కోవెలకుంట్ల: వ్యవసాయ జూదంలో ఓ రైతు ఓడిపోయాడు. నాలుగేళ్లుగా వ్యవసాయం అచ్చిరాక పెట్టుబడుల కోసం చేసిన అప్పులు అన్నదాత ఊపిరి తీశాయి. అప్పుల బాధ తాళలేక కంటమనేని రాఘవేంద్ర(34) అనే యువరైతు మంగళవారం క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అందించిన సమాచారం మేరకు వివరాలు.... కృష్ణాజిల్లా అవనిగడ్డ ప్రాంతానికి చెందిన కంటమనేని వెంకట్రావు కుటుంబం 50 సంవత్సరాల క్రితం కోవెలకుంట్లకు వలస వచ్చింది. పట్టణ శివారులోని పేరా బిల్డింగ్స్ సమీపంలో నివాసం ఉంటూ వ్యవసాయాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు.
వ్యవసాయంలో కష్టపడి పని చేసి నాలుగెకరాల పొలం సంపాదించుకున్నారు. సొంతపొలంతోపాటు కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. ఈయనకు ఇద్దరు కుమారులు రాఘవేంద్ర, కృష్ణ సంతానం. కుమారులిద్దరూ త ండ్రిబాటలోనే నడిచి వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకున్నారు. పెద్దకుమారుడు రాఘవేంద్ర తండ్రికి తోడుగా వ్యవసాయం చేసేవాడు. సొంత పొలంతోపాటు ఎకరాకు 20 బస్తాల వడ్లలు చెల్లించేలా మరో 14 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని వరిపంట పండిస్తున్నాడు. నాలుగేళ్ల నుంచి వాతావరణం అనుకూలించక పెట్టుబడులు పెరిగిపోయి, దిగుబడులు అంతంత మాత్రంగానే వచ్చాయి. మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేకపోవడంతో నష్టాల ఊబిలో కూరకుపోయాడు.
పెట్టుబడుల కోసం ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ. 20 లక్షల మేర అప్పులు చేశాడు. వ్యవసాయం కలిసి రాకపోవడం, చేసిన అప్పులు పెరిగిపోవడం, అప్పు చెల్లించాలంటూ ఒత్తిళ్లు అధికం కావడంతో కొంతకాలం నుంచి రాఘవేంద్ర తీవ్ర మనోవేదనకు గురిఅయ్యాడు. అప్పులు చెల్లించేందుకు ఉన్న మార్గాలన్నీ మూసుకపోవడం, అప్పులు చెల్లించేందుకు మరో మార్గం లేకపోవడంతో క్రిమిసంహారక మందు తాగి తనువు చాలించాడు. మృతునికి భార్య పద్మ, నాల్గో తరగతి చదువుతున్న కుమార్తె మహాలక్ష్మి, రెండో తరగతి చదువుతున్న కుమారుడు తేజ ఉన్నారు. అప్పుల బాధతో రాఘవేంద్ర ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు, మున్నీరుగా విలపిస్తున్నారు.
అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య
Published Wed, Mar 18 2015 3:07 AM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM
Advertisement
Advertisement