మాజీ సర్పంచ్ ఆత్మహత్య....
మాజీ సర్పంచ్ ఆత్మహత్యకాకినాడ క్రైం :
పుట్టిన రోజు నాడే ఓ మాజీ సర్పంచ్ తనువు చాలించాడు. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యల కారణంగానే అతడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని సన్నిహితులు చెబుతున్నప్పటికీ, కొందరు వేరే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయ ఒత్తిళ్లకు బలైన అతడు మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకుని ఉంటాడని చెబుతున్నారు. ఈ సంఘటన జిల్లాలో కలకలం రేపింది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
కాకినాడ రూరల్ మండలం నేమాంనకు చెందిన కోన రామకృష్ణ (40) గతంలో సర్పంచ్‌గా వ్యవహరించాడు. అంతేకాకుండా అతడు ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా చేసేవాడు. ట్యాంకర్లు, లారీలు కలిగి ఉండడంతో ట్యాంకర్స్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా కూడా వ్యవహరించాడు. శనివారం రాత్రి పెళ్లికి వెళ్తున్నానని చెప్పి అతడు ఇంటి నుంచి బయలుదేరాడు. రాత్రి ఏడు గంటల సమయంలో స్థానిక మెయిన్ రోడ్డులోని టౌన్‌హాలు (కాకినాడ లిటరరీ అసోసియేషన్)కు వచ్చి రూమ్ అడిగాడు. టౌన్ హాలులో రామకృష్ణ సభ్యుడు కావడంతో గెస్ట్‌రూమ్‌లోని ఏడో నంబరు గదిని కేటాయించారు. రూమ్‌లో మద్యంతో పాటు పురుగు మందు తాగి అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి 12 గంటల వరకు అతడు ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. సాధారణంగా టౌన్ హాలులో ఉంటుంటాడని భావించిన అతని మేనల్లుడు దాసరి గంగాధర్ వచ్చి చూసేసరికి అక్కడ రామకృష్ణ మోటార్ బైక్ కనిపించింది. దీంతో టౌన్‌హాలు సిబ్బందిని అడగ్గా, ఏడో నంబరు గదిలో రామకృష్ణ ఉన్నట్టు చెప్పారు. కుటుంబ సభ్యులు అక్కడకు వెళ్లి తలుపు కొట్టినప్పటికీ స్పందన లేదు. అరగంట పాటు వేచి ఉన్న వారు ఫలితం లేకపోవడంతో తలుపును బలంగా తెరిచారు. అప్పటికే రామకృష్ణ మంచంపై విగతజీవిగా పడి ఉన్నాడు. సమీపంలో పురుగు మందు డబ్బా కనిపించింది. దీంతో రామకృష్ణ పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని నిర్ధారించుకుని, పోలీసులకు సమాచారం అందించారు. ఆదివారం ఉదయం టూటౌన్ ఎస్సై ఎం.శేఖర్‌బాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని రామకృష్ణ బంధువులకు అప్పగించారు. రామకృష్ణ అన్నయ్య కోన వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శేఖర్‌బాబు తెలిపారు. రామకృష్ణకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
రాజకీయ విభేదాలతో మనస్తాపం
మాజీ సర్పంచ్ కోన రామకృష్ణ ట్యాంకర్స్ అసోసియేషన్‌లో కీలక పాత్ర పోషించాడు. ప్రతి నెలా ప్రజాప్రతినిధులకు ముడుపులు అందజేసే విధానానికి స్వస్తిపలికి, వారి ఆగ్రహానికి గురయ్యాడని సన్నిహితులు చెబుతున్నారు. అతడిపై స్థానిక నాయకులు పలు కేసులు కూడా పెట్టించి వేధింపులకు గురిచేశారంటున్నారు. తీవ్ర మానసిక ఒత్తిళ్లకు గురైన రామకృష్ణ మానసిక స్థితిని కోల్పోయేలా స్థానిక నాయకులు చేశారని ఆరోపిస్తున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అతడు చివరకు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని చెప్పారు. అయితే అతడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఎందుకు ఇలా జరిగిందో అర్ధం కావడం లేదంటున్నారు. ఎల్లప్పుడూ కొంతమందితో కలిసి తిరిగే రామకృష్ణ.. ఒంటరిగా టౌన్‌హాలుకు రావడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ సిటీ, రూరల్ ప్రాంతాలకు చెందిన పలువురు నాయకులు, లారీ, ట్యాంకర్ ఓనర్లు, వర్కర్లు అక్కడకు తరలివచ్చారు. రామకృష్ణ మృతితో నేమాంతో పాటు కాకినాడ రూరల్ మండలంలో విషాదఛాయలు అలముకున్నాయి.