సాక్షి ప్రతినిధి కడప: అధికారుల మెప్పుకోసం అనామకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారా.. సిబ్బంది మాటలు నమ్మి ఉన్నతాధికారులు తప్పులో కాలేస్తున్నారా.. సంచలనాల కోసమే అడ్డదారులు ఎంచుకున్నారా.. అంటే అవుననే పరిశీలకులు వెల్లడిస్తున్నారు. అందుకు సాక్ష్యాధారాలతో ఫారెస్టుశాఖ సిబ్బంది అడ్డంగా దొరికిపోయారు. ఆపై ఏకంగా డీఎఫ్‌ఓను బురడీ కొట్టించారు. చెక్క డిపోల నుంచి వంట చెరుకు వినియోగించే పాత మొద్దులు తీసుకెళ్లి అడవిలో ఎర్రచందనం దుంగలు స్మగ్లింగ్ చేస్తుంటే పట్టుబడినట్లుగా 12 సెక్షన్లతో కేసులు నమోదు చేసిన వైనమిది.
ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడంలో ఎవరికి వారు ఫోకస్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈక్రమంలో అనామకులను అక్రమ కేసుల్లో ఇరికించి పబ్బం గడుపుకుంటున్నారు. ఆపై అంతర్జాతీయ స్మగ్లర్లతో లింకులున్నాయంటూ వెల్లడిస్తూ మీడియాకు ఎక్కుతున్నారు. ఇటీవల ఫారెస్టు యంత్రాంగం నమోదు చేసిన ఓ కేసు ఈ కోవకే చెందింది. వేంపల్లె రేంజ్, వెల్లటూరు బీట్ పరిధిలో గంగనపల్లె రిజర్వు ఫారెస్టు పరిధిలో ఓబుళరెడ్డి చెరువు వద్ద పట్టుబడినట్లు ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. షాసూన్‌వల్లీ, షేక్ మౌలాలీ, కరీముల్లా, సాదు శ్రీనివాసులు, షేక్ రాజాలను అరెస్టు చేశారు. వీరంతాఆగస్టు 12 రాత్రి 11.40 గంటల ప్రాంతంలో వెల్లటూరు సమీపంలోని ఓబుళరెడ్డి చెరువు సమీపంలో అరెస్టు చేసినట్లు రిమాండ్ రిపోర్టులో రాశారు. ఆమేరకు కడప డీఎఫ్‌ఓ శివప్రసాద్ నేతృత్వంలో ఆగస్టు 13న మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. వారిలో పాత మొద్దులు విక్రయించి జీవనం పోసుకునే ముగ్గురిపై అక్రమ కేసు బనాయించారని తేటతెల్లమౌతోంది. ఆమేరకు ఫారెస్టు యంత్రాంగం చొప్పంచిన కట్టుకథను సీసీ కెమెరా ఫుటేజీలు బట్టబయలు చేస్తున్నాయి.
చెక్క డిపోల వారిపై తప్పుడు కేసులు....
ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన షేక్ మౌలాలీ (శ్రీనివాసనగర్), షేక్ కరీముల్లా (రాయల్ ఫంక్షన్ హాల్) సాదు శ్రీనివాసులు (దేవాంగపేట) ముగ్గురు చెక్క డిపోలను నిర్వహిస్తున్నారు. పాత మొద్దులు టన్ను రూ.470తో కొనుగోలు చేసి వాటిని కూలీలు ద్వారా వంట చెరుకుగా మార్చి టన్ను రూ.550తో విక్రయించి జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో పలు ప్రాంతాల నుంచి పాతచెక్క కొయ్యలను సేకరించి విక్రయించే నిమిత్తం ఆయా ప్రాంతాల్లో నిల్వ చేసుకున్నారు. కాగా ఆగస్టు 8వ తేదీ సాయంత్రం 7.40 నిమిషాలకు క్వాలిస్ వాహనంలో ఓ బృందం చెక్క డిపోల వద్దకు చేరింది. చెక్క డిపోలో ఉన్న పాత మొద్దులను పరిశీలించింది. 10నిమిషాల్లో కొన్ని పాత మొద్దులతో పాటు నిర్వాహకులను అదే వాహనంలో తీసుకొని వెళ్లారు. ఇదంతా కూడా అందుబాటులో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీల్లో రికార్డు అయింది. ఆగస్టు 8 రాత్రి నుంచి ఆ ముగ్గురు ఫారెస్టు అధికారుల అదుపులో ఉన్నారు. కాగా ఆగస్టు 12వ తేదీ రాత్రి పై ముగ్గురితో పాటు మరో ఇద్దరు ట్రాక్టర్‌లో దుంగలు తరలిస్తూ ఫారెస్టు సిబ్బందిని చూసి పరారీ అవుతుంటే చుట్టుముట్టి అందర్నీ అదుపులోకి తీసుకున్నట్లు కేసు నమోదు చేశారు. అదే విషయాన్ని రిమాండ్ రిపోర్టులో పొందుపర్చారు. ఆ ఐదుగురిలో ఎవరు దుంగలు నరికారు, ట్రాక్టర్ డ్రైవింగ్ చేసిందెవరు అన్న విషయాలను పొందుపర్చలేదు. మరోవైపు చెక్క డిపోనుంచి స్వాధీనం చేసుకున్న పాత మొద్దులను తోపడా చేయించి (పై తాట తీయించి) పట్టుబడిన ఎర్రచందనం దుంగలుగా నమోదు చేయించారు. ఆపై 12 సెక్షన్లతో కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. తెలిసీ చేసినా తెలియక చేసినా ఎర్రచందనం దుంగలు అందుబాటులో ఉంచుకోవడం నేరమే కావచ్చు. కాకపోతే అందుబాటులో ఉన్న పాత మొద్దులే ఎర్రచందనం దుంగలుగా కేసు నమోదు చేస్తే ఎవ్వరికి అభ్యంతరం లేదు. పైగా అడవిలోకి వెళ్లి అక్రమంగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా 12 సెక్షన్లతో కేసు నమోదు చేయడాన్ని ప్రజాస్వామ్యవాదులు తప్పుబడుతున్నారు. సంచలనాల కోసం రివార్డుల కోసం తప్పుడు కేసులు నమోదు చేయడంపై ఆక్షేపిస్తున్నారు.
విద్యాధికులు కుటుంబం వీధిపాలు....
ప్రొద్దుటూరు పట్టణానికి చెందిని షేక్ కరీముల్లా, కలీమా దంపతులు విద్యాధికులు. కరీముల్లా ఎంబీఏ చదివారు, కలీమా ఎంఏ చేసింది. ఇరువురు అన్యోన్యంగా జీవిస్తున్నారు. వారు నివాసం ఉంటున్న ఏరియాలో కరీముల్లా మంచి మనస్సు ఉన్న వ్యక్తిగా స్థానికులు వెల్లడిస్తున్నారు. కాగా ఆ దంపతులు పాలిట ఫారెస్టు యంత్రాంగం కర్కశకంగా వ్యవహరించిందని పలువురు ఆరోపిస్తున్నారు. చెక్క డిపో నిర్వహణలో తప్పులు దొర్లి ఉంటే ఆమేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటే ఎవ్వరు అభ్యంతరం చెప్పకపోవచ్చు. కాగా ఫారెస్టు యంత్రాంగం అక్రమంగా రిజర్వు ఫారెస్టులోకి చొరబడి ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేసినట్లుగా 12సెక్షన్లతో కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. భర్తపై అక్రమ కేసులో బనాయించి అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న కలీమా తల్లడిపోయింది. గర్భిణిగా ఉన్న అమె ప్రీ మెచ్యూరీటీ పాపకు జన్మనిచ్చిందని స్థానికులు వాపోతున్నారు. విద్యాధికులుగా ఉన్న ఆ దంపతుల పట్ల ఫారెస్టు యంత్రాంగం దారుణ వైఖరిని ప్రదర్శించిందని పలువురు వాపోతున్నారు.
నాకేమీ తెలియదు: ఇన్‌ఛార్జి డీఎఫ్‌ఓ నాగరాజు
ఈవిషయమై డీఎఫ్‌ఓ నాగరాజు వివరణ కోరగా రెగ్యులర్ డీఎఫ్‌ఓ శివప్రసాద్ సెలవులో వెళ్లారు. కేసు పూర్వపరాలు తనకేమీ తెలియవని ఇన్‌ఛార్జి డీఎఫ్‌ఓ నాగరాజు సాక్షి ప్రతినిధికి వెల్లడించారు.
తప్పుడు కేసులు ఉపేక్షించవద్దు
ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టాల్సిందే. ఈ క్రమంలో అనామకులపై తప్పుడు కేసులు ఏమాత్రం ఉపేక్షించరాదు. ఎర్రచందనం ఉన్నట్లు గుర్తిస్తే ఆమేరకు కేసులు నమోదు చేసే ఎవ్వరికీ అభ్యంతరం చెప్పాల్సిన పనిలేదు. చెక్కడిపోల ద్వారా వంటచెరుకు విక్రయించుకునే వారిపై తప్పుడు చేసులు నమోదు చేయడం అన్యాయం. ఫారెస్టు రిమాండ్ రిపోర్టులోనే డొల్లతనం తేటతెల్లం అవుతోంది. అక్రమ కేసులు బనాయించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే. తప్పుడు కేసులు నమోదు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి.జయశ్రీ, మానవ హక్కులవేదిక జిల్లా కన్వీనర్
Comments
Please login to add a commentAdd a comment