వైఎస్‌ఆర్ సీపీ డిమాండ్లను ఒప్పుకోండి..
హైదరాబాద్ : ఓ వైపు రాష్ట్రంలో రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంటే మరోవైపు టీడీపీ మాత్రం రైతుల దుఖం మీద పండుగ చేసుకుంటోదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పార్థసారధి అన్నారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంతో మట్లాడారు. ‘అన్ని జిల్లాల్లో కరువు ఉంది, పంటలకు గిట్టుబాటు ధరలు లేవు.
పండిన పంటను అమ్ముకోలేని స్థితిలో రైతులు ఉన్నారు. టీడీపీ మహానాడులో రైతుల సమస్యులు గానీ.. యువకుల ఉద్యోగాల సమస్యలు గానీ చర్చకే రాలేదు. మహానాడులో ఎటువంటి మేలు జరిగే విషయం చర్చకు రాలేదు. ఎన్టీఆర్ కుటుంబసభ్యులు లేకుండా మహానాడు జరుపుతున్నారు. మహానాడు పేరుతో తిరునాళ్లు చేసుకున్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లు పొడిచారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని మంటగలిపారు.
మీ ప్రభుత్వంపై నమ్మకం ఉంటే, మీ ప్రభుత్వంలో అవినీతి లేదంటే.. వైఎస్‌ఆర్ సీపీ చేసిన డిమాండ్లను ఒప్పుకోండి. మీ మూడేళ్ల పాలనపై నమ్మకం ఉంటే అవినీతిపై సీబీఐతో విచారణ చేయించండి. మీ కులపిచ్చితో రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. రాయలసీమకు నీళ్లివ్వాలని ఆలోచించిన మొదటి వ్యక్తి వైఎస్‌ఆరే. కృష్ణా, గోదావరి డెల్టా రైతులకు అన్యాయం జరగకుండా రాయలసీమకు నీళ్లివ్వాలని ఆయన తపించారు.
ఇక నారా లోకేశ్ ప్రసంగం ఉత్తరమకుమారుడి ప్రగల్భాలను తలపించింది. రాజధాని భూముల్లో అవినీతి జరగలేదని చెప్పగలరా?. అమరావతిలో కానీ...పోలవరంలోకానీ జరగాల్సిన అభివృద్ధి జరిగిందా?. మీరు అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ఏవిధంగా అడ్డుపడుతున్నారో చెప్పాలి. రాష్ట్రంలో అవినీతి తప్ప... అభివృద్ధి జరగడం లేదు.’ అని ఆయన అన్నారు.