కనిగిరి: అధికారుల అనాలోచిత నిర్ణయాలు, సర్కారు అలసత్వం రైతుల పాలిట శాపాలుగా మారాయి. రైతులకు సరిపడా విత్తనాలను అందుబాటులో ఉంచకపోవడంతో కనిగిరిలోని మనగ్రోమోర్ కేంద్రం వద్ద శుక్రవారం తొక్కిసలాట జరిగింది. వివరాల్లోకి వెళ్తే...ప్రభుత్వం సబ్సిడీపై అందించే మినుము విత్తనాలు రెండు రోజులుగా పూర్తిస్థాయిలో రైతులకు అందడం లేదు. ఒకటో తేదీ నుంచి విత్తనాల పంపిణీ ప్రారంభించిన అధికారులు తగిన ప్రణాళికతో ముందస్తు చర్యలు చేపట్టలేదు.
దీంతో విత్తనాల కొరత ఏర్పడింది. మనగ్రోమోర్ కేంద్రం వద్దకు శుక్రవారం ఒక్కసారిగా కనిగిరి, హెచ్‌ఎంపాడు, వెలిగండ్ల, పీసీపల్లి మండలాల రైతులు వందల సంఖ్యలో వచ్చారు. కేవలం 17 టన్నుల విత్తనాలే ఉండటంతో కేంద్రం అధికారులు దాన్ని మూసేశారు. అయితే ఏపీ సీడ్స్ నుంచి వచ్చిన మినుము విత్తనాల ప్యాకెట్లలో బస్తాకు 20 బ్యాగులు (నాలుగు కేజీల ప్యాకెట్లు) ఉండాల్సి ఉండగా..17,18 మాత్రమే వచ్చాయని, దీని వల్ల రైతులతో గొడవలొస్తాయని పంపిణీ ఆపినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.
రైతుల ఆందోళన:
రెండు రోజుల నుంచి విత్తనాల కోసం పనులు మానుకొని గ్రోమోర్ కేంద్రం చుట్టూ తిరుగుతున్నా విత్తనాలివ్వడం లేదని రైతులు ఆందోళనకు దిగారు. అధికారులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో మన గ్రోమోర్ నిర్వాహకులు ఏడీఏ ఆదేశాల మేరకు విత్తనాల పంపిణీని ప్రారంభించారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఒకరినొకరు నెట్టుకోవడంతో పలువురు రైతులకు గాయాలయ్యాయి. దీంతో ఎస్సై థెరిస్సా ఫిరోజ్ సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు.
పోలీస్ పహారాలో సబ్సిడీ మినుము విత్తనాలు పంపిణీ చేశారు. సుమారు 800 పర్మిట్లకు విత్తనాలివ్వగా, మరో వెయ్యి మంది రైతులు విత్తనాలందక ఎండలో క్యూలో నిలబడి ఉసూరుమంటూ వెనుతిరిగారు. అధికారుల వైఖరిపై తీవ్రంగా మండిపడ్డారు. ఇదిలా ఉండగా..ఇప్పటికే పర్మిట్లు పొందిన రైతులు విత్తనాలందక ఇబ్బంది పడుతుంటే..కనీస ఆలోచన కూడా లేకుండా శుక్రవారం కూడా వివిధ గ్రామాల రైతులకు విత్తనాల పర్మిట్లు పంపిణీ చేయడం గమనార్హం.
ఏడీఏ ఏమంటున్నారంటే..
దీనిపై ఏడీఏ చల్లా సుబ్బారాయుడును ఁసాక్షి* వివరణ అడగ్గా తమ తప్పు ఏమీలేదని మనగ్రోమోర్ నిర్వాహకుల ఆలస్యం వల్లే సమస్య వచ్చిందన్నారు. మరో లోడ్ విత్తనాలు వస్తున్నాయన్నారు. సమస్యలేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
తూకంలో తరుగు...బ్యాగుల్లో మోసం
రైతులకు పంపిణీ చేసిన విత్తనాల బస్తాల్లోని బాగుల్లో తేడాలు రాగా..కొన్ని బ్యాగుల తూకంలో తరుగు వచ్చాయి. విత్తనాల్లో అరకేజీ, పావుకేజీ వరకు తక్కువగా రావడంతో రైతులు మనగ్రోమోర్ నిర్వాహకులపై వాదనకు దిగారు. విత్తనాల తరుగుతో..ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చినా రైతులకు ఉపయోగం లేకుండా పోతోందన్నారు. సంచుల్లో విత్తనాలు నాలుగు కేజీల బరువు లేవంటూ హనుమంతునిపాడు, కనిగిరి, వెలిగండ్ల మండలాలకు చెందిన రైతులు గొడవకు దిగారు.
దీంతో ఎస్సై సమక్షంలో నిర్వాహకులు బస్తాలో బ్యాగులను లెక్క వేశారు. బ్యాగులు తక్కువగా ఉండటంతో ఆ బస్తాను తొలగించి వేరే బస్తాను రైతుకు ఇచ్చారు. అంతేగాక బ్యాగుల్లో నాలుగు కేజీల మినుము విత్తనాల్లేవు. ప్రతి సంచిలో అరకిలో వరకు విత్తనాలు తగ్గడంపై రైతులు గొడవ చేశారు. తాము ఏమీ చేయలేవని బ్యాగులకు రంధ్రాలు పడి పోయాయని.. కావలంటే ఏపీ సీడ్స్ అధికారులకు, వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేసుకోవాలని స్పష్టం చేశారు.
విత్తనాల కోసం పాట్లు
Published Sat, Sep 6 2014 2:07 AM | Last Updated on Thu, Oct 4 2018 4:39 PM
Advertisement
Advertisement