శంషాబాద్, న్యూస్‌లైన్: తల్లికి ఓటేసేందుకు విదేశాల నుంచి వచ్చి ఓ వ్యక్తి తన కుమారుడిని కోల్పోయాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. శంషాబాద్ ఎంపీటీసీ అభ్యర్థిగా రెండో వార్డులో కాంగ్రెస్ పార్టీ తరఫున జులేకాబేగం పోటీలో ఉన్నారు. ఆమె రెండో కుమారుడు రఫీయుద్దీన్ సౌదీ అరేబియాలోని మదీనాలో మొబైల్ వ్యాపారం చేస్తున్నాడు. తల్లి ఎన్నికల బరిలో ఉండడంతో రఫీ శుక్రవారం ఉదయం భార్యాపిల్లలతో స్వస్థలానికి బయలుదేరాడు. శంషాబాద్ విమానాశ్రయంలో దిగాక క్యాబ్ తీసుకొని ఇంటికి వచ్చాడు. రఫీయుద్దీన్ కుమారుడు దానీష్ అహ్మద్(3) ఇంట్లోకి వెళ్లి నానమ్మతో పాటు అందరిని పలకరించి తిరిగి కారు వద్దకు వచ్చాడు. అప్పటికి తల్లిదండ్రులు సామాన్లు తీసుకొని ఇంట్లోకి వెళ్తున్నారు.
డ్రైవర్ గమనించకుండా వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. దీంతో చిన్నారి కారు చక్రాల కిందపడి అక్కడికక్కడే ప్రాణం వదిలాడు. శుక్రవారం బాలుడి పుట్టిన రోజు కూడా కావడంతో కుటుంబ సభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు.