ఉత్సాహంగా కబడ్డీ పోటీలు
విశాఖపట్నం : దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకొని ఆదివారం విశాఖ సాగర తీరంలో తలపెట్టిన కబడ్డీ పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీలను వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ప్రారంభించారు. తొలుత వేదిక వద్ద ఏర్పాటు చేసిన వైఎస్ తాత్కాలిక విగ్రహానికి నాయకులంతా పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గాజువాక మహిళా కబడ్డీ జట్టుతో పార్టీ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్, మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి కబడ్డీ ఆడి ఉత్సాహం నింపారు. తరువాత మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్ క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.
మూడు రోజులపాటు సాగర తీరంలో ఈ పోటీలు జరగనున్నాయని మళ్ల విజయప్రసాద్ తెలిపారు. పోటీల ముగింపు కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి హాజరుకానున్నారని చెప్పారు. జిల్లాలోని పలు కబడ్డీ జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. గాజువాక, అక్కయ్యపాలెం మహిళా జట్ల మధ్య పోరుతో పోటీలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్లు తిప్పల నాగిరెడ్డి, కోలా గురువులు, కర్రి సీతారాం, పార్టీ నాయకులు ఫరూఖ్, జాన్ వెస్లీ, శ్రీకాంత్, జిల్లా కబడ్డీ సంఘం కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.