
నిరీక్షణ!
► మూడో విడత రుణమాఫీ కోసం తప్పని ఎదురుచూపులు
► మార్చి ప్రారంభమైనా ఇంకా ఖాతాల్లో పడని సొమ్ము
► ఎప్పుడు అందుతుందోనని రైతన్నల ఆందోళన
► ముందే అరకొర...ఆపై కొనసాగుతున్న ఆలస్యం
► సాధికారత సంస్థ నుంచి ఎప్పుడు విడుదల చేస్తారో తెలియని పరిస్థితి
సాక్షి, కడప : రుణమాఫీ మూడో విడత సొమ్ము కోసం రైతన్నలు ఎదురుచూస్తున్నారు. 2017కి సంబంధించి మార్చి నెల సగంరోజులు గడిచినా ఇంకా మాఫీ సొమ్ముపై ప్రకటన లేదు. అసలు సొమ్ము ఎప్పుడు ఖాతాల్లో పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే.. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో రైతన్నలకు పూర్తిస్థాయిలోరుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చింది. ఆధార్, రేషన్‌కార్డులు, పాస్‌బుక్కుల పేరుతో వేలాదిమంది రైతులకు మాఫీ సొమ్ము అందకుండా చేశారు. మిగిలిన వారికి కూడా రుణమాఫీ సొమ్మును ఒకేసారి కాకుండా ఐదు విడతల్లో అందించేలా బాండ్లను అందజేసిన ప్రభుత్వం ఇంకా మూడో విడత సొమ్మును జత చేయలేదు. ఇప్పటికి రెండు విడతల్లో అంతంత మాత్రంగా రుణమాఫీ సొమ్ము అందించారు.
తప్పని ఎదురుచూపులు: జిల్లాలోని 33 బ్యాంకులకు చెందిన బ్రాంచ్‌లలో సుమారు 4.20 లక్షలకుపైగా ఖాతాలు ఉన్నాయి. ఇందులో క్రాప్ లోన్లతోపాటు బంగారు, వ్యవసాయ అనుబంధ రుణాలు తీసుకున్న వారు ఉన్నారు. మొదటగా ప్రభుత్వం రూ.1.50 లక్షల వరకు ఒక్కొక్క రైతుకు రుణమాఫీ ప్రకటించింది. అయితే కొందరి ఇళ్లలో ప్రత్యేకంగా రెండు, మూడు ఖాతాలున్నా ఒక ఖాతాకే మాఫీ సొమ్ము అందింది. 2014లో మొదటి పరిశీలనలో 2,78,070 మందికి, రెండవ పరిశీలనలో 1,33,048 మందికి, మూడవ పరిశీలనలో 9,232 మందికి రుణమాఫీని వర్తింపజేశారు. వారికి మొదటి విడత రూ.462 కోట్లను 4,20,350 ఖాతాలకు జమ చేసినట్లు బ్యాంకు అధికారుల రికార్డులు తెలుపుతున్నాయి. రెండో విడతగా రూ.205 కోట్లను విడుదల చేశారు. ప్రస్తుతం 2016–17 మూడవ విడతకు సంబంధించి రైతులు ఎదురుచూస్తున్నారు.
17 వేలమంది దరఖాస్తు చేస్తే, సగంమందికే మాఫీ: 2015లో రుణమాఫీకి సంబంధించి ఏదో ఒక కారణంతో మాఫీ కానీ రైతులను కలెక్టరేట్‌లో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో కలెక్టరేట్‌లో ఒక కేంద్రాన్ని 2015 ఏప్రిల్ 27 నుంచి 2015 జూన్ 7వ తేది వరకు కొనసాగించారు. అప్పట్లో 17,277 మంది రుణమాఫీకి అర్హులమని దరఖాస్తు చేసుకోగా, ప్రభుత్వం 9,232 మందిని మాత్రమే అర్హులుగా ప్రకటించింది. ఆధార్ అనుసంధానం కాలేదనో, రేషన్‌కార్డు సరిపోవడం లేదనో, భూముల్లో తేడాలు ఉన్నాయని, కారణం ఏదైనా తిరస్కరించడంతో మిగతా వారికి రుణమాఫీ సొమ్ము అందలేదు.
మూడో విడత కోసం..: 2016-17కి సంబంధించి రుణమాఫీకి అర్హులుగా ఉన్న రైతులు సొమ్ము కోసం ఎదురుచూస్తున్నారు. ఖరీఫ్ కోసం మార్చి నుంచి రైతులు ఏర్పాట్లు చేసుకుంటారు. అందులోభాగంగా బ్యాంకుల్లో అన్నదాతలు క్రాప్ రుణాలు రెన్యూవల్ చేసుకుంటారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మూడో విడత రుణమాఫీ సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే రెన్యూవల్ చేయడానికి అప్పులు తెచ్చుకోకుండా మూడోకంతుగా ప్రభుత్వం అందించే రూ. 20,30 వేలు అన్నదాతకు వడ్డీ చెల్లించడానికి ఆసరాగా ఉంటుంది. జిల్లాలో 2.25 లక్షల మందికి సుమారు రూ.205 కోట్లు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. రెండవ విడతలో పై మొత్తాన్నే రైతుల అకౌంట్లలో అందజేశారు.
బడ్జెట్ కేటాయింపులు అయిన తర్వాతనే..: రుణమాఫీ సొమ్ము అందడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. బడ్జెట్‌లో రుణమాఫీకి రాష్ట్రవ్యాప్తంగా కేటాయింపులు చేసిన తర్వాతనే విడుదల చేసే అవకాశం ఉంది. దీనిపై మరో నాలుగైదు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏదీ ఏమైనా బడ్జెట్ కేటాయింపులనంతరం ఏప్రిల్‌లో రుణమాఫీ సొమ్ము అందే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.