి 20 రోజులు గడువిస్తున్నాం. అంతలోగా నిజమైన రైతులను గుర్తించి నష్టపరిహారం ఇవ్వాలి. లేని పక్షంలో ప్లాంట్ పనులను అడ్డుకుంటాం. అలాగే బాధిత రైతులకు అంతే పరిమాణంలో భూమి ఇవ్వడంతో పాటు వారి కుటుంబాలకే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాల’ ని డిమాండ్ చేశారు. రహదారిపైనే సుమారు నాలుగు గంటల పాటు ధర్నా సాగడంతో వాహనరాకపోకలు స్తంభించాయి.
ధర్నా అనంతరం కదిరి ఎమ్మెల్యే రైతులతో కలిసి సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్న ప్రాంతానికి ర్యాలీగా వెళ్లారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు వారిని ప్రవేశ ద్వారం వద్దే అడ్డుకున్నారు. రైతుల భూములలోకి వారినే అడుగుపెట్టనీకుండా అడ్డుకోవడం రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేదని ఎమ్మెల్యే చాంద్‌బాషా సోలార్ ప్రాజెక్టు అధికారులతో పాటు పోలీసులపై మండిపడ్డారు. వర్షాన్ని సైతం లెక్కజేయకుండా ఆయన అక్కడే బైఠాయించారు. దీంతో లోపలికి అనుమతించారు. 20 రోజుల్లో రైతులకు న్యాయం జరగకపోతే పనులు అడ్డుకుంటామని ఎమ్మెల్యే అక్కడున్న అధికారులతో పునరుద్ఘాటించారు. పరిహారం ఇవ్వకుండానే పనులు ఎలా చేస్తారని ప్రశ్నించారు.
సోలార్ పవర్ ప్రాజెక్టు చీఫ్ మేనేజర్ ధనుంజయ్ సమాధానమిస్తూ రైతులకు ఇప్పటికే నష్టపరిహారం ఇచ్చి భూములను తీసుకున్నట్లు ప్రభుత్వం తమకు చెప్పడంతోనే పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ధర్నాలో వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యులు డాక్టర్ పీవీ సిద్దారెడ్డి, జక్కల ఆదిశేషు, మైనార్టీ నాయకులు బాహవుద్దీన్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.