కొత్త రాజధానిపై కసరత్తు షురూ!
-
ఏప్రిల్ చివరినాటికి ప్రతిపాదనలు సిద్ధం
-
కన్సల్టెంట్ సంస్థకు అప్పగింత
-
సీమాంధ్రలో అభివృద్ధిని వికేంద్రీకరించాలని నిర్ణయం
-
కొత్త రాజధానిపై ఏర్పాటైన రాష్ట్ర కమిటీ భేటీ
సాక్షి, హైదరాబాద్: కొత్త రాజధాని ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ కసరత్తు ప్రారంభించింది. పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి జోషి ఆధ్వర్యంలో రోడ్లు, భవనాలశాఖ ముఖ్యకార్యదర్శి బి. శ్యాంబాబుతో పాటు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డెరైక్టర్, హెచ్‌ఎండీఏ కమిషనర్‌లతో ఏర్పాటైన కమిటీ ప్రాథమికంగా సోమవారం సమావేశమైంది. సీమాంధ్రకు కొత్త రాజధాని ఏర్పాటుకోసం కేంద్రం నియమించే కమిటీ ఏర్పాటుకు ముందుగానే సకల సమాచారాన్ని సేకరించాలని ఈ భేటీలో నిర్ణయించారు. అన్ని అంశాల్నీ పరిశీలించేందుకు కన్సల్టెన్సీ సంస్థలను నియమించాలని నిర్ణయించింది. ఏప్రిల్ చివరినాటికి నివేదికను సిద్ధం చేయనున్నట్టు సమాచారం.
కమిటీ పరిశీలించే అంశాలు ఇవీ...
కొత్త రాజధాని ఏర్పాటుకు ఎటువంటి సౌకర్యాలు ఉండాలి? భూమితో పాటు నీటి సౌకర్యం, ఎయిర్‌పోర్టులు, రైల్వే లైన్లు, ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ వంటి అంశాల పరిశీలన.
విజయవాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి, నెల్లూరు వంటి ప్రాంతాల్లో ఉన్న సౌకర్యాలు, స్థలం లభ్యత, మౌలిక సదుపాయాలు, నీటి లభ్యతతో పాటు ఆయా ప్రాంతాల్లో ఉన్న అనుకూలతలు, వ్యతిరేక అంశాలతో కూడిన ఒక నివేదికను సిద్ధం చేయటం.
కొత్తగా ఏర్పాటైన రాష్ట్రాల్లో రాజధానుల ఏర్పాటు ఎలా జరి గిందనే అంశాన్నీ కమిటీ పరిశీలించనుంది. చండీగఢ్, గాంధీనగర్, న్యూ రాయపూర్ తదితర ప్రాం తాల్లో ఎంత విస్తీర్ణంలో రాజధానుల నిర్మాణం జరిగిందనే విషయంతోపాటు ఏయే సౌకర్యాలు కల్పించారనే అంశంపైనా అధ్యయనం. ఇందుకు కమిటీ ఆయా ప్రాంతాల్లో పర్యటించనుంది.
సీమాంధ్రలో అనేక సంస్థలను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఇందుకోసం కేవలం రాజధాని చుట్టూ కాకుండా అభివృద్ధిని వికేంద్రీకరించేందుకు వీలుగా ఏయే ప్రాంతాల్లో ఏయే సంస్థలను ఏర్పాటు చేస్తే మంచిదనే అంశాలపైనా కమిటీ నివేదిక రూపొందించనుంది. తద్వారా భవిష్యత్తులో మళ్లీ రాజధానికోసం ఆ ప్రాంతంలో సమస్య తలెత్తకుండా ఉండేందుకు దోహదపడుతుందని అభిప్రాయపడినట్టు తెలిసింది. ఉదాహరణకు శ్రీకాకుళం, అనంతపురం లాంటి ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటయ్యే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఇటువంటి ప్రాంతాల్లో ఎలాంటి సంస్థల్ని ఏర్పాటు చేస్తే మంచిదనే అంశాన్ని కమిటీ పరిశీలిస్తుంది. ఈ అంశాలపై కన్సల్టెన్సీ సంస్థల సహకారంతో ఏప్రిల్ చివరినాటికి నివేదికను సిద్ధం చేయాలని కమిటీ నిర్ణయించింది.