జిల్లాలో ఈ-పాస్ విధానం అభాసుపాలవుతుంది. కనీస శిక్షణ.. అవగాహన..
♦ పక్షం రోజులైనా గాడిలో పడని కొత్తవిధానం
♦ సరకులందక నరకం చూస్తున్న కార్డుదారులు
♦ అవగాహన లేమితో డీలర్ల అవస్థలు
♦ కొన్ని చోట్ల పాతపద్ధతిలోనే బట్వాడా
సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో ఈ-పాస్ విధానం అభాసుపాలవుతుంది. కనీస శిక్షణ.. అవగాహన.. పరిశీలన లేకుండా అమలు చేసిన ఈ కొత్త విధానం వల్ల కార్డుదారులు సకాలంలో సర కులు అందక మండుటెండలో గంటల తరబడి నిరీక్షిస్తూ నిత్యం నరకం చూస్తున్నారు. కనీస అవగాహన లేని డీలర్లు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో ఈ-పాస్ (ఎలక్ట్రానిక్ పేమెంట్ అండ్ అప్లికేషన్ సిస్టమ్) విధానం అమలులోకి వచ్చి అప్పుడే పక్షం రోజులైంది. కానీ నేటికీ ఈ విధానం గాడిలో పడలేదు. ఆదా పేరుతో ఆర్భాటంగా ప్రారంభించిన ఈ విధానం వల్ల ప్రజలు నిత్యం అగచాట్లకు గురవుతున్నారు.
జీవీఎంసీ పరిధిలోని 412 షాపులు, భీమిలి, అనకాపల్లి, యలమంచలి, నర్సీపట్నం మున్సిపాల్టీల పరిధిలో 274 షాపుల్లో ఈనెల 1వ తేదీ నుంచి ఈ పాస్ విధానానికి శ్రీకారం చుట్టారు. రోజులు గడుస్తున్నాయే తప్ప..పరిస్థితులు మాత్రం చక్కబడే అవకాశాలు కన్పించడం లేదు. ప్రతీరోజూ సగానికి పైగా మిషన్లు మొరాయించడం లేదా సర్వర్లు డౌన్ కావడం.. నెట్ వర్క్‌లు పనిచేయకపోవడం నిత్యకృత్యమైపోయింది.
తొలగని బాలారిష్టాలు
ఈ పాస్ మిషన్‌లో రేషన్‌కార్డు వివరాలను ఫీడ్ చేసి ఆధార్ నెంబర్లను అనుసంధానం చేయాలి. రేషన్‌కార్డు నెంబర్ ఎంటర్ చేయగానే హైదరాబాద్‌లోని సెంట్రల్ సివిల్ సప్లయిస్ సర్వర్‌తో, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే బెంగుళూరులోని ఆధార్ సర్వర్‌తో కనెక్ట్ అవుతుంది. వేలిముద్రలు తీసుకోగానే వాటిని సెంట్రల్ సర్వర్ నుంచి సరిపోల్చుకుంటుంది. అన్నీ సరిపోతే ఆ రేషన్‌కార్డులో ఎంతమంది సభ్యులు న్నారు? వారికి ఏ సరుకులు ఎంత మేరకు కేటాయించారు? వాటిధరఎంత? అనే వివరాలు మిషన్‌లో చూపిస్తాయి. ఇదంతా సెకన్లలో జరిగిపోవాలి. సక్రమంగా పనిచేస్తే ఒక్కో కార్డుకు వివరాలు అప్‌లోడ్ చేసి సరకులు ఇచ్చేందుకు అరగంటకు పైగా సమయం పడుతోంది.
కానీ అన్ని వివరాలు ఫీడ్ చేసిన తర్వాత సర్వర్ డౌన్ అని రావడం లేదా సిగ్నల్ వ్యవస్థ పనిచేయక పోవడం వంటి సమస్యలతో అదేపనిగా వేలిముద్రలు తీసుకోవడం.. వివరాలు ఫీడ్ చేయడంతోనే సరిపోతుంది. ఒకే అని సమాధానం వచ్చేవరకు ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ సమస్యల వల్ల డిపోలకు వచ్చిన కార్డుదారుల్లో కనీసం 10 శాతం మందికి కూడా సరుకులు పంపిణీ చేయలేకపోతున్నారు. ఈ విధానంలో ఒక్కో రేషన్‌షాపులో రోజుకు నలుగురైదుగురుకు మించి ఇవ్వలేకపోతున్నారు. దీంతో సరకులు కోసం కార్డుదారులు గంటల తరబడి నిరీక్షించాల్సిన వస్తోంది.
డిపోల వద్ద ఆందోళనలు
కొన్ని డిపోల వద్ద కార్డుదారులకు డీలర్లకు మధ్య ఘర్షణవాతావరణం కూడా చోటు చేసుకుంటోంది. ఇటీవల కలెక్టరేట్‌ను ముట్టడించి కార్డుదారులు ఆందోళన చేశారు. అలాగే దొండపర్తి, గాజువాక, గోపాలపట్నం, వన్‌టౌన్ ఏరియాల్లో పెద్దఎత్తున నిరసన వ్యక్తంచేశారు. వన్‌టౌన్ పప్పులవీధిలోని రేషన్‌షాపులో ఈ పాస్ మిషన్ పనిచేయక పోవడంతో శనివారం డిపోకు వచ్చిన డీఎస్‌ఒ రవితేజనాయక్‌ను కార్డుదారులు నిలదీశారు. ఒక్క విశాఖలోనే కాదు మిగిలిన మున్సిపాల్టీల్లో కూడా ఇదే రీతిలో సరకులందక కార్డుదారులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.
సిగ్నల్ సమస్య వేధిస్తున్న మారుమూల ప్రాంతాల్లోని డిపోలను మూసివేసిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం జీవీఎంసీతో పాటు మిగిలిన మున్సిపాల్టీల్లో దాదాపు అన్ని రకాల సెల్‌టవర్లు ఉన్నాయి. అయినప్పటికీ సిగ్నెల్స్ లేకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. మిషన్లలో లోపమా.. లేక నెట్‌వర్కింగ్‌లో లోపమో అంతుచిక్కని సమస్యగా తయారైంది. ఉన్న కొద్దిపాటి టెక్నీషియన్లు మిషన్ల మరమ్మతుల పేరుతో ఆ మూల నుంచి ఈ మూలకు.. ఈ మూల నుంచి ఆ మూలకు తిరిగలేక అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు 2జీ సిమ్‌ల స్థానంలో దాదాపు అన్ని డిపోలకు 3జీ సిమ్‌లు, యాంటినాలు సరఫరా చేసినా పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదు.
అక్కరకు రాని రైల్వే సర్వర్
మాలుమూల ప్రాంతాల్లో సైతం పనిచేసే అత్యాధునిక సర్వర్ వ్యవస్థ రైల్వేశాఖలోనే ఉంది. దీంతో ఈపాస్‌లో సర్వర్ సమస్యలను అధిగమించేందుకు రైల్వే శాఖాధికారులతో చర్చించి ఆ సర్వర్‌తో ఈ పాస్‌మిషన్లను అనుసంధానంచేయాలని రెవెన్యూ అధికారులు చేసిన కృషి ఫలించలేదు. గురువారం రాత్రికే ఈ సర్వర్ అందుబాటులోకి వస్తుందని, శుక్రవారం నుంచిసర్వర్ సమస్యలుండవని చెప్పినిప్పటికీ రైల్వేసర్వర్ జాడ లేదు.
ఇక ఆరు జిల్లాలకు ప్రత్యేకంగా ఒక సర్వర్‌ను ప్రభుత్వం ఆదివారంలోగా అందుబాటులోకి తీసుకొస్తుందని ప్రకటించినా దాని జాడ కూడా కన్పించలేదు. ఇక ఈ పాట్లు పడలేక నర్సీపట్నంలోని ఎంపిక చేసిన 10 డిపోల్లో గతంలో మాదిరి గానే బియ్యం, ఇతరనిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. ఈ పాస్ ఇక్కట్లు తొలిగే వరకు ఈ నెలకు పాతపద్ధతిలోనే పంపిణీ చేయాలన్న భావనలో అధికారులున్నట్టు తెలిసింది.