నీటి పొదుపునకు అంతా కృషి చేయాలి
♦ ప్రపంచ జల దినోత్సవం
♦ సందర్భంగా అసెంబ్లీలో సీఎం
♦ హార్టీకల్చర్ హబ్‌గా రాయలసీమ
♦ సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: జల వనరుల సమర్థతను పెంచి, వచ్చే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ను కరవు రహిత రాష్ట్రంగా మార్చడమే ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. జల పరిరక్షణ ద్వారా పేదరికాన్ని నిర్మూలించి, ఆర్థిక అసమానతలను తగ్గించడం లక్ష్యమన్నారు. రాయలసీమను హార్టీకల్చర్ హబ్‌గా మారుస్తామని వెల్లడించారు. నదుల అనుసంధానం తమ లక్ష్యమన్నారు. జలవనరుల సద్వినియోగానికి ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని శాసనసభలో మంగళవారం సీఎం ప్రసంగించారు. ప్రతీ నీటి చుక్కనూ సద్వినియోగం చేసుకునేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.
ప్రజల్లో చైతన్యం కల్గించేందుకు అందరూ కృషి చేయాలన్నారు. గత ప్రభుత్వాల వైఫల్యాల వల్లే రాయలసీమ ఇప్పటికీ కరవు ప్రాంతంగా ఉందని, నిర్దిష్ట కార్యక్రమాలతో దీన్ని ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. మరో రెండేళ్లు రాష్ట్రంలో కరవు పరిస్థితులు ఉండే అవకాశం ఉందనే సంకేతాలు వస్తున్నాయన్నారు. దీనిపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. వరి పంట కన్నా పండ్లతోటలే ఆదాయాన్నిస్తాయని, రాయలసీమ జిల్లాల్లో ఉద్యానవనాలను ప్రోత్సహిస్తామన్నారు. భూగర్భ జలమట్టం పెంచేందుకు చేపట్టిన పంట గుంటల కార్యక్రమం మంచి ఫలితాలిస్తోందని, రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల పంటగుంటలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు....
♦ గడచిన రెండేళ్లలో సాగునీటి ప్రాజెక్టులకు రూ. 7,888.62 కోట్ల నిధులు కేటాయించాం. ఈ కాలంలో మరో 1.182 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చింది. స్థిరీకరించిన ఆయకట్టు 13.08 లక్షలు. ఏడు ప్రాజెక్టులకు అత్యధికంగా ప్రాధాన్యం ఇస్తున్నాం. వీటిని 2017-18 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
♦ ఈ ఏడాది డిసెంబర్ నాటికి బీఆర్‌ఆర్ వంశధార ప్రాజెక్టు రెండో దశను పూర్తి చేసి, శ్రీకాకుళం జిల్లాలోని 45 వేల ఎకరాలకు నీరి స్తాం. 194 కట్టడాల్లో ఇప్పటికే 28 పూర్తయ్యాయి. తోటపల్లి ప్రాజెక్టును ఈ ఏడా ది జూన్ నాటికి, గజపతినగరం బ్రాంచ్ కాల్వను అక్టోబర్‌లో పూర్తవుతాయి. పట్టిసీమ ఎత్తిపోతల పనులన్నీ పురోగతిలో ఉన్నాయి. పోలవరం ఎడమ ప్రధాన కాల్వ పనులను 2017 జూన్ నాటికి పూర్తిచేస్తాం.
♦ పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును 2017-18లోగా పూర్తి చేయాలని, మొత్తం 4,47,300 ఎకరాలకు నీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
♦ నీరు-చెట్టు కార్యక్రమం ద్వారా అనావృష్టి పరిస్థితులను ఎదుర్కొంటాం. ప్రతీ వర్షం నీటి బొట్టును ఒడిసి పట్టడం ఈ పథకం ముఖ్యోద్దేశ్యం.
తిరుమల స్థాయిలో శ్రీశైలం అభివృద్ధి
తిరుమల స్థాయిలో శ్రీశైలం అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.టెంపుల్ టూరిజం లో భాగంగా శ్రీశైలం,విజయవాడలోని ప్రముఖ ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర దేవాదాయ శాఖ రూపొందించిన ప్రణాళికలపై ఆయన మంగళవారం సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. శ్రీశైలం పరిసరాల్లో ఐదు వేల ఎకరాల్లో నాలుగైదు టౌన్‌షిప్‌ల నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నారు.శ్రీశైలం చుట్టూ 8 కిలోమీటర్ల ఔటర్ రింగు రోడ్డు నిర్మాణంతో పాటు శ్రీశైలం, సున్నిపెంటలను పట్టణాలుగా తీర్చిదిద్దాలన్నారు. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కాలిబాట వంతెనలు ఏర్పాటు, అర్జున వీధిని 60 అడుగుల రోడ్డుగా వెడల్పు చేయాలని భావిస్తున్నారు.