సాక్షి ప్రతినిధి, కర్నూలు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత లు, కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్న పోలీసులపై కోర్టుల్లో కేసులు వేయనున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో తప్పుడు కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. ఏ పార్టీ పూర్తి స్థాయిలో అధికారంలో ఉండదనే విషయాన్ని గ్రహించాలన్నారు. బుధవారం నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పార్టీకి మద్దతిచ్చిన ఎంపీటీసీని కిడ్నాప్ చేయించానంటూ తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని.. స్వయంగా ఎంపీటీసీనే హైకోర్టుతో పాటు మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేయడంతో ఈ కేసును హైకోర్టు కొట్టివేసిందన్నారు.
ఇలాంటి తప్పుడు కేసులకు భయపడేది లేదని.. తప్పుడు కేసులు నమోదు చేసిన పోలీసులపై తిరిగి కోర్టులో ఫిర్యాదు చేయనున్నట్టు వివరించారు. తమ ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యేలకు అభివృద్ధి పనుల కోసం ఒక్క రూపాయి కేటాయించకుండా గ్రామాలను ఎలా దత్తత తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గోదాట్లో మునిగి.. ప్రజలను కూడా గోదాట్లో ముంచారన్నారు. గోదావరి పుష్కరాల్లో రూ.1800 కోట్లు ఖర్చు చేసి కనీస సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారని విమర్శించారు. మంత్రులను పట్టించుకోకుండా వన్ మ్యాన్ షో చేసినందుకే ఈ దుర్ఘటన జరిగిందన్నారు. మంత్రులను ఇన్‌చార్జీలుగా నియమించకుండా గాడిదలు కాయిస్తున్నారా అని ఘాటుగా ప్రశ్నించారు. రాజమండ్రి పుష్కర బాధితులకు పార్టీ తరపున ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
త్వరలో మండల, గ్రామ కమిటీలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీతో పాటు అనుబంధ కమిటీలను కూడా ప్రకటించామని బుడ్డా రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. త్వరలో మండల, గ్రామస్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నామన్నారు. అదేవిధంగా అన్ని అనుబంధ కమిటీలను కూడా మండల, గ్రామస్థాయిలో ఏర్పాటు చేస్తామన్నారు. తద్వారా పార్టీని మరింత పటిష్టం చేసి ప్రజల పక్షాన పోరాడతామని ప్రకటించారు. విలేకరుల సమావేశంలో పార్టీ సంయుక్త కార్యదర్శి తెర్నేకల్లు సురేందర్ రెడ్డి, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి భరత్‌కుమార్ రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మద్దయ్య, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రెహమాన్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు నారాయణమ్మ, మైనార్టీ సెల్ కన్వీనర్ రియాజ్, సిటీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు అనిల్ తదితరులు పాల్గొన్నారు.
పోలీసులూ.. తప్పుడు కేసులొద్దు
Published Thu, Jul 16 2015 3:57 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
Advertisement
Advertisement