ఈ మాత్రలతో వైకుంఠయాత్రే!
సాక్షి, హైదరాబాద్: జ్వరం వస్తే పారాసిటిమాల్ వేసుకుంటాం.. ఒళ్లు నొప్పులుంటే బ్రూఫిన్. అవి నాసిరకమైతే పెద్ద నష్టమేం లేదులే అనుకుంటాం. కానీ గుండెపోటు వచ్చే సమయంలో ఇచ్చే మందులు కూడా నాసిరకం అని తేలితే... గుండె ఆగినంత పనవుతుంది. ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేసిన మందుల్లో 15 రకాల మందులు నాసిరకమేనని తేలింది! ఆఖరుకు అత్యవసర మందుల్లో ప్రధానమైనదిగా చెప్పుకునే (గుండెపోటు వచ్చే సమయంలో ఇచ్చే) ఐసోసార్బైడ్ డైనైట్రేట్ 10 ఎంజీ కూడా నాసిరకమే.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు 2,500 ప్రభుత్వ ఆస్పత్రులకు ఇలాంటి నాసిరకమైన మందులు సరఫరా అయ్యాయి. కొన్ని కంపెనీలు సరఫరా చేస్తున్న మెట్రొనిడజోల్, బ్రూఫిన్, పారాసిటిమాల్ లాంటి తరచూ వాడే మందులూ నాసిరకం అని తేలాయి. ఔషధ నియంత్రణ శాఖ పరీక్షల్లో తేలినవి ఇవి కొన్ని మాత్రమే. ప్రైవేటు ల్యాబొరేటరీ (టెస్టింగ్ ల్యాబొరేటరీల్లో) లలో నాసిరకం అని తేలినా చర్యలుండవు. ఉభయ రాష్ట్రాల్లోనూ 230 రకాల వరకూ ఎసెన్షియల్ మందులు కొంటారు. ఒక్కో మందు (డ్రగ్)కు సంబంధించి ఒక్కో త్రైమాసికానికి 30 నుంచి 50 బ్యాచ్‌లు టెస్టింగ్ ల్యాబొరేటరీకి పంపించాల్సి ఉంటుంది.
మనకు ఔషధ నియంత్రణ (డీసీఏ) ల్యాబొరేటరీతోపాటు మరో ఐదు ప్రైవేటు టెస్టింగ్ ల్యాబొరేటరీలు ఉన్నాయి. అయితే ప్రైవేటు ల్యాబొరేటరీల పరీక్షల్లో నాసిరకం అని తేలితే... మౌలిక వైద్యసదుపాయాల సంస్థలో పనిచేసే ఫార్మసిస్ట్‌లు వెంటనే సరఫరాదారుడికి సమాచారమిస్తారు. ఆ సరఫరాదారుడు నాసిరకం బ్యాచ్ ను పక్కన పడేసేలా చేసి, మరో బ్యాచ్‌ను అనాలసిస్‌కు పంపించి ఓకే అనిపిస్తారు. ఇలా కొన్ని వందల రకాల బ్యాచ్‌లు నాసిరకం అని తేలినా జనానికి ఇచ్చి మింగిస్తూనే ఉన్నారు.
మూడేళ్ల పాటు నిషేధం
2014-15 సంవత్సరానికి నాసిరకం మందులుగా తేల్చిన వాటిని మూడేళ్ల పాటు నిషేధం విధిస్తూ ఏపీ, తెలంగాణకు చెందిన మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీ, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ)లు ప్రకటించాయి. నాసిరకం అని తేలిన రోజు నుంచి మూడేళ్లు అంటే 2017 వరకూ ఆయా కంపెనీలు తయారు చేసే మందులను కొనుగోలు చేయకూడదు. నిషేధం విధించిన మందులే కాకుం డా ఆ కంపెనీ తయారుచేసే ఏ ఇతర ఉత్పత్తులను కూడా కొనుగోలు చేయకూడదనే నిబంధన ఉంది. నాసిరకం అని నిర్ధారణ అయినా చాలా ఆస్పత్రుల్లో ఆ మందులు వినియోగం ఇప్పటికీ అవుతున్నట్టు తేలింది.