విజయవాడ సిటీ : కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భూములు, స్థలాల మార్కెట్ విలువలు పెంచేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. సోమవారం నుంచి రెండు జిల్లాల్లో రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో బహిరంగ మార్కెట్ విలువలపై సర్వే చేపట్టారు. గుంటూరు, విజయవాడ పట్టణాల మధ్య రాజధాని ఏర్పాటుకాబోతున్న సమాచారంతో ఈ ప్రాంతంలో బహిరంగ మార్కెట్ విలువలకు రెక్కలొచ్చిన విషయం విదితమే.
గత నెల రోజులుగా రెండు జిల్లాల్లో బహిరంగ మార్కెట్ విలువలు అడ్డూ అదుపు లేకుండా పెరిగాయి. ఈ క్రమంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఐజీ రాజశేఖర్ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో బహిరంగ మార్కెట్ విలువలపై విచారణ జరపాలని రెండు జిల్లాల రిజిస్ట్రేషన్ అధికారులను కొద్ది రోజుల క్రితం ఆదేశించారు. దాంతో రెండు జిల్లాల్లో ఆరుగురు డీఆర్‌లు భూముల విలువలపై ఆరా తీస్తున్నారు.
ఆదాయం పెంపే లక్ష్యం...
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ద్వారా ఖజానాకు భారీగా ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. గత నెలలో రాష్ట్రంలో 13 జిల్లాల్లో రూ.4.085 కోట్లు రాష్ట్ర టార్గెట్‌గా నిర్ణయించారు. కృష్ణాజిల్లాకు రూ.616 కోట్లు, గుంటూరు జిల్లాకు రూ.433 కోట్లు లక్ష్యం విధించారు. రాష్ట్ర విభజన క్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుని భూములు, స్థలాలు రెట్టింపు రేట్లు పెరిగాయి.
గ్రామ స్థాయిలో సర్వే...
భూములు, స్థలాల బహిరంగ మార్కెట్ విలువలు ఎలా ఉన్నాయనే విషయమై రిజిస్ట్రేషన్స్ శాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బందితో కలిపి కమిటీలుగా ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాల్లో వీఆర్‌ఓలతో కలిసి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు గ్రామాల్లో పర్యటించి బహిరంగ మార్కెట్ విలువలను నమోదు చేస్తారు. ఆ విలువలలో కనీసం సగం ప్రభుత్వ మార్కెట్ విలువ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ నిర్ణయించింది. వారం రోజుల్లో సర్వే పూర్తి చేయాలని రిజిస్ట్రేషన్స్ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. భూముల మార్కెట్ విలువలు పెంచితే తద్వారా స్టాంప్ డ్యూటీ పెరిగి ఖజానాకు భారీగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
భూముల విలువల పెంపునకు కసరత్తు
Published Tue, Jul 8 2014 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 9:57 AM
Advertisement
Advertisement