కోకకోలా కర్మాగారం రైతుల పాలిట శాపంగా మారిందని సీపీఐకు అనుబంధంగా ఉన్న రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామిశెట్టి వెంకయ్య అన్నారు.
శ్రీకాళహస్తి: కోకకోలా కర్మాగారం రైతుల పాలిట శాపంగా మారిందని సీపీఐకు అనుబంధంగా ఉన్న రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామిశెట్టి వెంకయ్య అన్నారు. మండలంలోని కాపుగున్నేరి,చల్లపాళెం గ్రామాల సమీపంలోని హిందుస్థాన్ కోకకోలా బేవరేజెస్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గ్రీన్‌బెల్ట్ భూములను బుధవారం ఆయనతోపాటు పలువురు సీపీఐ నాయకులు, స్థానిక సర్పంచ్, మాజీ సర్పంచ్ పరిశీలించారు.
ఈ సందర్భంగా వెంకయ్య మీడియూతో మాట్లాడుతూ కిలోమీటర్ పొడవున పంట కాలువను కోకకోలా కర్మాగారం వారు ఆక్రమించారని ఆరోపించారు. అంతేకాకుండా 850అడుగుల లోతుతో 7బోర్లు వేసిన కారణంగా చుట్టుపక్కల చిన్నపాటిబావులు,బోర్లు ఎండిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయూరని ఆవేదన వ్యక్తంచేశారు. ఏఐటీయూ జిల్లా కార్యదర్శి రాయపనేని హరికృష్ణ మాట్లాడుతూ కర్మాగారం వదిలేస్తున్న కలుషితమైన నీళ్లతో పచ్చటి పంటపొలాలకు నష్టం వాటిలిల్లుతోందన్నారు.
సోలార్‌పవర్ కోసం ఏర్పాటు చేసిన మిషనరీ నిబంధనల ప్రకారం పనిచేయకపోవడంతో సమీప ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలుతున్నాయని విమర్శించారు. ఫ్యాక్టరీకి చెందిన మురుగునీరును రాత్రి సమయంలో పంటకాలువల్లోకి వదిలిపెడుతున్నారని.... దాంతో పంటలు సర్వనాశనం అవుతున్నాయని ఆవేదన చెందారు.గ్రీన్‌బెల్ట్ భూముల పేరుతో ప్రభుత్వ పంటకాలువలు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు.
సీపీఐ ఏరియా కార్యదర్శి జనమాల గురవయ్య మాట్లాడుతూ చల్లపాళెంకు చెందిన ఓ టీడీపీ నాయకుడు ఫ్యాక్టరీకి తొత్తుగా మారి పోయి రైతులకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వపంట కాలువలు ఆక్రమించి...ఫ్యాక్టరీకి విక్రయించి నాయకులు లక్షలు నొక్కేశారని ఆరోపించారు. చల్లపాళెం మాజీ సర్పంచ్ జయరామిరెడ్డి మాట్లాడుతూ ఫ్యాక్టరీకి పొలాలు తీసుకునే సమయంలో ఇంటి కో ఉద్యోగం ఇస్తామని చెప్పిన యాజ మాన్యం... బోనస్‌గా ఇంటికో రోగిని త యారుచేసిందని ఆవేదనవ్యక్తంచేశారు.
ఆక్రమణల మాట వాస్తవం కాదు....
లక్ష్మి బాలాజీ వారి నుంచి హిందూస్థాన్ కోకకోలా బేవరేజస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కొనుగోలు చేసింది. అంతేతప్ప మేము భూములు కొనుగోలు చేయలేదు. పవర్‌పాండే ద్వారా వ్యాధులు రావడంలోను నిజంలేదు. ఫ్యాక్టరీ కలుషితమైన నీటిని రాత్రి సమయంలో పంటకాలువలకు వదలడంలేదు. నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నాం. స్థానికులకు అన్యాయం చేయడంలేదు.
-బీఆర్‌సీ రెడ్డి,కోకకోలా ఫ్యాక్టరీ ఇన్‌చార్జి