వైఎస్‌ఆర్ జిల్లా , రాయచోటి టౌన్ : పుడుతూ అన్నదమ్ములు....పెరుగుతూ దాయాదులు అనే నానుడి మన సమాజంలో ఉంది. ఇందుకు ఈ సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. తోడబుట్టిన తమ్ముడినే అన్నలు అనాథను చేశారు. అతని పేరుతో ఉన్న ఆస్తిని తమ వశం చేసుకుని అతన్ని ఆసుపత్రిలో పడేసి వెళ్లిపోయారు..ప్రస్తుతం కడప రిమ్స్‌లో అనాథలా ఉన్న ఆ అభాగ్యుడి దీన గాథ అతని మాటల్లోనే..
నా పేరు మన్నేరు శివశంకర్. మాది రామాపురం మండలం మన్నేరువాండ్లపల్లె. మా నాన్న పేరు సిద్ధయ్య. మా నాన్నకు మల్లమ్మ, చాలమ్మ అని ఇద్దరు భార్యలు. వారిలో పెద్ద భార్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చిన్న భార్య అయిన నా తల్లికి నేనొక్కడినే కుమారుడిని.
మా అన్నలు, అక్కకు వివాహాలు అయ్యాయి. నేను పెళ్లి చేసుకోలేదు. మా అన్నల ఇళ్లలోనే గొర్రెలు, మేకలు పేపుతూ వారు పెట్టే అన్నం తినిబతికేవాడిని. ఈ పరిస్థితిలో నాకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో నా ఆస్తిపై మా అన్నల కళ్లు పడ్డాయి. అందుకు మా నాన్న కూడా సహకరించాడు. మాకు సుమారు 16 ఎకరాల వరకు భూమి ఉంది. అందులో సాగు భూమి 7 ఎకరాలకు పైగా ఉంది. నాకు రావాల్సిన వాటా కూడా వారే కాజేయాలని పథకం పన్నారు. మా పెద్దన్న నాకు మద్యం తాగించి బాండు పేపర్లపై వేలి ముద్రలు వేయించుకున్నాడు. దీంతో మరో అన్నయ్య కోర్టును ఆశ్రయించాడు. దీంతో గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని నా ఆస్తికి సంబంధించి నాకు ఆరు లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పారు. చివరికి మరో సారి పంచాయితీ పెట్టించి రెండు లక్షలు మాత్రమే ఇస్తామని బెదిరించారు. అందులో కూడా లక్షా 20 వేలు మాత్రమే నా చేతికి ఇచ్చారు. ఆ తర్వాత నన్ను సుమారు 15 రోజుల క్రితం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో పడేసి వెళ్లారు. ఇక్కడి డాక్టర్లు, నర్సులు వైద్యం చేస్తుండంతో కొంత ఊపిరితో ఉన్నాను. ఇక్కడి వైద్యులు కూడా శుక్రవారం కడప రిమ్స్‌కు పంపించారు. రక్త సంబంధీకులు ఉండి కూడా నేను అనాథలా ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది.. అని అతను కన్నీటి పర్యంతమయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment