సిండికేటుగాళ్లు | Excise department not taking action on belt shops | Sakshi

సిండికేటుగాళ్లు

Jan 6 2014 12:59 AM | Updated on Sep 2 2017 2:19 AM

మద్యం వ్యాపారులు మందుబాబులను దోచే స్తున్నారు. సిండికేటుగా ఏర్పడి మద్యం అధిక రేట్లకు అమ్మి అక్రమంగా కోట్లకుకోట్లు మింగేస్తున్నారు.

కాట్రేనికోన, న్యూస్‌లైన్ : మద్యం వ్యాపారులు మందుబాబులను దోచే స్తున్నారు. సిండికేటుగా ఏర్పడి మద్యం అధిక రేట్లకు అమ్మి అక్రమంగా కోట్లకుకోట్లు మింగేస్తున్నారు. ప్రభుత్వాన్ని మోసం చేసి.. అధికారులతో కుమ్మక్కై మరీ దోపిడీ సాగిస్తున్నారు.
 కాట్రేనికోన మండలంలో చెయ్యేరు, కందికుప్ప, కాట్రేనికోనల్లో 9 లెసైన్స్ షాపులకు 8కి మాత్రమే టెండర్ వేశారు. ఓ షాపునకు టెండర్ వేయకుండా మద్యం వ్యాపారులు ముందే కుమ్మక్కయ్యారు.  చెయ్యేరులో రెండు, కందికుప్పలో రెండు, పల్లంకుర్రులో ఒకటి, కాట్రేనికోనలో మూడు షాపులకు ప్రభుత్వం లెసైన్స్‌లు మంజూరు చేసింది.

కాట్రేనికోనలో నాలుగు షాపుల్లో మూడింటికి మాత్రమే టెండర్లు వేశారు. మిగిలిన షాపునకు  టెండరు వేయకుండా వ్యాపారులు జాగ్రత్త పడ్డారు. ఈ షాపునకు చెందిన మద్యం అమ్మకాలను మూడు షాపుల్లో గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చేస్తున్నారు. ఒక్కొక్క షాపునకు లెసైన్స్‌కు రూ.34 లక్షలు, షాపు పర్మిట్ కోసం రూ.2 లక్షలు ప్రభుత్వానికి  చెల్లించాలి. ఏదైనా షాపునకు టెండర్ వేయని పక్షంలో ప్రభుత్వమే తమ సిబ్బందిని పెట్టి ఎంఆర్‌పీకే విక్రయించాలి.

అయితే ముమ్మిడివరం ఎక్సైజ్ అధికారులు సిండికేట్ వ్యాపారుల నుంచి అందుతున్న నెలసరి ముడుపులతో కటాక్షించి టెండరుకు ఎవరూ రావడం లేదని, ప్రభుత్వం నిర్వహించేందుకు షాపులు దొరకడం లేదని సాకుగా చూపారు. అధికారుల కారుణ్యంతో ప్రభుత్వానికి లెసైన్స్, రూమ్ పర్మిట్ల రూపంలో రూ.36 లక్షల నష్టం వాటిల్లుతోంది. ప్రభుత్వం షాపును నిర్వహించి ఉంటే లెసైన్స్ సొమ్ము లాభాల రూపంలో ప్రభుత్వానికి, మందుబాబులకు ఎంఆర్‌పీకే మద్యం దొరికేది. అన్నిచోట్లా ఎంఆర్‌పీకి అమ్మకాలు సాగిస్తున్నా, కేవలం కాట్రేనికోనలో మాత్రమే అధిక ధరలకు విక్రయిస్తున్నారు.

 ఇష్టారాజ్యంగా విక్రయాలు
 పల్లంకుర్రు, కందికుప్ప, కాట్రేనికోనల్లో బాటిల్‌పై ఉన్న ఎంఆర్‌పీపై  రూ.10, చెయ్యేరులో రూ.5 అదనపు ధరలకు విక్రయిస్తున్నారు. చీప్ లిక్కర్, మెన్‌సన్ క్లబ్‌లపై రూ.10, ఎంసీ, ఎంహెచ్, ఏసీపీ, బీరు తదితర బ్రాండ్లపై రూ.20 చొప్పున అదనపు రేట్లు వసూలు చేస్తున్నారు. బెల్టు షాపుల్లో వారి ఇష్టారాజ్యంగా అమ్ముకుంటున్నారు. రోజుకు సుమారు 300 కేసులకు పైగా అమ్మకాలు జరుగుతున్నాయి. వీటి ద్వారా సుమారు రూ.లక్ష పైబడి మందుబాబుల నుంచి అదనంగా పిండేస్తున్నారు. ఏడాదికి సుమారు రూ.3 కోట్లు పైబడి అదనపు రేట్లతోనే వస్తుందని చెప్పుకొంటున్నారు.

 ఎక్కడ చూసినా బెల్టు షాపులే..
 మండల గ్రామాల్లో తాగునీరు లేదేమో కాని మద్యానికి మాత్రం కొదవలేదు. మండలంలో 8 లెసైన్స్ షాపుల పరిధిలో సుమారు 350 బెల్ట్ షాపులు ఉన్నాయి. వీటిల్లో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మత్స్యకార గ్రామం గచ్చకాయలపోర మినహాయించి మిగిలిన చోట్ల బెల్టు షాపులకు సైతం వేలం పాటలు నిర్ణయించి యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నారు. కొందరు ఎక్సైజ్, పోలీసు అధికారులకు నెలకు రూ.38,150లను మామూళ్లుగా ఇస్తున్నట్టు రాసిన ఓ కాగితం ఇటీవల ఓ బెల్టుషాపు వద్ద ‘న్యూస్‌లైన్’కు లభించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement